Breaking News
Join This Site
మహాలయ అమావాస్య

మహాలయ అమావాస్య

భాద్రపద మాసంలో ఉండే కృష్ణపక్షాన్ని పితృపక్షం అంటారు. అది పితృదేవతలకు తర్పణం శ్రాద్ధకర్మలు చేయడానికి అతి పవిత్రమైన పక్షం. ఆ పక్షంలో చివరి రోజైన అమావాస్య శ్రాద్ధ కర్మలు చేయడానికి అతి ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ప్రస్తుత కాలంలో సనాతన హిందువులు ప్రతి అమావాస్య రోజు తర్పణాలు-అర్ఘ్యాలు వదులుతారు. ప్రతి సంవత్సరం సాంవత్సరీక శ్రాద్ధం పెడతారు. అయితే భాద్రపద కృష్ణపక్షానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? ఈ పక్షంలో ఇలాంటి కర్మలు చేయడంవల్ల ప్రత్యేక ప్రభావం ఉంటుంది. యమధర్మరాజు ఇచ్చిన వరంవల్ల ఈ పక్షంలో సమర్పించిన నివేదనలన్నీ పితృదేవతలకు తొందరగా, నేరుగా చేరుకుంటాయి.
దీనికి సంబంధించి మహాభారతంలో ఒక కథ ఉంది. మహాభారతంలో మహావీరుడైన దానవీర కర్ణుడు తన తనువు చాలించిన తర్వాత ఊర్ధ్వ లోకాలకు వెళ్లి అక్కడ వీరులుండే స్థానాన్ని చేరాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు అతడు చేసిన అసామాన్యమైన దానధర్మాల ఫలితానికి వేయిరెట్లు అతడికి లభించాయి. అయితే ఆ ఫలితాలన్నీ బంగారం, వెండి రూపంలో మాత్రమే ఉన్నాయి. ఈ భూమిపై కర్ణుడు ఎన్నో దానధర్మాలు చేసినా అవన్నీ ధనం, సంపద రూపంలోనే కాని, అన్నదాన రూపంలో చేయలేదు. అందుకే తన చుట్టూ ఎంతో బంగారం, ధనం, సంపద ఉన్నా తినడానికి మాత్రం పట్టెడన్నం లేదు. అతడు యమధర్మరాజును ప్రార్థించాడు. యమధర్మరాజు ప్రత్యక్షమై పద్నాలుగు రోజులు మర్త్య(భూ)లోకానికి వెళ్లి తాను ఇదివరలో ఉపేక్ష చేసిన అన్నదానం పూర్తిచేసుకుని రమ్మని వరం ఇచ్చాడు. కర్ణుడు పద్నాలుగు రోజులు భూలోకానికి తిరిగి వచ్చి బ్రాహ్మణులకు, పేదలకు అన్నపానాదులను దానం చేశాడు. చివరి రోజున నిర్దేశించిన కర్మలనాచరించాడు. ఉన్నత లోకాలకు తిరిగి వచ్చిన కర్ణునికి పక్షం రోజులు మర్త్యలోకంలో చేసిన దానాల ఫలితంగా అతని ఆహారపు అవసరాలన్నీ తీరిపోయాయి. ఇదంతా భాద్రపద మాసం కృష్ణపక్షంలో జరిగింది.
యమ ధర్మరాజు దయవల్ల ఈ ప్రత్యేక సమయంలో జరిపే కర్మలకు అద్వితీయమైన శ్రేష్టత ఏర్పడింది. ఈ కాలంలో అర్పించిన నివేదనలన్నీ వారు వారి వంశజులైనా కాకున్నా చనిపోయినవారందరికీ చేరతాయి. సంతానం లేకుండా మరణించిన వారికి కూడా పితృపక్ష అమావాస్యనాడు ఇతరులు చేసిన తర్పణాలు చేరతాయి. అన్నదానం కాని మరే దానాలు కాని చేయకుండా మరణించి పితృలోకంలో ఆనందానికి నోచుకోనివారు ఈ సంస్కారాలవల్ల లబ్ధి పొందుతారు. మరణించిన రోజు తెలియక సంవత్సర శ్రాద్ధం పెట్టడానికి వీలులేనివారికి పితృపక్షంలో చేసే తర్పణాలు అందుతాయి. బలవన్మరణం పొందినవారికి, ప్రమాదంలో చనిపోయినవారికి, అసహజ మరణం పొందినవారికి మామూలు పద్ధతి ప్రకారం శ్రాద్ధ తర్పణాలు చేరవు. వారికికూడా పితృపక్షంలో అర్పించిన తర్పణాలు నేరుగా చేరతాయి. యమధర్మరాజు ఇచ్చిన ఈ వరాలన్నీ మహాలయ పక్షంలో కర్ణుడు చేసిన దానాల ఫలితంగా లభించాయి. ప్రస్తుతం హిందువులందరు ఈ పక్షాన్ని ఎంతో నమ్మకంతో శ్రద్ధతో, నియమనిష్టలతో, ఆ రోజున త్రికాలాలలో స్నానాలుచేసి, ఉపవాసాలు ఉండి పాటిస్తారు. సర్వపితృ అమావాస్యనాడు ఎన్నో దానధర్మాలుచేసి సంపూర్ణ కర్మలను నిర్వహిస్తారు.
దివంగతులైనవారి ఆత్మలను శాంతపరచడం
హిందువులందరికీ మహాలయ అమావాస్య గొప్ప ప్రాధాన్యత ఉండే రోజు. ప్రతి సంవత్సరం దివంగతులైన మన పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చడానికి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలుచేసే రోజు మహాలయ అమావాస్య. సూర్యచంద్రుల సంయోగం అవుతుందనీ, సూర్యుడు కన్యారాశిలో ప్రవేశిస్తాడనీ హిందూ ఇతిహాసాలు తెలియజేస్తాయి. ఈ రోజు పితృలోకవాసులు యమలోకాన్ని విడిచి మర్త్యలోకానికి వచ్చి తమ వంశీకుల గృహాల్లో చేరతారు.
అమావాస్యకన్నా ముందు వచ్చే పక్షం రోజులను చనిపోయినవారి ఆత్మశాంతికోసం ప్రత్యేకంగా నిర్ణయించారు. దివంగతులైన పూర్వీకుల కోసం ఈ పద్నాలుగు రోజుల్లోనూ ప్రతిదినం చేసే కర్మలు గయా క్షేత్రంలో చేసిన కర్మలతో సమానం. గతించినవారిని పూజించడం, వారి కోరికలను తీర్చడం ఈ కర్మలలోని ముఖ్య సూత్రం. ఈ కర్మల నాచరిస్తే పితృదేవతల దయవల్ల సంవత్సరమంతా ప్రశాంతంగా గడుస్తుంది.
Post a Comment