Breaking News
Join This Site
ఓ సీత కథ (శ్రీ రాధా కుమారి)

ఓ సీత కథ (శ్రీ రాధా కుమారి)       సీత కొడుక్కి ఏడేళ్ళుంటాయేమో.. ముద్దుగా బొద్దుగా ఉంటాడు. మహా మొండివాడు. సమాధానం దొరికే వరకు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాడు.. అదే బాణీలో ఒక ప్రశ్నను సీతను పదే పదే అడిగి వాడు విసిగిపోయినా పట్టు వదలని విక్రమార్కునిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు సమాధానం కోసం. సీత ఎప్పుడూ ఏదోటి చెప్పి కొడుకుని ఏమార్చుతున్నా.. మనసు తొలిచేస్తుంది సమాధానం చెప్పలేక... "అమ్మా నాన్నెపుడొస్తాడు.. అమ్మా నాన్న కావాలి" వింటూనే సీత కళ్ళవెంట నీళ్ళు అప్రయత్నంగా జాలువారుతున్నాయి.. పరధ్యానంగా తన చేతిలో ఉన్న జంతికలు కొడుక్కి తినిపిస్తూ గతంలోకి తొంగి చూసింది...


సీత ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. చక్కని సంస్కారం.. పెద్దల పట్ల వినయం విధేయత గల అమ్మాయి. పదవ తరగతి వరకు గ్రామంలో చదివినా ఆపై చదువుకు పట్నం వెళ్ళవలసిందే. సీత చదువుకుంటానని పట్టు బట్టడంతో కూతురిపై మమకారంతో కాదనలేక పట్నంలోని కాలేజిలో అయిష్టంగానే చేర్పించారు. సీత రోజూ ఆర్టీసి బస్సులో కాలేజికి వెళ్ళి వస్తుండేది. అదే బస్సులో ప్రతిరోజూ ప్రయాణం చేసే రాహుల్ సీతతో పరిచయం పెంచుకున్నాడు. మొదట్లో బిడియ పడినా మెల్లమెల్లగా సీతకూడా అతనితో స్నేహాన్ని పెంచుకుంది.. స్నేహం కాస్తా ప్రేమకు దారి తీసింది. సీతది పల్లెటూరు కావడంతో ఆనోటా ఈనోటా తల్లిదండ్రులకు విషయం తెలిసింది. తన తల్లిదండ్రులకు వారి ప్రేమ విషయం తెలిసిపోయిందనీ... పరువుహత్యలకు పుట్టినిల్లు అయిన ఆ గ్రామంలో మరోపరువు హత్య తనదే అవుతుందనీ సీత బోరున ఏడ్చింది రాహుల్ దగ్గర. రాహుల్ ధైర్యం చెప్పి గుట్టుగా గుడిలో దండలు మార్చుకుందాం అన్నాడు. సీత కూడా ఒప్పుకుంది. ఇద్దరూ ఒకటయ్యారు.. చిన్న గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. తల్లిదండ్రుల గురించి బెంగ.. ఒకింత భయాన్ని భర్త ప్రేమ డామినేట్ చేసింది. సీత సంతోషంగా ఉంది.. చూస్తుండగానే నాలుగు నెలలు ఇట్టే గడిచి పోయాయి. సీత గర్భవతి అని తెలిసింది. సంతోషంగా భర్తతో చెప్పింది. భర్త కూడా చాలా సంతోషించాడు. సీత కోసం పళ్ళు ఫలాలు తెస్తానని సీతకు చెప్పి వెళ్ళిన రాహుల్ ఇంత వరకూ పత్తా లేడు. వస్తాడన్న ఆశ సీతకూ లేదు. మోసపోయిన సీతపై జాలిపడి ఇరుగుపొరుగు చేసిన సహాయంతో బిడ్డను కన్న సీత.. అటు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళలేక... ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ బ్రతుకునీడ్చలేక.. రాహుల్ లాంటి రాబందుల చూపుల దాటికి తాళలేక..ఇటు కొడుకు ప్రశ్నలకు జవాబు చెప్పలేక..తనకుతానుగా దిగిన రొంపిలో దిగాలుగా సీత.కోల్పోయిన జీవితం తాలూకా జ్ఞాపకాలలోంచి కొడుకు పిలిచిన అరుపు లాంటి పిలుపుతో బయటపడింది సీత. 
దగ్గరలో ఉన్న ప్రభుత్వపాఠశాలలో కొడుకు రెండో తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న జానకి ఎవరి ద్వారానో సీత విషయం తెలుసుకుంది. సీతను పిలిపించి తనకు తెలిసిన స్వచ్ఛంద సంస్థలో టైలరింగ్ శిక్షణ తీసుకునేందుకు సీతను ఒప్పించింది. సీత టైలరింగుతో పాటు దూరవిద్య ద్వారా.. మధ్యలో ఆపివేసిన ఇంటరు.. తర్వాత డిగ్రీ పూర్తి చేసేలా జానకి ప్రోద్భలం ఎంతో ఉపకరించింది. ఇపుడు సీత మునుపటిలా బేలగా లేదు. తన కాళ్ళ మీద తను నిలబడుతూ... మరో ఇద్దరికి పని కల్పించింది. స్వచ్ఛంద సంస్థ వారు నిర్వహించే సదస్సులలో తన జీవితాన్ని ఉదాహరణగా చూపి.. ఆడపిల్లలు తమ జీవితాలపై ఎంత జాగరూకతతో ఉండాలో తెలియజేస్తుంది... ! నిండైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతుంది . సీత ఆచూకీ తెలుసుకున్న తల్లిదండ్రులు సీతను; మనువడిని అక్కున చేర్చుకున్నారు. సమాప్తం. _/\_ మీ శ్రీ రాధా కుమారి..

Post a Comment