Breaking News
Join This Site
సాధారణ ప్రజలు సుందరకాండను ఓ మండలం రోజులు పారాయణం చేస్తే!

సాధారణ ప్రజలు సుందరకాండను ఓ మండలం రోజులు పారాయణం చేస్తే!




సాధారణ ప్రజలు సుందరకాండను ఓ మండలం రోజులు పారాయణం చేస్తే చాలు మానసిక వ్యాధులను, దీర్ఘకాలిక రోగాలు మటుమాయం అవుతాయి. చివరకు ఆర్థిక బాధలు తొలుగుతాయి ఎంతో మంది తమ తమ అనుభవపూర్వకమైన ఘట్టాలను వివరిస్తుంటారు. రామనామం ఎక్కడ ఉంటే అక్కడక్కడ ఆంజనేయస్వామి ముకుళిత హస్తాలతో కనుల నీరు నిండగా ఆర్తితో నిలబడి ఉంటాడు. రామభక్తులకు కించిత్తు అపాయం కలుగకుండా రక్షిస్తుంటాడు. ఏవిధమైన కష్టాలకు రామభక్తులు గురికాకుండా చూస్తుంటాడీ ఆంజనేయుడని అనుభవజ్ఞుల మాట.
రామ అని పలకడం రాని వాడు మర అని ఉచ్చరిస్తూ రామ అన్న పదంలోకి మారుతూనే మహర్షి అయినాడు. రామ నామంతోనే హనుమంతుడు నూరు యోజనాలు గల సముద్రాన్ని గోష్పాదమంత యోజనమన్నట్లుగా సులభంగా దాటగలిగినాడు. రామ అన్న శబ్దం విన్నంతనే గజగజ వణికే మారీచుడు సైతం రామనామంతోనే ఉద్ధరించబడ్డాడు. రామ అన్న శబ్దంలోనే సంజీవనీ పర్వతాన్ని పెకలించుకుని వచ్చి హనుమంతుడు యుద్ధరంగంలో గాయపడినవారినెల్లా రక్షించుకున్నాడు. విష్ణు సహస్రనామాన్ని చదవలేని వారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే... అనే శ్లోకాన్ని చదివినా వారికి విష్ణుసహస్రనామావళిని జపించిన పుణ్యాన్ని అనుగ్రహించాడు. పరమేశ్వరుడు. సీతారాములు అనురూపులు వారిది విడదీయలేని బంధం.రామచంద్రునకు తన పేరుతో పాటు సీతపేరు ను చేర్చి సీతారాం అన్న మరింత ఇష్టదాయకమని ఓ పురాణగాథ తెలుపుతుంది. రామ అనే పదం పాతకాలను నాశనమొనరుస్తుంది. రామనామం ప్రభావం ఇంత అని కొలవడానికి వీలులేనిది.

అగ్ని వంశమందు పరశురాముడు, సూర్యవంశమందు శ్రీరామ చంద్రుడు, చంద్రవంశమందు బలరాముడు పుట్టారు. అగ్నికి మూడు కళలును, సూర్యునకు పండ్రెడు కళలును, చంద్రునకు ఒక కళను కలవంటారు. ఇవి అన్నీ కలసినా పదహారు కళలు అయితే అవిఅన్నీ ఉన్న వీరాధివీరుడు శ్రీరాముడు. అతని నామమే మోక్షానికి తరుణోపాయం. శ్రీరామ నామంలోని గొప్పతనం తెలుసుకొన్న గణపతి గణాధ్యక్షుడయ్యాడంటారు. శ్రీరామ లోని ప్రభావంతెలసుకొన్నవాడు కనుక పరమేశ్వరుడు హలాహలాన్ని పుక్కిట పట్టి సర్వ లోకాలను రక్షించగలిగాడు. అందుకే రామనామమెంతో ఎంతో రుచి ఎంతో రుచి అని సంగీతజ్ఞులు సెలవిచ్చారు. పాలుమీగడలకన్నా, పంచదార చిలకలకన్నా ఎంతో ఎంతో రుచి రామనామం అంటారు.
రామఅనగానే పూర్వ జన్మ కర్మలను దహించివేసి అపార పుణ్యరాశి మన వశవౌతుంది. కనుకనే నిరంతరమూ రామనామంతో పునీతం అవుదాం. రామునిలాగా ధర్మాచరణులమవుదాం. రాముని నడతను మనమూ అలవర్చుకుందాం.