Breaking News
Join This Site
శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి

శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి


ఐదవరోజు అమ్మవారి అలంకారము. : శ్రీ కాత్యాయని దేవి.


శ్లో ॥ చంద్రహొసోజ్జ్వలకరా శార్దులా వరవాహనా
కాత్యాయనీ శుభం దద్యా ద్దేవి దానవఘతిని ॥

శ్రీ దుర్గా దేవి అవతారాలలో ఐదవ అలంకారం 'కాత్యాయని' . 'కత' నామకుడైన మహర్షి కుమారుడు కాత్య మహర్షి . ఈ మహర్షి పేరునే కాత్య గోత్రము ప్రసిద్ది చెందినది . ఆ కాత్యగోత్రజుడైన కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని , అందువల్ల ఈమే కాత్యాయనిగా పేరుగాంచిందని ఒక ప్రతీతి. ఒకానొక సమయంలో మహిషాసురుడనే రాక్షసుడు బలగర్వంతో వరగర్వంతో ముల్లోకాలను బాధిస్తుండగా వానిదుండాగాలకు వేసారినట్టి దేవతలు మునులు అందరు కలిసి వానిదుశ్చర్యలను బ్రహ్మదేవునికి విన్నవించగా బ్రహ్మ వారందరినీ వెంటబెట్టుకొని హరిహరులున్న చోటకు వచ్చి శరణువేడి ప్రార్థించాడు . అప్పుడు హరిహరులు ముఖప్రదేశాలనుంచి కోటి సుర్యకాంతులతో గొప్ప తేజస్సు వెలువడింది . దేవతలంత తమతమ దివ్యశక్తులను ఆ తేజస్సు నందు ఆవహింపజేశారు . ఆ మహాతేజస్సు స్త్రీ ఆకృతిపొంది మహాశక్తిగా అవతారం చెందింది .

ఆ మహాశక్తి మొదట కాత్యాయన మహర్షిచేత పూజలందుకొని సప్తమి , అష్టమి , నవమి దినాలలో ఆ మహర్షి ఇంట నిలిచి దశమినాడు లోకకంటకుడైన మహిషాసురుని సంహరించింది . కాత్యాయన మహర్షి ఇంట వేలసినందుకు ఈమె కాత్యాయనిగా ప్రసిద్ది పొందింది . కాత్యాయని రూపం దేదీప్యమానం . ఈమె దేహకాంతి బంగారు ఛాయతో తళతళలాడుతుంటుంది . ఈమె చతుర్భుజి . నాలుగు చేతులు కలిగి ఉంటుంది. ఇరుచేతులయందు వరదాభయ ముద్రలు కలిగి ,ఇరు చేతులలో ఒకచేత ఖడ్గం ,ఒకచేత పద్మం ధరించి శోభిల్లు తుంటుంది.

కాత్యాయనీ వ్రతం అమోఘఫలదాయకం . కోరిన వరుని భర్తగా పొందటానికి అవివహితులైన నవయువతులు ఈ కాత్యాయని మాతను పూజించి వ్రతాన్ని చేయడం పురాణకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. శ్రీ కృష్ణ భగవానుని భర్తగా పొందటానికి వ్రేపల్లెలోని గోపికలందరు కలిసి కాత్యాయని వ్రతం చేసినట్లు భాగవతంలో చెప్పబడినది . ఉషఃకాలంలో యమునానదిని చేరుకున్న గోపికలు నది ఒడ్డున సైకత ప్రతిమను చేసి కాత్యాయని దేవిగా భావించుకొని

"కాత్యాయని మహామాయే మహాయోగి న్యధీశ్వరీ
నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమ !
కం ॥ ఓ కాత్యాయని భగవతి
నీకున్ మ్రొక్కెదము మేము నెడనుకంపన్ 
మాకిందఱకున్ వైళామ
శ్రీకృష్ణుడు మగడుగాగ జేయుము తల్లీ !"

అని నిశ్చల భావంతో యాదవకాంతలు కాత్యాయని మాతను సేవించినారు . అప్పటి నుంచి గోకులానికి అధిదేవతగా ఈ కాత్యాయని దేవి వెలసింది . ఈ దేవి శార్దూల వాహన .

పరిపూర్ణ విశ్వాసంతో ఉపాసించిన వారికి ఈ మాత సులభంగా ప్రసన్నమౌతుంది . ఈ దేవిని పుజించేవారికి రోగభయంగాని , శత్రుభయంగాని , సంతాపంగాని ఉండదు . సమస్త విధాలుగా ఈ తల్లీని శరణుజొచ్చిన వారికి కోటి జన్మాల పాపాలను కూడా నశింపజేస్తుంది . వివాహం కావలసినవారు తప్పకుండా కాత్యయని దేవిని పూజించండి.

నైవేధ్యం - రవ్వకేసరి.

Post a Comment