Breaking News
Join This Site
 మహాభారతం .. ప్రతీ మానవుని కథా..!!  మహాభారతం ఏ పర్వంలో ఏముంది..?

మహాభారతం .. ప్రతీ మానవుని కథా..!! మహాభారతం ఏ పర్వంలో ఏముంది..?  

మహాభారతాన్ని మలుపు తిప్పిన రెండు ఘట్టాలు ఇవి..

    అసలు సీసలైన ధర్మాన్ని గురించి చేప్పే ‘‘మహాభారతం". కురుక్షేత్ర మహాసంగ్రామం వలన మానవుడు నేర్చుకోవలసిన నీతి ఏమిటి?


మానవ సమాజంలో స్థూలంగా రెండురకాల వారుంటారు. లోకం కోసం తను వున్నానని విశ్వసించి నడచుకునేవారు, తనకోసమే లోకం వుందని ప్రవర్తించేవారు. అలాగే తాను అనుసరించిందే ‘‘ధర్మం’’ అని భావించేవారు, అసలుసిసలు ధర్మాన్ని గుర్తించి అనుసరించే వారు మనలోనే వున్నారు. మహాభారతంలో ‘‘ధర్మం’’ అనే ఏకసూత్రం అంతర్లీనంగా వుంది. దానిని పాటించే వారిని, పాటించని వారిని గమనించే ‘‘విధాత’’ పాత్ర శక్తివంతంగా సందర్భాన్ని బట్టి పని చేస్తుంది. ‘‘కాలం’’ మరొక ఆయతనంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాలానికి నిర్దిష్టమైన ఒక ప్రణాళిక వుంటుంది. సన్నివేశాలన్నీ ఆ ప్రణాళిక క్రమంగా జరగడానికి వీలుగా నడుస్తూ వుంటాయి. 
.
మనుషుల రాగద్వేషాలు, బలహీనతలు సన్నివేశాలను నడిపిస్తాయి. దాని పర్యవసానమే కురుక్షేత్ర మహాసంగ్రామం.త్రేత, ద్వాపర యుగాల సంధికాలంలో అవతార మూర్తిగా ఆవిర్భవించినవాడు పరశురాముడు. అప్పటికే అహంకరించి, దుష్కర్మలకు పాల్పడుతున్న రాజవంశాలను పరశురాముడు నాశనం చేశాడు. ఆ రక్తంతో తన పెద్దలకు తర్పణలు అర్పించాడు. ఆ రుధిర ధారలతో ఏర్పడిన రక్తపు మడుగులకు శమంతక పంచకమనే పేరు వచ్చింది. ఆ నెత్తుటి గడ్డే తర్వాత కురుక్షేత్రం అయింది. ద్వాపర యుగంలో జరిగిన యీ మహాసంగ్రామంలో పద్ధెనిమిది అక్షౌహిణీల సైన్యం ప్రాణాలు కోల్పోయింది. అసలు నాటి అక్షౌహిణికి బలం ఎంత? ఒక రథం, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు భటులు కలిగిన బృందాన్ని ‘‘పత్తి’’ అంటారు. అలాంటి పత్తి సమూహాలు మూడు కలిస్తే ఒక ‘‘సేనాముఖం’’. మూడు సేనాముఖాలు ఒక గుల్మం. మూడు గుల్మాలు ఒక ‘‘గణం’’. మూడు గణాలు కలిస్తే ఒక ‘‘వాహిని’’. మూడు వాహినులొక ‘‘పృతన’’. మూడు పృతనలొక ‘‘చము’’. మూడు చములొక ‘‘అనీకిని’’. పది అనీకినులు కలిస్తే ఒక అక్షౌహిణి. అంటే అక్షౌహిణిలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు, అంతే సంఖ్యలో ఏనుగులు, మూడింతలు గుర్రాలు, లక్షాతొమ్మిది వేల మూడు వందల యాభైమంది సైనికులు వుంటారు. దీనిని బట్టి వివిధ బలాలు, సైనికులు ఎందరు నశించారో తెలుసుకోవచ్చు. కేవలం పద్ధెనిమిది రోజులు జరిగిన యుద్ధం యిది.అయితే, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన జన నష్టంతో పోలిస్తే, కురుక్షేత్రంలో చనిపోయిన వారు తక్కువే. రెండో ప్రపంచయుద్ధంలో సైనికులు, సామాన్యులు వెరసి ఏడుకోట్ల ఇరవై లక్షల మంది మరణించారని అంచనా. ఇందులో సిపాయిలు, యుద్ధఖైదీలు, సామాన్యప్రజలు, యుద్ధం వల్ల దాపురించిన కరువు కాటకాలవల్ల మరణించిన వారు వున్నారు. యుగాలు మారినా మానవ నైజాలలో, ప్రవృత్తులలో పెద్దగా మార్పులు రావని మనకు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే మన ప్రాచీన ఇతిహాసాలు నేటికీ చెలామణీ అవుతున్నాయి.మహాభారతగాథ ఒక మహాప్రవాహం. ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ.
.
మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది. మహాభారతంలో లేనిదేదీ ఈ లోకంలో లేదు అని లోకోక్తి. మహాభారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయని మాత్రమే తెలుసు కాని, ఆ పర్వాలేమిటో, ఏ పర్వంలో ఏముంటుందో తెలిసిన వారు తక్కువనే చెప్పవచ్చు. అటువంటివారికి అవగాహన కోసం...
.
1. ఆదిపర్వం: రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు, ఆయన కుమార్తె దేవయాని, చంద్రవంశ మహారాజు యయాతిల చరిత్రతోపాటు శకుంతల, దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది. ఈ పర్వంలో అధికభాగం కురువంశ మూలపురుషులైన శంతనుడు, భీష్ముడు, విచిత్రవీర్యుడు, ధృతరాష్ట్రుడు తదితరుల పరిచయం ఉంటుంది. పాండురాజు కథ, పాండవ కౌరవుల జననం, విద్యాభ్యాసం, వారి మధ్య బాల్యం నుంచే పొడసూపే స్పర్థలు, పాంచాల రాకుమారి ద్రౌపదితో పాండవుల వివాహం, అర్జునుడి తీర్థయాత్ర, శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలను కూడా ఆదిపర్వం వివరిస్తుంది.
.
2. సభాపర్వం: పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు (ధర్మరాజు) రాజసూయయాగం చేయడం, కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు శకుని సాయంతో జూదం గెలవటం, పర్యవసానంగా తలెత్తిన పరిణామాలు ప్రధానాంశాలు.
.
3. అరణ్యపర్వం: దీనినే వనపర్వం అని కూడా అంటారు. కామ్యక వనంలో పాండవుల వనవాస వర్ణన ఇందులో ఉంటుంది. దీనితోపాటు నలదమయంతుల కథ, సావిత్రిసత్యవంతుల గాథ, ఋష్యశృంగుడు, అగస్త్యుడు, మార్కండేయుడు తదితర మహామునులతోపాటు భగీరథుడు, శిబి వంటి చక్రవర్తుల వృత్తాంతాలు కూడా ఉంటాయి.
.
4. విరాటపర్వం: విరాటుని కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేయడం, దుష్టుడైన కీచకుని వధ, పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు రప్పించి దానిని భగ్నం చేయడానికి, విరాటరాజుకి చెందిన గోవులను పట్టుకున్న కౌరవులతో యుద్ధం, దక్షిణ గోగ్రహణం, ఉత్తర - అభిమన్యుల పరిణయం ఉంటుంది.
.
5. ఉద్యోగపర్వం: ఒకవైపు శాంతియత్నాలు, మరోవైపు యుద్ధసన్నాహాలు సమాంతరంగా సాగిపోవటం ఈ పర్వం ప్రత్యేకత. కర్ణుడు తన కొడుకే అని తెలిసిన కుంతీదేవి పరితాపం, శాంతియత్నాలు చేస్తూనే పాండవులను యుద్ధసన్నద్ధులను గావించే శ్రీ కృష్ణుని రాజనీతి... ఈ పర్వంలోని ముఖ్యాంశాలు.
.
6. భీష్మపర్వం: మహాభారతంలో ఆరవది భీష్మపర్వం. ఇది అతి ముఖ్యమైనది. ప్రపంచ సారస్వతానికే తలమానికమైన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించింది ఈ పర్వంలోనే. పదిరోజుల యుద్ధ వర్ణన, భీష్మపితామహుడి మానవాతీత సాహసాల గురించిన అత్యద్భుత వర్ణన కనిపిస్తుంది. స్వచ్ఛంద మరణమనే వరం ఉండటం వల్ల భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభం అయ్యేవరకు తన మరణాన్ని వాయిదా వేసుకుని అంపశయ్య మీదనే విశ్రమించడం ఉంటాయి.

7.  ద్రోణపర్వం: ద్రోణాచార్యుల సాహసకృత్యాలు, విధిలేని విపత్కర పరిస్థితిలో ధర్మరాజు పలికిన ‘అశ్వత్థామ హతః’ అనే మాట ఫలితంగా ఆయన అస్త్రసన్యాసం చేసి వీరమరణం పొందటం ఇందులోని ముఖ్యాంశం. ఆ తర్వాత యుద్ధరంగంలో అభిమన్యుడి పోరాట పటిమ, ఆ యువకుడి వీరమరణం ఇతర ముఖ్యాంశాలు.
.
8. కర్ణపర్వం: కౌరవ సోదరులలో రెండవవాడైన దుశ్శాసనుడు భీముని చేతిలో నేలకూలటం, మహావీరుడైన కర్ణుడు అర్జునుని చేతిలో వీరమరణం పొందటం... ఇందులోని ప్రధానాంశాలు.

9. శల్యపర్వం: మహాభారత యుద్ధంలోని చివరి ఘట్టాలను వర్ణించేది శల్యపర్వం. భీమదుర్యోధనుల యుద్ధం, దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణించటం ముఖ్యాంశాలు.
.
10. సౌప్తికపర్వం: ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ ప్రతీకార కార్యకలాపాలు, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న ఉపపాండవులను, పాండవుల సైన్యాన్ని, మిత్రపక్షాలను అశ్వత్థామ ఊచకోత కోయటం ఈ పర్వంలో ప్రధానాంశాలు.
.
11. స్త్రీపర్వం: వీరమరణం పొందిన కురుపాండవ యోధులకు సంబంధించిన భార్యల రోదనలు, విషాద సన్నివేశాలు ఇందులో ఉంటాయి. యుద్ధం ఎప్పుడు జరిగినా చివరకు మిగిలే విషాదం ఇందులో కళ్లకు కడుతుంది.
.
12, 13. శాంతి, అనుశాసనిక పర్వాలు: ధర్మరాజు అభ్యర్థన మేరకు, వంశకర్త అయిన భీష్ముడు ధర్మానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను బోధించటం, అత్యంత ప్రాచుర్యం పొందిన విష్ణు సహస్రనామాలు, శివసహస్రనామాలు, భీష్ముని మరణం, ధర్మరాజుకి పట్టాభిషేకం ఇందులో కనిపిస్తాయి.
.
14. అశ్వమేధిక పర్వం: శ్రీకృష్ణుడు ద్వారకకు మరలిపోవటం, ధర్మరాజు చేసిన అశ్వమేథయాగ వర్ణన ఉంటాయి. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేస్తూ ఒక ముంగిస ధర్మరాజును పరాభవించటం ఇందులోని కొసమెరుపు.
.
15. ఆశ్రమవాస పర్వం: కుంతి, గాంధారి సమేతుడై ధృతరాష్ట్రుడు అరణ్యాలకు పయనమవ్వటం, అక్కడ ప్రమాదవశాత్తూ అరణ్యంలో దావాగ్నిలో అసువులు బాయటం ఇందులో చూడవచ్చు.
.
16. మౌసలపర్వం: యాదవ వీరులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవటం, ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించటం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి.
.
17. మహాప్రస్థానిక పర్వం: పాండవుల అంతిమయాత్ర గురించిన వర్ణన ఇందులో ఉంటుంది.
.
18. స్వర్గారోహణ పర్వం: భీమార్జున, నకులసహదేవుల మరణం, ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరటం ఇందులోని ప్రధానాంశం.
.
గురుదేవులు అశీస్సులతో...
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి.

Post a Comment