Breaking News
Join This Site
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇంకేదో వస్తుందని ఎదురుచూస్తూ ఉంటే!

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇంకేదో వస్తుందని ఎదురుచూస్తూ ఉంటే!

      రంగడు అనే యువకుడు ఒకడున్నాడు. ఇతను చాలామంచివాడు. మంచిపేరు ఉంది. జీవితంలో ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఎక్కువ. చాలాసార్లు ప్రయత్నాలు చేశాడు. కాని అతని టార్గెట్ ఎలాంటిదంటే! కొండని పొట్టేలు డీ కొట్టినట్లు ఉంటుంది. దానివలన చాలా కష్టాలు పడ్డాడు. అయినా ఎక్కడా తగ్గలేదు. ఒకానొక సమయంలో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఒకరోజు భగవద్గీత చదువుతుంటే మంచి సందేశం కనబడింది. " జీవితంలో వచ్చిన అవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప అందని దానికోసం పోరాడితే జీవితం దెబ్బతింటుంది" వచ్చిందే నీది రానిదాని కోసం ఆశపడకు." ఇది దాని సారంశం. అది చదివి సరే చూద్దాం అని ఇంతకుముందు చేసిన ప్రయత్నాలు ఆపేసి ఎం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు.

జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశించింది. ఇద్దరిమధ్య బంధం కొన్నాళ్ళకి క్రాష్ అయింది. కొన్నాళ్ళకి మళ్ళి ఇంకో అమ్మాయి వచ్చింది. అది క్రాష్ అయింది. ఆ తరువాత ఇంకో అమ్మాయి వచ్చింది అది క్రాష్ అవ్వడానికి సిద్దమైంది. అర్థంలేదు.

మరోప్రక్క వ్యాపారం కూడా ఆ కొటేషన్ దెబ్బకి "అవకాశం వస్తుంది, మరో అవకాశం వస్తుంది, ఇంకా మంచి అవకాశం వస్తుంది" అంటూ వచ్చిన అవకాశాలు వృథా చేసుకుంటూ, కాలాన్ని వృథా చేస్తూ, వచ్చిన అమ్మాయిలని ఎదో ఒక అపార్థంతో దూరం చేసుకుంటూ జీవితాన్ని అంధకారంలోకి తోసుకున్నాడు. 

దేవుడిమీద కోపం వచ్చింది. ఇంతకుముందు పోరాడాను. కష్టమో నష్టమో ఎదో ఒక పోరాటం చేశాను. ఇప్పుడు జీవితం అంధకారం అయింది అంటూ కోపంతో ఊగిపోయాడు. ఆరోజు రాత్రి కలత నిద్రపోతు ఉండగా! ఏవో వాక్కులు వినబడ్డాయి. స్వామివి అని స్పష్టంగా తెలుస్తున్నాయి. 

స్వామి! నువ్వు చెప్పినట్లే చేశాను కాని మరొక విధంగా చేయలేదు. మరెందుకు ఇలా జరిగింది? అని అడిగాడు. 
నాయనా! వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోమన్నాను కాని ఇంకా ఇంకా అంటూ అంటూ ఆశపడమని చెప్పలేదు. అయినా నీకోసం ఎప్పటికప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉన్నాను కదా! అయినా అర్థం చేసుకోకపోతే ఎలా! ఒక అమ్మాయి పోయింది. మరొక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పోయింది మరొక అమ్మాయి వచ్చింది. అందరితో గొడవలు పెట్టుకుంటూ పొతే ఎవరు ఉంటారు నీతో? 


జీవితంలో అందరికీ ఎన్నో గొప్ప అవకాశాలు కల్పిస్తాను. కాని అంతకుమించి అంతకుమించి అంటూ ఉన్న అవకాశాలు కోల్పోతున్నారు. అవకాశం కోల్పోతే తిరిగివస్తుందా? జీవితం అంధకారం అవ్వదా?

వచ్చిన అవకాశం చిన్నదైన పెద్దదైనా దానిని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే విజయం సాధిస్తారు. పర్వతాల మీద ఉన్న దేవాలయానికి వెళ్ళాలి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి కాని ఎగిరి దూకలేవు కదా! విత్తనం మొక్క అవుతుంది. మొక్క మాను అవుతుంది. అప్పుడు ఆమానుకి పువ్వు కాయలు పూస్తాయి. ఫలాలు అందరికి అందుతాయి. విత్తనం దశలో ఉన్నప్పుడే ఆ విత్తు పూలు కాయలు ఇవ్వడం సాధ్యమౌతుందా?! కుదరదు కదా! అలాగే నువ్వు పోరాడాలి అనుకుంటే! నీ స్థాయిని మించి పోరాడకు. ఏది చేయగలవో గుర్తించు, నీశక్తి ఎంతో తెలుసుకొని పోరాడు. అదేసమయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో జీవితంలో గందరగోళం లేకుండా సుఖపడతావు. ఎదో వస్తుందని ఎదురుచూస్తూ కాలాన్ని వృథా చేయడం, వచ్చిన దానిని గుర్తించక కాలదన్నుకోవడం చేయకూడదు. మరుక్షణం ఏమౌతుందో తెలీదు. ఈక్షణమే నీది అని గుర్తించు. అనగానే మెలుకువ వచ్చింది.
      వెంటనే లేచి స్వామి చెప్పినట్లు చేయడం ప్రారంభించాడు. అపార్థాలు తొలగించుకున్నాడు. వివాహం చేసుకున్నాడు. జీవితంలో వచ్చిన చిన్న పెద్ద అవకాశాలు దేనిని వదలకుండా ప్రయత్నించి జీవితంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించాడు.

కనుక నాకు తగినది/తగినవాడే రావాలి అని చూడకండి. వచ్చినవారిని మీకు నచ్చినట్లు మలచుకోండి. అపార్థాలు ఉంటె మనస్సు విప్పి మాట్లాడండి. అవే తొలగిపోతాయి తప్ప ఎదో తప్పు చేశారు అని అపార్థాలు చేసుకొని కలిసి ఉండలేం, నన్ను అర్థం చేసుకునేవారే రావాలి అంటూ ఉంటే జీవితం గడిచిపోతుంది. తప్ప జీవితంలో ఏమి ఉండదు.  ఆజీవితం వలన ఉపయోగం ఉండదు. చిన్నదో పెద్దదో ఏఅవకాశం వచ్చిన విడువకండి. మీరు చేయడానికి సరిపడా సామర్థ్యం ఉన్న పనిని ఎంచుకొని పోరాడండి. అప్పుడే విజయం వరిస్తుంది.

విజయం అంటే వేలకోట్లు సంపాదిస్తే వచ్చేదో, పెద్ద పెద్ద చదువులు చదివితే వచ్చేదో, అందమైన అబ్బాయి/అమ్మాయిని  పొందితే వచ్చేది కాదు. ఏ లోటు లేకుండా సాగిపోయేదే అసలు సిసలు జీవితం. ప్రశాంతత పొందడమే అసలైన విజయం. పూర్వం విజయం సాధించిన వారిని ఎవరినైనా తీసుకోండి. వారి చరిత్రలు చదివి చూడండి. మంచితనంతో, కష్టపడి సాధించినవే తప్ప డబ్బుతో చదువుతో అందంతో సాధించిన విజయాలు ఉండవు.

Post a Comment