Breaking News
Join This Site
యువతలో ఉండే బలమే దేశానికి రక్ష.

యువతలో ఉండే బలమే దేశానికి రక్ష.

 
 
నేటి యువత గురించి పెద్దలు ఎంత బాధపడుతున్నారో, ఎంత ఆవేదన చెందుతున్నారో! అయినా యువత తెలుసుకోవడంలేదు.
యువతలో ఉండే బలమే దేశానికి రక్ష. కానీ ఎంతమంది యువతలో బలం ఉంది? ఎంతమంది బలంగా ఉంటున్నారు? పద్మాసనం పది నిముషాలు కూర్చోలేరు. కనీసం కుర్చీలో నిటారుగా కూర్చోలేరు. గోడకి ఆనకుండా నిలబడలేరు. పెరుగన్నం తినరు, మజ్జిగ తాగరు, పాలు వాసన కూడా చూడరు. ఆకుకూరలు సరేసరి. కానీ రోడ్లమీద కనిపించే చెత్త చెదారం అంతా కడుపులో వేసేస్తున్నారు. కడుపుని ఉడికించే పిజ్జాలు, బర్గర్లు, వారాల క్రితం ప్యాక్ చేసిన మాంసం, వారాల క్రితం సద్దిపెట్టెలో పెట్టిన కూల్ డ్రింక్స్, ఇష్టంగా తిని త్రాగుతారు. ఫాస్ట్ ఫుడ్ అని అల్పాహార సెంటర్ లకి పేర్లు పెడుతున్నారు. పాస్ట్ పుడ్ అంటే ఏంటి అసలు? ఫాస్ట్ ఫుడ్ ఎవరు తింటారు? ఆవులు, గేదెలు, మేకలు, ఇతర పక్షులు ఎవరో వచ్చి పట్టుకుంటారనో, ఎవరో ఏవో వచ్చి లాక్కుపోతాయనో ఫాస్ట్ ఫాస్ట్ గా తినేస్తూ ఉంటాయి. ఫాస్ట్ పుడ్ అని పేరు పెట్టడమే మీరు పశువులు పక్షులు అని చెప్పడం. అవమానాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహరం తినడమే మానేశారు. ఇంటి తిండి కూడా పొట్లాలు కట్టించుకొని తెచ్చుకుంటున్నారు. కూరలు వండడం మరచిపోతున్నారు.

వీటివలన ఇలాంటి ఆహారం తీసుకోవడం వలన యువతలో జవసత్వాలు తగ్గిపోయాయి. చిన్నతనంలోనే కంటి చూపు మందగించింది. శిరోభారం వచ్చేసింది. నరాల బలహీనతలు, కడుపులో ఉండే కొన్నిరకాల కెమికల్స్ ఇలాంటి తిండి వలన పాడైపోయి క్షణిక ఆవేశాలు, బంధాలు లెక్కచేయకుండా తెగతెంపులు చేసుకోవడం. ఏమి మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో తెలుసుకోలేకపోవడం, తెలియచెప్పబోతే నేనింతే అంటూ అసలు ఏమి చెబుతున్నారో కూడా వినే ఓపిక కోల్పోవడం, ఓర్పు లేదు ఓపికలేదు. దేశానికి రేపు మీరు ఏమి ఉపయోగపడతారు?
దేశానికి అంటే వెళ్లి పోరాటం చేయమని కాదు. మీరు చేసే ఉద్యోగాలు, చేసే పనులే.. ఒకడు కంప్యూటర్ ఆపరేటర్ గా జాయిన్ అయ్యాడు. 15రోజులు పని చేసి 16వ రోజు ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాడు. నడుము నొప్పి, కళ్ళు లాగుతున్నాయి అంటూ. వాడేదో మందు వేసి పంపుతారు. క్రమంగా బద్ధకం, నీరసం, విసుగు, వీటివలన ఎవరి మాట వినరు, అవసరమైతే తిరగబడి తంతారు తప్ప కలిసి ఉండాలి అని కలలో కూడా అనుకోరు.
మారేందుకు ఇన్ని  చదివేది? ఎం ఉపయోగం మీ చదువుల వలన? బీటేక్, ఎంటెక్. బిఎస్సి, యామెస్సి, ఇంజనీరింగ్ ఇలాంటివి చదవడం వలన ఎవ్వరికీ ఉపయోగంలేదు. అమ్మకి నాన్నకి, భార్యకి, భర్తకి ఎవ్వరికీ వీసమెత్తు ఉపయోగం లేదు. విలువలు తెలియనప్పుడు ఈ చదువులు ఎందుకు?భారతం భాగవతం, రామాయణం చదవమంటే అవుట్ డేటెడ్ అని తీసిపారేస్తున్నారు. కానీ వీటిని చదివి చుడండి. ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నిలబడి ఉన్నాయంటే వాటిలో ఏముంది? ఈరోజుల్లో ఎవరో రాసిన పుస్తకాలూ ఎన్నో మార్కెట్లో వచ్చాయి. కాని ఎవరు దానిని దాచుకోగలుగుతున్నారు? దాచుకోలేరు. ఎందుకంటే దాచుకునేంతగా అందులో ఏమి ఉండదు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ గురించి ఎంతమంది యువతకి తెలుసు? ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణ దేవరాయలు, అబ్దుల్ కాలం ఇంకా ఎందరో మహానుభావుల చరిత్రలు ఎంతమంది యువతకి తెలుసు? నేటి రాజకీయ నాయకులూ వారికి ఇష్టమైన వారి గురించే పాఠ్యంశాలలో చేర్చుతారు తప్ప సర్దార్ వల్లభాయ్ లాంటివారి గురంచి చేర్చరు. వీరి గురించి యువత తెలుసుకోదు. కనీస ప్రయత్నం చేయదు. చెప్పేవారు లేరు.

ఒకటి గుర్తుపెట్టుకోండి దేశానికి వెన్నుముక మీరు. మీ అలవాట్లు మార్చుకోండి. ఉదయాన్నే అలారం పెట్టి అది మ్రోగితే దాని నోరు నిక్కితే ఎవరికి నష్టం? రాత్రింబవళ్ళు టివి ముందు, సెల్ ఫోన్ ల దగ్గర కూర్చుంటే తాత్కాలికంగా గడచిపోవచ్చు. కాని మీరు ఎవరికి ఉపయోగపడతారు? ఎలా ఉపయోగపడతారు?అనేది గ్రహించండి. ఒక్కడంటే ఒక్కడు వ్యాయామం చేసేవాడు ఉన్నాడా? లేరు. తెల్లార్లు టీవీలు, సెల్ఫోన్లలో కాలం వెళ్లబుచ్చుతుంటే నీకు, నీభార్యకి/భర్తకి, కుటుంబానికి, దేశానికి ఎలా ఉపయోగపడతారు?

అందుకే ఆరోగ్యాన్ని పెంచుకునే ఆహారం తినండి. ఆరోగ్యాని పెంచుకునే వ్యాయామాలు చేయండి. మానసిక పరిణతి సాధించే పుస్తకాలూ చదవండి. పొద్దునే లేవండి. వీటివలన మీ భవిష్యత్తే బావుంటుంది. వీడు మావాడు. వీడు మా అబ్బాయి, వీడు నాభర్త, వీడు మా ఊరిలోవాడు, చివరికి వీడు మాదేశం వాడు అనేలా ఉండాలి తప్ప మానసిక పరిణతి సాధించకుండా అయోమయంలో పడిపోతే ఎవరు గుర్తిస్తారు నిన్ను? ఇంటికి, బంధాలకి, బంధుత్వాలకి, దేశానికి యువతే వెన్ను దన్నుగా నిలబడాలి. ఆదిశగా ఆలోచించడం మొదలుపెట్టండి.


Post a Comment