Breaking News
Join This Site
మంత్రం యొక్క పరమార్ధం

మంత్రం యొక్క పరమార్ధం(శృంగేరి శారదా పీఠం 34వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి బోధలు)

“మననాత్ త్రాయతే ఇతి మంత్ర:” మననం చేయువానిని రక్షించునది మంత్రము. అయితే అది ఏదో విచిత్ర ధ్వనుల కలగూరగంప అని, దానినే ముద్రిత గ్రంధమునుండి గాని గ్రహింపవచ్చు అని కాని భావించినప్పుడు ఆ మంత్రం సారహీనము, నిష్ఫలము. అట్టి మంత్రములు అమిత ఆధ్యాత్మిక తపశ్శక్తి సంపద కలిగిన శ్రీ జగద్గురువుల వంటి వారిచేఉపదేశింపబడినప్పుడే శక్తివంతములు, ఫలవంతములు. మంత్రముల యందు, వైదిక కర్మకాండయందు సామాన్యముగా సామాన్య జనముకు విశ్వాసము తగ్గడానికి కారణం ఏమిటి అనగా - అట్టి వాటిని యోగ్యత లేనివారు చేబూని ఆర్భాటము చెయ్యడం వలన, అటువంటి వారి యందు అవి నిష్ఫలములే కాదు, అపాయమును, ఉపద్రవమును కలిగించవచ్చును కూడా. అందరూ మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అని వెటకారం చేస్తున్నారు కానీ నిజంగా ఆ మంత్రములను ప్రయోగిస్తున్న వారి యోగ్యత చూడడం లేదు.

కొందరు మూర్ఖులు వీటి విలువ తెలియక వైదిక క్రియలు, విగ్రహ అభిషేకాలు, యజ్ఞాది క్రతువులు కేవలం నిరుపయోగం అని, ధన వ్యయం, ద్రవ్య వ్యయము, శక్తి వ్యయము అని నిందిస్తూ దాని బదులు కొంతమందికి ఇల్లు కట్టచ్చు, భోజనం పెట్టచ్చు, ఇతరత్రా మానవ ఉపయోగామునకై మళ్ళించవచ్చు అని చెబుతున్నారు.

అటువంటి మూర్ఖులను మనం నేడు ఈ సామాజిక సంఘాలలో కూడా చూడవచ్చును. ఆ క్రతువుల విలువ వాటిద్వారా ఫలం పొందిన వారికి అర్ధం అవుతుంది. గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన అన్నట్టు వారికి తెలియని విషయాలను అనవసరంగా వాళ్లకు ఉన్న చత్వారపు కళ్ళజోళ్ళలో చూసి తీర్పు చెయ్యకూడదు. తద్వారా ఆ మంత్రశక్తి ని అవమానించి అనవసరపు పాపాన్ని పోగు చేసుకుంటున్నారు. అన్ని పాపాలు ఒక్క సారే తేలిపోవు. కొన్ని పాపాలు పండాలంటే కొన్ని జన్మలు పడతాయి. అలాగే మనం నేడు అనుభవించే కష్టాలు కొన్ని జన్మల క్రితం చేసిన పాప ఫలమే. ఒక కధ ఉన్నది.

ధృతరాష్ట్రుడు తాను 100 మంది కుమారులు పోగొట్టుకుని తాను ఎప్పుడు చేసిన పాపమని భగవంతుని అడుగుతాడు. అతడు ఒక యాభై జన్మల క్రితం కిరాతకుడు అని, ఒకసారి ఒక పక్షి 100 పిల్లల్ని దాని తల్లి తండ్రుల యెదుటనే చంపాడని అందుకు ఆ పాపం ఇప్పటికి ఫలించిందని చెబుతాడు. అప్పుడు ధృతరాష్ట్రునికి ఒక అనుమానం వస్తుంది, మరి 50 జన్మలు ఎందుకు ఆగవలసి వచ్చింది అని. దానికి 100 మంది పిల్లలు పుట్టాలంటే సంపాదింకోవలసిన పుణ్యానికి 50 జన్మలు పట్టిందని చెబుతాడు శ్రీకృష్ణుడు.

ఈరోజు మనం చేసే పాపం ఈ జన్మలోనే ఫలితం చూపించక పోవచ్చును, కానీ వడ్డీ, చక్ర వడ్డీలతో భారీగా మనకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నేడు మనకు అర్ధం కానిదానిని అవహేళన చెయ్యవద్దు. మన మహర్షులు, పెద్దలు, తాతలు ఎంతో ఆలోచించి, తర్కించి చేసిన సాంప్రదాయ పద్ధతులను విమర్శించే అర్హత లేని వారు కూడా నోరు పారేసుకుని పాపం మూటకట్టుకుంటూ వున్నారు. ఆ భగవంతుని దయ వలన మనం అటువంటి వెర్రి వాగుడు వాగకుండుగాక !!
Post a Comment