Breaking News
Join This Site
ఏకలవ్యుడి మరణం ఎలా సంభవించిందో తెలుసా!

ఏకలవ్యుడి మరణం ఎలా సంభవించిందో తెలుసా!ఏకలవ్యుడి వృత్తాంతం.! ఇదీ ఆరుద్ర గారి పరిశోధనా వ్యాసం!
,
మనలో చాలామందికి ఏకలవ్యుడి కధ ఈ క్రింది విధంగా తెలుసు! ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప పాత్ర. ఇతను ఎరుకల కులానికి చెందినవాడు. ద్రోణాచార్యుని వద్ద విలువిద్యను అభ్యసించాలని కోరిక ఇతనికి ఎక్కువగా ఉండేది. ఆ కోరికను ద్రోణుడికి తెలియచేసాడు. ద్రోణుడు అతని కోరికను మన్నించక, దాన్ని తిరస్కరించాడు.కానీ కొన్ని కథల్లో, ద్రోణుడు ఏకలవ్యుడిని దూరంగా ఉంచటానికి కారణం అతని కులం అని చెపుతారు.ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు.

ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సంపాదించాడు. ఒక సారి విలువిద్య సాధనకు అర్జునుడు, ద్రోణుడు ఇతరులు కలిసి అడవికి వేట కుక్కులను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క వేగంగా తెలియక ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లింది. కొత్త వేషదారణతో ఏకలవ్యుడు కనిపించే సరికి కుక్క గట్టిగా అరిచింది. కుక్క అరుపుకు చిరాకు కలిగిన ఏకలవ్యుడు కుక్కు నోరు తెరచి మూయుటకు మధ్యగల సమయంలోనే దాని నోటిలోనికి 7 బాణాలు వేసాడు. తరువాత ఆ కుక్క అర్జునికి కనిపించింది. విషయం విచారించగా ఆ ప్రాంతంలో ఏకలవ్యుడు అనే అతను విలువిద్య నేర్చుకుంటున్నాడని తెలిసింది.ద్రోణాచార్యులు ఏకలవ్యుడిని చూడటానికి అతని వద్దకు వెళ్లారు. ఏకలవ్యుడు తన గురువు గారికి ఘనంగా స్వాగతం పలికాడు.ఏకలవ్యుడు విలువిద్య చూసి ఎంతో సంతోషించారు.

కానీ ఒక కుక్కను చూసి అది తనను చూసి అరచింది అనే చిన్న కారణానికి దాని నోట్లోకి 7 బాణాలు వేసి,కోపాన్ని అదుపులో ఉంచుకోలేని, ధర్మం, అధర్మం తేడా తెలియకుండా అధర్మం వైపు మొగ్గే అతని వద్ద ఇంతటి విలువిద్య ఉంటే లోకానికి, ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుందని ద్రోణుడు భావించాడు.రాబోయే ప్రమాదాలను ముందే నివారించటానికి ఏకలవ్యుడు విలువిద్య ప్రదర్శించుటకు వీలుకాకుండా, ద్రోణుడు ఏమాత్రం కనికరం లేకుండా లోక కళ్యాణం కొరకు ఏకలవ్యుని కుడి చేతి బ్రొటన వేలుని ఇమ్మని అడిగాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడిచేతి బొటన వేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు.

ఈ సంఘటన ఏకలవ్యుడి త్యాగం మరియు గురువు పట్ల ఉన్న అంకితభావాన్ని తెలియపరుస్తుంది.చరిత్రలో నిలిచిపోయాడు.ఆ వేలు పోయిన తరువాత ఏకలవ్యుడు విలువిద్య అభ్యసించలేడన్నది ద్రోణుడి అభిప్రాయం. ద్రోణాచార్యులు అనుకున్నదే నిజం అయింది. ధర్మం వైపు మొగ్గకుండా అధర్మం వైపు వెళ్లాడు. తరువాత ఏకలవ్యుడు జరాసంధునికి చాలా విశ్వాసపాత్రుడిగా వ్యవహరించాడు. రుక్మిణీ స్వయంవరం సమయంలో జరాసంధుని కోరిక మేరకు, శిశుపాలుడికి మరియు రుక్మిణీదేవి తండ్రియైన భీష్మకుడికి మధ్యవర్తిగా వ్యవహరించాడు.భీష్మకుడు రుక్మిణి శిశుపాలుడిని పెళ్ళి చేసుకోవాలని కోరాడు. కానీ రుక్మిణి శ్రీకృష్ణుని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. తరువాత ఒకసారి జరాసంధుని సైన్యంతో యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పైకి ఏకలవ్యుడు ఒక రాయి విసరడంతో శ్రీకృష్ణుడే అతన్ని చంపివేశాడు. అలా మరణించిన ఏకలవ్యుడు పునర్జన్మలో దృష్టద్యుమ్నుడిగా పుట్టే వరాన్ని శ్రీకృష్ణుడు ఏకలవ్యుడికి ప్రసాదించాడనే కధ కూడా ప్రచారంలో ఉంది. కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడిని హతమార్చాడని ఓ కథ ప్రచారంలో ఉంది.

ఏకలవ్యుడి పాత్ర గురించి చెప్పిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. తన బొటనవేలును కత్తిరించి, ‘గురు దక్షిణ’గా ద్రోణాచార్యుడికి సమర్పించటంతో ముగుస్తుంది ఇతని కథ. ఇది అందరికి తెలిసిన సాధారణ కథ. నన్నయ రాసిన 'మహాభారతం ,ఆదిపర్వం, పంచమాశ్వాసంలోని 231 వ వచనం నుండి 245 వ పద్యం దాకా ఏకలవ్యుడి కధ సాగింది.ఏకలవ్యుని కధనమును గూర్చి ఎన్నో పరిశోధనలు, విశ్లేషణలు జరిగినా కొన్ని సంతృప్తి కరమైన సమాధానాలు లభించవు. కానీ ఏకలవ్యుడి మరణం కృష్ణుని చేతిలో సంభవించింది అన్న వాస్తవంతో పాటు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి.అసలు ఏకలవ్యుడు ఒక రాజుకొడుకు.ఏకలవ్యునికి శత్రుఘ్నుడనే మరో పేరు కూడా ఉంది. మహాభారత కాలంలో కొడుకు పుట్టినప్పుడు, అతని జాతకం బాగాలేకపోతే,దుశ్శకునాలు కలిగితే, అతణ్ణి కులభ్రష్టుడిగా భావించి అడవులలో వదలిపెడుతారు. దుర్యోధనుడు పుట్టినప్పుడు కూడా దుశ్శకునాలు కలిగాయి.అతనిని కూడా కుల భ్రష్టుడుగా భావించి అడవిలో వదలివేయమని పెద్దలు చెప్పినట్లు నన్నయ భారతంలో ఉంది. అయితే, లేకలేక కలిగిన సంతానం కావటం చేత,పుత్రవాత్సల్యం చేత ధృతరాష్ట్రుడు ఆ పని చేయలేకపోయాడు.

శత్రుఘ్నుడిగా మరో పేరున్న ఏకలవ్యుడు అడవులలో భిల్లుల మధ్య పెరిగి, నిషాద జాతులలో చేరాడు. ఇతని తండ్రి దేవశ్రవుడు, వసుదేవునికి మూడవ తమ్ముడు.(హరివంశం)ఏకలవ్యుడు నిషాదుడు (బోయవాడు) అంటుంది వ్యాసభారతం. ఇతను ఎరుకలవాడు అంటుంది కవిత్రయ భారతం.! తండ్రి నిషాదరాజైన హిరణ్యధన్వుడు అని వ్యాసుడంటే, ఎరుక రాజైన హిరణ్యధన్వుడని నన్నయ చెబుతాడు.నిజానికి ఏకలవ్యుడు, వేటగాళ్ళ రాజు,నిషద వ్యత్రజ హిరణ్యధనుస్సు చేత పెంచబడ్డాడని అర్ధమవుతుంది.


ఏకలవ్యుడి వృత్తాంతంలో ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. ఈ సందేహాలన్నీ ‘హరివంశం’లో పరిష్కారమైనట్లు కొందరి అభిప్రాయం.ఆరుద్ర పరిశోధించి పేర్కొన్నట్లు ‘ఏకలవ్యుడు-కృష్ణుడు-పాండవులు రక్త సంబంధీకులు’. యాదవ రాజైన శూరుడికి స్వయానా మనవళ్లు! ఇతడి భార్య మారిష. వీరికి తొమ్మిదిమంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు పుట్టారు. అందులో ఏకలవ్యుడి తల్లయిన శృతదేవ శూరుడి రెండో కూతురు. నాల్గవది కుంతి. అంటే వీరికి పుట్టిన ఏకలవ్యుడు, పాండవులు అన్నదమ్ములన్నమాట! శూరుడి మొదటి కొడుకు వసుదేవుడు.రెండవవాడు దేశశ్రవుడు. (మిగిలిన వారిపేర్లు అప్రస్తుతం).ఏకలవ్యుడు కృష్ణులది బావ-బావమరదుల వరసన్నమాట. ఆరుద్ర తన వ్యాసపీఠంలోని ‘ఏకలవ్యుని పుట్టుపూర్వోత్తరాలు’ అనే వ్యాసంలో పాండవులకు ఏకలవ్యునికి మధ్యగల చుట్టరికాన్ని,ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో ఏకలవ్యుడు పాల్గొనడాన్ని పేర్కొని ధృవీకరించారు. ఏకలవ్యుడి తండ్రి హిరణ్య ధన్వుడు(కేకయరాజు).తల్లి శ్రుతదేవ."హరివంశం" గ్రంధ ప్రకారం ఏకలవ్యుడు పాండవులకు రెండవ పెదతల్లి కొడుకు, కృష్ణుడి రెండో మేనత్త కొడుకు.అనగా పాండవులకు వరుసకు సోదరుడు.ఏకలవ్యుని కృష్ణుడు వధించినట్లు మహాభారత కధనం.హరివంశం 6వ ఆశ్వాసం 34వ అధ్యాయంలోని 33వ శ్లోకంలో ఒక చిన్న తప్పు దొర్లింది. దేవశ్రవుడికి ఏకలవ్యుడు జన్మించి నిషాదులలో పెరిగినట్లు అందులో చెప్పబడింది.

దేవశ్రవుడు వసుదేవుని తమ్ముడని ముందు చెప్పుకున్నాం. ఆ వరసన కృష్ణుడు, ఏకలవ్యుడు అన్నదమ్ములు అవుతారు .ఒక శ్లోకంలో శృతదేవ అనే పేరుకు బదులు దేవశ్రవ అనే పేరు చేరింది. చాలామంది దీన్ని తప్పుగా గ్రహించలేక ఏకలవ్యుడు కూడా యాదవుడనే అభిప్రాయానికి వచ్చారు. దీన్ని ఆధారం చేసుకుని ఒక తెలుగు సినిమాలో ఏకలవ్యుడి చెల్లెల్ని కర్ణుడు పెళ్లి చేసుకున్నట్లుగా చూపించారు. ముందు పేర్కొన్న ప్రకారమైతే ఏకలవ్యుడు, కర్ణుడు అక్కచెల్లెళ్ల పిల్లలు.కాబట్టి సినిమాలో చూపించింది అసంబద్ధం!కృష్ణుడు, ఏకలవ్యుడు అన్నదమ్ముల పిల్లలని నమ్మి, దానికి మరికొన్ని తప్పులు జోడించి వికీపీడియా వారు సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. అదీ తప్పే!హిరణ్య ధనస్సు మగధ సామ్రాజ్యాధిపతియైన జరాసంధుని సైన్యాధిపతి.తండ్రి వారసత్వాన్నే ఏక లవ్యుడు కొనసాగించాడు.ఏకలవ్యుడు కూడా మగధ దేశాధిపతి జరాసంధ చక్రవర్తి కొలువులో సేనాధిపతిగా పనిచేసాడు.ఏకలవ్యుడు బలరామునితో గదా యుద్ధం చేసి చివరిలో ఒక దీవిని చేరి తలదాచుకున్నట్లు హరివంశ కధనం.ఏకలవ్యునికి ఇద్దరు కుమారులున్నట్టు కూడా అర్థమవుతుంది. ఒక కుమారుడు కేతుమాన్. ఇతను కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని భీముని చేతిలో మరణించాడు. మరొక కొడుకు ధర్మరాజు విడిచిన అశ్వమేధ యాగాశ్వాన్ని అనుసరిస్తూ వచ్చిన అర్జునుని ఎదిరించి, పరాజితుడై అర్జునుడిని సేవిస్తాడు. అయితే,ఇతని పేరు తెలియదు. తెలుగులో కూడా ‘ఏకలవ్య నందనుండ’ని మాత్రమే ఉంది.పుట్టుక కంటే పెంపకం ముఖ్యమనిభావించే మహాభారత కాలంలో కర్ణుడు కూడా శూద్రుడే! అసలు ఆరుద్ర గారు తన 'వ్యాసపీఠం'లోని ఒక వ్యాసంలో ఏమి చెప్పారో కూడా చూద్దాం!-----

"మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆదిపర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు.ఆదిపర్వం పంచమా శ్వాసంలోపదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు?ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారతకథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతానికి హరివంశం ఖిలపర్వం,సంస్కృత భారంతలో మూల హరివంశాన్ని జోడించి చదివితే ఏకలవ్వుని పుట్టు పూర్వోత్తరాలన్నీ పువ్వులాగ విచ్చుకొంటాయి. సంస్కృత హరివంశం చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాండవులకు గాని కృష్ణునికి గాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. రక్తబంధువు. పాండవులు, ఏకలవ్యుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. కృష్ణుడూ ఏకలవ్యుడూ మేనత్త మేనమామ బిడ్డలు. ఈ బీరకాయ పీచు బంధుత్వాలు ఎర్రయ్యగారి తెలుగు హరివంశం వల్ల కూడా కొంత తెలుస్తాయి. ఏకలవ్యునికీ, కీచకునికి కూడా బంధుత్వం ఉంది. సుధేష్ణ పాండవులకు స్వయానా పినతల్లి కూతురు. ఉత్తరకుమారునికి పాండవులు మేనమామలు.యాదవకులంలో అంధక వంశశాఖ ఉంది. అందులో శూరుడను రాజుకు వసుదేవుడు మొదలయిన తొమ్మండుగురు కొడుకులూ, అయిదుగురు కుమార్తెలూ ఉన్నారు.(ముఖ్యమైన వారి పేర్లను పైన ఉదహరించాను)వసుదేవుని ఈ అయిదుగురు అక్క చెల్లెళ్లూ ఎవరెవరిని పెళ్ళాడారో, వాళ్ళ సంతానం పేరులేమిటో కూడా హరివంశంలోని ఇతర శ్లోకాలలో చెబుతుంది.కేకయరాజుకూ శ్రుతదేవకూ పుట్టిన ఏకలవ్యుడు నిషాదుడెందుకయ్యాడు? హరివంశంలోనే ఒక శ్లోకం ఆ సంగతిని చెబుతుంది.అదేమిటంటే, దేవశ్రవునికి ఏకలవ్యుడు జన్మించి నిషాదులచే పెంచబడ్డాడని, దేవశ్రవుడు వసుదేవుని తమ్ముళ్ళలో ఒకడు. శ్రుతదేవ అనే పేరుకు బదులు దేవశ్రవ అనే పేరు ఈ శ్లోకంలో చోటుచేసుకుంది. ఎర్రయ్యగారు ఆంధ్ర హరివంశంలో "శ్రుతదేవ కుంగేకయేశ్వరుని వలన ఏకలవ్యుడు పుట్టి నిషాదులలోన బెరిగె" అని ఈ శ్లోకాన్నే అనువదించారు. కేకయ రాజు సుక్షత్రియుడు కానందువల్లనే నిషాదుడయ్యాడు.సంస్కృత భారతం - విరాటపర్వం - పదహారో అధ్యాయంలో కేకయ రాజుల ప్రసక్తి ఉంది.కీచకుని వివరాలను జనమేజయుడు చెప్పమంటే వైశంపాయనుడు చెప్పాడు.క్షత్రీయ పురుషునికి బ్రాహ్మణ స్త్రీ వలన పుట్టినవాడిని సూతుడంటారు.ఈ విధమైన ప్రతిలోమ జాతులలో సూతునికి ద్విజత్వం ప్రాప్తిస్తుంది. వీళ్ళని రధకారులని పిలుస్తారు. పూర్వం రాజులకు సూతవంశాలతో వైవాహిక సంబంధాలు ఉండేవి.అయినా సూతుని రాజ శబ్దంలో వ్యవహరించరు గాని కొందరు సూతులు రాజులను ఆశ్రయించి రాజ్యాలు సంపాదించారు. వాళ్ళని సూతరాజులంటారు. వాళ్ళలో కేకయుడు కూడా ఒకడు. ఇతడు సూతులకు అధిపతి. క్షత్రీయ స్త్రీకే పుట్టాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య మాళవి. ఈమెకు బాణుడు అనే కొడుకు పుట్టి కీచకుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. కేకయుని రెండో భార్యకు చిత్ర అనే కుమార్తె పుట్టి సుధేష్ణ అనే పేరుతో పెరిగింది. ఈమె విరటుని రెండో భార్య. పెద్ద భార్య శ్వేత చనిపోయాక విరటుడు ఈమెను పెళ్ళాడాడు. మూలంలోని ఈ శ్లోకాలను తిక్కనగారు తమ విరాటపర్వంలో తెనిగించలేదు. పైగా మూలంలో లేని విషయాన్ని మరొకచోట చెప్పారు. ఉత్తర కుమారుడు శమీవృక్షం దగ్గర బృహన్నలతో పాండవుల గురించి అడిగి "ఏనమ్మహానుభావుల మేనల్లుండ" అని చాటుకొన్నట్టు రాశారు. (విరాటపర్వం) సుధేష్ణ పాండవుల పినతల్లి కూతురే అన్న సంగతి ఇందువల్ల తేలుతుంది. హరివంశంలో ఏకలవ్యడి విద్యాభ్యాసం ప్రసక్తిగాని, గురుదక్షిణ సంగతిగాని లేదు. ఏకలవ్యుడు జరాసంధుని ఆంతరంగికులలో ఒకడు. జరాసంధుని సైన్యాలకు ఏకలవ్యుడే సేనాధిపతి. మధర మీద పద్దెనిమిది సార్లు జరాసంధుడు దండెత్తాడు. ప్రతీముట్టడి లోనూ ఏకలవ్యుడు సైన్యాధిపత్యం వహించాడు. సంస్కృత హరివంశంలో ఏకలవ్యుని సంగర విక్రమం కనబడుతుంది."

Post a Comment