Breaking News
Join This Site
ఓంకారం పరబ్రహ్మ స్వరూపం

ఓంకారం పరబ్రహ్మ స్వరూపం

సనాతనమైన హిందూ ధర్మమునందు ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. సర్వశ్రేష్ఠుడైన భగవంతునికి ఆకార రూ పం(నామ) నాదరూపం ఓంకారము. ప్రణవ నాద ము, ప్రధమ నామము, ఏకాక్షరమైన ఓంకారము. ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకార ము నుంచే యావత్తు జగము ఉద్భవించింది.వేదముల యొక్క సారము ఓంకారము. `ఓం' అంటే ప్రారంభాన్ని తెలుపునది కూడా. ఓకాక్షర మంత్రము, భగవంతుని ముఖ్యనామమైన `ఓం'కు అనేక అర్థాలు కలవని రుషులు తెలియజేశారు. బ్రహ్మనాదము ఓంకారము. ఆత్మ ఓంకార మంత్ర స్వరూపము ప్రణవ నాదమే ప్రాణము. ప్రధమ నాదము ఓంకారము. అకార, ఉకార, మకారములను మూడు అక్షరముల కలయిక వలన ఓంకారము ఉద్భవించినది.

ఆత్మ మనస్సును ఉద్బోధించును. ఆ మనస్సు నాభియందున్న అగ్నిని కొట్టును. ఆ అగ్ని వాయువును ప్రేరేపించును. ఆత్మ, మనస్సు, అగ్ని, వాయువు అను యీ నాలుగింటి వలన నాదముద్భవించినది. ఈ నాలుగు కారణములై నాదమును పుట్టించుచున్నవి. బ్రహ్మ గ్రంధియందున్న ఆ నాదము ఊర్ధ్వ ముఖముగా (పైకి) సంచరించుచు క్రమముగా నాభి (బొడ్డు), హృదయము, కంఠము, మూ ర్షము, ఆస్యము (నోరు)ల యందు పుట్టుచున్నది. వీటి ద్వారానే వెలువడుచున్నది. ఈ నాదము నాభియందు అతి సూక్ష్మముగను, హృదయమునందు సూక్ష్మముగను, కంఠమునందు పూర్ణముగను, శిరమునందు అసంపూర్ణముగను, ఆస్యమందు కృత్రిమముగను పుట్టుచున్నది. నాదము వలన అక్షరమును, అక్షరముచే పదమును, పదముచే వాక్యమును, వాక్యముచే లోక వ్యవహారమును అగుట వలన వీటితో కూడిన యావజ్జగత్తూ నాదాధీనము. నాదమును ఉపాసించుటచే విష్ణువు ఉపాసింపబడిన వాడగుచున్నాడు. కనుక నాదాత్మకుడు నాదప్రియుడు.`నాద'ము అను రెండు అక్షరములలో `న' అను అక్షరము ప్రాణమని ప్రసిద్ధమై ఉండును. `ద' అను అక్షరము అగ్ని రూపమని చెప్పబడినది. ఈ కారణముచేత ప్రాణాగ్నుల యొక్క సంయోగము వలన నాదము (శబ్దము, ధ్వని) ఏర్పడినది. `న'కారము ప్రాణమనియు, `ద'కారము అగ్ని అనియు కావున అట్టి ప్రాణాగ్నుల సంయోగముల వలన యేర్పడు ధ్వని నాదమయింది.ఇంత పవిత్రమైన మహత్తరమైన నాదము వలన ఏర్పడిన వాక్కును (మాటలను) మనము ఎం తవరకు సద్వినియోగపరుస్తున్నాము? గాలి కబుర్లతోనా? సత్యసంధతతోనా? దైవిక కార్యముల కోసమేనా? పరనిందల కోసమా?

మన పూర్వ రుషులు, మహాత్ములు భగవత్‌ తత్తా్వన్ని రెండు విధములుగా వర్ణించారు.
1) అజరామరము (శాశ్వతమైనది), 2) అగోచరము (అగుపించనిది).
నిశ్చలమైన మనస్సుగల సాధకులకు మాత్రమే ఇది సాధ్యము. గురువులచే ఉపదేశింపబడిన మార్గము చేత ఉపాసింపబడుట వలన మాత్రమే గోచరమయ్యే నాదము. దీనిని ``అనాహత నాదము'' అంటారు. అనగా సాధకుని చిత్తమున అతని కొక్కనికే తెలియునది.

సాకార సగుణ బ్రహ్మము: దీనియందు దేహాన్ని ధరించిన మన ఇంద్రియములకు, బుద్ధికి గోచరమగునట్టిదిగా ఉండి భగవత్‌ సాక్షాత్కారాన్ని పొందుటకు సులభమైన మార్గముగా, పాపనాశనమును పొందునట్టుగా వర్ణింపబడినది. వేదముల ఆధారముగా తెలుసుకొనిన ఎడల సాధన ఆనంద దాయకముగా ఉండును.ఈ నాదబ్రహ్మమును, శబ్ద బ్రహ్మమును ఆధారంగా తీసుకునే నామ సాధన, జప యోగ సాధన జరుపబడుతున్నది. ఈ కలియుగములో శ్రీహరి నామ జపము ద్వారానే అన్ని కర్మలను, కార్యములను సాధించగలము.సృష్టి అంతయూ శ్రీమహావిష్ణువు యొక్క మహా ప్రసాదము. శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ పరమ పావనమైనది. పరమాత్మకు యిష్టమైనది ``జపము.''`జ' అంటే జన్మ విచ్ఛేదం (జన్మము)`ప' అంటే పాప నాశకం.కర్మల ఫలితమే జన్మ కారణం. జప యజ్ఞం వలన జన్మ, కర్మల ఫలితం నశించి మోక్షం సిద్ధిస్తుంది.పునర్జన్మనూ, పాపమును నశింపచేసేది జపము. ఇటువంటి జపములో ఓంకార జపము (ఓం కారాన్ని ఉచ్ఛరించడం) శ్రేష్ఠమైనది. నామజపము యాంత్రికము కాకూడదు.

ఓంకారానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందులో ఒకటి స్వాగతం. ఓం గురించి నిఘంటువు చెపుతున్న అర్థాలు 1. ప్రారణ్యర్థకం. 2. పరబ్రహ్మం. 3. పరమాత్మ నామమే ఓంకారం. ప్రతి మంత్రం ఓంకారంతోనే మొదలవుతుంది.

భగవంతుడు `ఓం' అను దివ్యాక్షరంతో పిలువబడుతున్నాడు. భగవద్గీత 10వ అధ్యాయం 25వ శ్లోకంలో వాక్కులలో (మాటలలో) ఏకాక్షరమైన `ఓంకారమును నేనే' అని అంటాడు శ్రీకృష్ణుడు. ఓంకారమును అనుమతి కోసం, సమ్మతి తెలియచేయడానికి కూడా ఉచ్ఛరిస్తాము. జ్ఞాన స్వరూపం ఓంకారం. నిరంతర మానసిక జపం ఆత్మశుద్ధిని కలిగిస్తుంది.భగవత్తత్త్వము నెరిగి నామజపం ద్వారా సాధన చేయడం వలన చిత్తశుద్ధి, తద్వారా పూర్ణత్వం సిద్ధిస్తుంది. మనలోని స్వార్థం తొలగిపోవాలంటే ``ఓంకారాయ నమ:'' అంటూ జపించాలి.ఎంతో గొప్ప - సమున్నతమైన ఒక్క నామంపట్ల శ్రద్ధ, భక్తి ఉంటే చాలు. బ్రతుకు పండుతుంది. ఓంకారంతోను, శంఖారావంతోను, ఘంటా నాదముతోను దుష్టశక్తులన్నీ దూరంగా పారిపోతాయి. శబ్దం ముందు పుట్టిందనీ, ఆ శబ్దం నుంచే సృష్టి యావత్తూ ఆవిర్భవించిందనీ మహర్షులు చెప్పిన మాటలు సత్యములు. మహా పాపిని కూడా యోగిగా మార్చగల శక్తి నామ జపము వలన సాధ్యపడుతుంది. జీవితములో ఎంతో గొప్ప మార్పును యివ్వగలిగే శక్తి ఒక్క నామజపానికి మాత్రమే ఉంది. నాదప్రియుడైన, నామరూపుడైన, నాదరూపుడైన దేవాది దేవునికి నాదయోగంతో జపయజ్ఞం చేసి సిద్ధిపొందుదాము.

గమనిక : జపము చేయునపుడు సోమరితనము, ఆవులింత, నిద్ర, తుమ్ము, ఉమ్మివేయుట, భయము, శరీరమునందలి నీచమైన అవయవములను స్పృశించుట, కోపము వంటి పనులను వెంటనే విడిచిపెట్టవలెను.

Post a Comment