Breaking News
Join This Site
శ్రీకృష్ణుడు నెమలి పించం ధరించడం వెనుక అసలు కథ

శ్రీకృష్ణుడు నెమలి పించం ధరించడం వెనుక అసలు కథ
కృష్ణుడు అంటేనే లీలలు .. కృష్ణుడు ఎప్పుడు నెమలిపించం ధరించకుండా కనబడడు.. అసలు  శ్రీకృష్ణుడు నెమలి పించం ఎందుకు ధరిస్తాడు ?

ఒక విశ్లేషణ నెమలి శారీరిక సంపర్కం చేయదు కాబట్టి:

ఈ సమస్త సృష్టిలో శారీరిక సంపర్కం లేకుండా సంతానం పొందగలిగేది ఒక్క నెమలి మాత్రమేనటుంది శాస్త్రం.
మగనెమలికి పించం ఉంటుంది. వర్షాకాలంలో గంభీరంగా ఉరుముతున్నప్పుడు పులకించిన మగనెమలి నాట్యం చేసినపుడు కంటి నుండి ఆనంద భాష్పాలు రాలుతాయి.ఆ సమయంలో మగనెమలి కంటి నుంచి పడే బిందువులను ఆడనెమలి వచ్చి త్రాగుతుంది. ఆ నీటిని త్రాగడం ద్వారా ఆడనెమలి సంతాన భాగ్యాన్ని పొంది గర్భం ధరిస్తుందట.

ఎటువంటి శారీరిక సంబంధం లేకుండా జరుగుతుంది ఈ ప్రక్రియ. శ్రీ కృష్ణుడు యోగి. ద్వాపరయుగంలో భూమిపై తిరగాడిన సిద్ధపురుషుడు. అటువంటి శ్రీ కృష్ణుడు తనకు అందరితో ఉన్నది ఆత్మ సంబంధమేనని, ఎవరితోనూ తనకు శారీరిక సంబంధం లేదని, తాను ఒక యోగినని తెలుపడానికే నెమలి పించం ధరించి కనిపిస్తాడు అని ఒక విశ్లేషణ.


మరో విశ్లేషణ బ్రహ్మదేవుడు నెమలికి ఇచ్చిన వరం:

ఒకానొక రోజు బ్రహ్మ లోకాన బ్రహ్మదేవుడు దీక్షగా కూచుని రకరకాల పక్షులను తీర్చిదిద్దుతున్నాడు. చిలకలు, పిచ్చికలు , గోరువంకలు, పాలపిట్టలు, పావురాలు ఇలా ఒక్కోదానికి ఒక్కొక్క పేరు ఖాయం చేస్తున్నాడు. అన్ని పక్షులు చిన్న చిన్నవే అవుతున్నాయని అప్పుడు ఒక పెద్ద పక్షిని ఊహించి, తయారుచేయడం మొదలు పెట్టాడు. దాని రూపురేఖలు, రంగులు అన్నీ కొత్తగా దిద్దాడు. దానికి రెక్కలను చిన్నదిగా, చిత్రంగా అమర్చాడు. పొడవైన తోక పెట్టాడు. దానికి చిత్రాతిచిత్రమైన యీకలు సమకూర్చాడు. అది తలుచుకుంటే ఆ తోకను విసనకర్రలా విప్పాలి . అప్పుడు ఆ పక్షి ఆకర్షణీయంగా కనిపిస్తుంది అనుకున్నాడు .

ఇదంతా ఒక పక్కనుంచి  గమనిస్తున్న సరస్వతీదేవి ఆ పక్షి అందచందాలకు చాలా మురిసిపోయింది. “దానికి మంచి నాట్యకౌశలం కూడా వుంటే, ఆ చక్కదనానికి మరింత శోభ చేకూరుతుంది” అని బ్రహ్మ కు  సలహా ఇచ్చింది. విద్యా బుద్ధులు అనేది నీపని, నువ్వే అనుగ్రహించాలి అని బ్రహ్మ అనగా, అనుగ్రహించి దానికి “నెమలి” అని పేరు పెట్టింది సరస్వతి. అంతే కాకుండా తన వాహనంగా స్థానం కల్పించింది.

నెమలి అందానికి, ఆటకి సార్ధకత చేకూరిందని బ్రహ్మ ఆనందించాడు. కానీ నెమలి ముఖంలో మాత్రం ఆనందం కనిపించలేదు. ఏమిటీ నీ కోరిక? అన్నాడు బ్రహ్మ . ఒక్క బ్రహ్మ లోకానికే పరిమితం కావడమా? అని అడిగింది నెమలి. అయితే కుమారస్వామికి వాహనమై కైలాసంలో గెంతులు వెయ్యమని కటాక్షించాడు. నెమలి ఆ మాట వినగానే ఒక్కసారి పురివిప్పి ఆనందంతో నాట్యం చేసింది. కొంత సేపు నాట్యం కాగానే నెమలి పించం ముడుచుకుంది. దానితో పాటు దాని ముఖమూ చిన్నపోయింది. నీకు మళ్ళీ ఏమైంది? అన్నారు బ్రహ్మ మరియు సరస్వతి.

మరి విష్ణులోకంలో నా సంగతి తెలిసేదెలా? అని దీనంగా ముఖం పెట్టింది నెమలి తెలివిగా . బ్రహ్మకు ఆ మాట వినగానే కోపం వచ్చింది. కాని నిదానించుకొని, ఎంతైనా తను ఏరికోరి తయారుచేసిన ప్రాణి కదా! పైగా అది అనూహ్యంగా అద్భుతంగా కూడా తయారైంది. అందుకని తెలియకుండానే దాని మీద, మమకారం ఏర్పడింది. అంతే కోపాన్ని అణచుకొని విష్ణులోకంలో కాదు కానీ, ద్వాపర యుగంలో ని నెమలి పించం కృష్ణుని తలపై కిరీటంలో నిత్యం రెపరెపలాడుతుంది. సరేనా!” అన్నాడు. అప్పుడు నెమలి ముఖం దీపంలా వెలిగింది.. ఈ విధం గా బ్రహ్మ వరానికి ఫలితం గా ద్వాపరయుగం లో శ్రీకృష్ణుడు నెమలి పించం ధరిస్తాడని మరొక విశ్లేషణ

॥ హరే రామ హరే రామ రామ రామ హరే హరి ॥
॥ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరి ॥

Post a Comment