Breaking News
Join This Site
సనాతనధర్మ సంరక్షణలో మన కర్తవ్యం

సనాతనధర్మ సంరక్షణలో మన కర్తవ్యం

(శృంగేరి శారదా పీఠం 36వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి బోధలు)
ఇప్పటి కాలంలో ఇప్పటి సామాజిక పరిస్థితులని చూస్తూ ఉంటే మన సనాతన ధర్మానికి మనుగడ ఉందా? అనేటువంటి శంక కలుగుతోంది. ఎందుకంటే పరిస్థితులు అంత భీకరంగా ఉన్నాయి. ధర్మ విరోధులైన వారు ప్రబలుతూ ఉన్నారు. ధర్మాన్ని ఆచరించే వారికి రక్షణ కొరవడుతోంది. మరి ఈ పరిస్థితిని మనం అధిగమించేది ఎలా? మన సనాతన ధర్మం ఇప్పటికంటే ఎన్నో విషమ పరిస్థితులను ఎదుర్కొని కూడా తనయొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. అటువంటి అత్యంత బలవత్తరమైన అస్తిభారంతో(ఫౌండేషన్) ఉన్నటువంటిది మన ధర్మం.
ఒక కట్టడం యొక్క అస్తిభారం అతి ప్రబలంగా ఉంటే ఆ కట్టడాన్ని ఎవరూ ఏమీ చేయడానికి వీలు ఉండదో అదే విధంగా మన ధర్మం వేదంలో ప్రతిపాదితమైన ధర్మం. అందుకే దీనిని వైదిక ధర్మం అని మనం చెప్తూ ఉన్నాము. దీని మూలం వేదములు. ఈశ్వరునితో ఉపదేశించబడినటువంటి వేదములందు ప్రతిపాదించబడిన ధర్మం కాబట్టి ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పటి భాషలో చెప్పాలంటే టెన్షన్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉన్నది కానీ ఈ ధర్మం లోపిస్తుందా? అనే భావన మనకి అనవసరం. ఎందుకు అంటే ఈ ధర్మానికి పెట్టని గోడలలాగా ఉన్నాయి మన దేవాలయాలు. ఒక్క ఆంద్ర దేశంలోనే 36,000 దేవాలయాలున్నాయి. మొత్తం భారతంలో లక్షలకు లక్షలు ఉన్నాయి. ఇవి మన ధర్మానికి ఆధార భూతమైనవి. వైదేశికుల ఆక్రమణ, మతాంతరం అని కొంతమంది, మనయొక్క ధర్మాన్ని వికృతంగా ప్రతిపాదిస్తున్నారు కొంతమంది అని అంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో కూడా తిరుపతికి, శబరిమలకి వెళ్ళే యాత్రికుల సంఖ్య ఏమాత్రం తక్కువైందా??

మీరు చేసే విపరీతమైన వ్యాఖ్యానాలు కానీ ఈ వైదేశికుల దౌష్ట్యం కానీ ఈ యాత్రీకుల మీద ఏమైనా పరిణామం చేసిందా? ఇవ్వాళ కాలేదు ఇకముందు కాబోదు. వాళ్ళు కేవలం తమ జిహ్వాచాపల్యం తీర్చుకోవడానికి మన ధర్మాన్ని వికృతం చేసి మాట్లాడి ఉండవచ్చు. అంతమాత్రంతో మనధర్మాన్ని అనాది పరంపరగా అనుష్టిస్తూ ఉన్న వాళ్ళ మనస్సులను వాళ్ళు మారుస్తారు అని మనం ఎన్నడూ మనం అనుకోవక్కరలేదు. తిరుపతిలో ఉండే వేంకటేశ్వరుడు, కాశీలో ఉండే విశ్వనాధుడు ఈవిధంగా భగవంతుడు ఎక్కడెక్కడైతే తన సాన్నిధ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడో ఆ ప్రదేశములన్నీ ఎన్నివేల సంవత్సరాలైనా మనయొక్క శ్రద్ధా కేంద్రములుగా ఉండనే ఉంటాయి.. దానిలో సందేహించనవసరం లేదు. కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం మనం అర్ధం చేసుకోవాలి. ధర్మం నశించి పోతున్నది, ధర్మాచరణ చేసేవారు తక్కువై పోతున్నారు అని అనేకమంది ఒక్క మాట అంటున్నారు.

ఈ ధర్మాచరణలో తానుకూడా ఒకడిని అని మరుస్తున్నారు. ఈ చెప్పేవాళ్ళు నేను సరిగా ధర్మాచరణ చేస్తున్నానా లేదా అని ఒక ప్రశ్న చేసుకోవాలి? ఇంకొకడి విషయం మీకు అనవసరం. మీరు కనీసం త్రికాలసంధ్యావందనం చేస్తున్నారా? పరిశేచన మంత్రం మీకు సరిగ్గా వచ్చునా? ఈ ప్రశ్నకు మీరు సరిగా సమాధానం చెప్పండి. ఇతరులను నిలదీసి అడగడానికి ముందు మిమ్మల్ని నేను ప్రశ్న వేస్తున్నాను ధర్మాచరణ మీరు చేస్తున్నారా?

శృంగేరి జగద్గురు వైభవం
Post a Comment