Breaking News
Join This Site
 ఏది మనం ఇతరులకి ఇస్తామో అదే మనకి తిరిగి లభిస్తుంది.

ఏది మనం ఇతరులకి ఇస్తామో అదే మనకి తిరిగి లభిస్తుంది.ముందుగా చిన్న యధార్థ గాధ ఒకటి చెప్పుకుందాం.

నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడిపేరు సురేష్. పక్క డబ్బు మనిషి. డబ్బు వస్తుంది అంటే ఏదైనా చేస్తాడు. (సినిమాల్లో చూపించినట్లు హత్యలు, మానభంగాలు ఇలాంటివి కాదు).. చిన్ని చిన్ని దొంగతనాలు. తండ్రిని తిట్టడం కొట్టడం, ఇలాంటివి చేస్తుంటాడు. చిన్నప్పటి నుండి ఆర్థిక ఇబ్బందులు కూడా దీనికి ఒక కారణం కావచ్చు. జైలుకి వెళ్ళొచ్చాడు. ఐతే వాళ్ళ నాన్నకి 45 వయస్సు వచ్చాక కలిసి వచ్చింది. 5ఏళ్ళల్లో ఒక ఊపు ఊపేశాడు. దాదాపు పిల్లకి పెళ్లి చేయడం, మనవడికి మనవరాలికి బంగారం పెట్టడం, కొడుక్కి పెళ్లి చేయడం. అతడి పిల్లలకి బంగారం కొనడం, ఆడపిల్లల పేరుమీద బ్యాంకు లో డిపాజిట్లు చేయడం. అన్ని పోగా ఇల్లు కట్టి కొడుక్కి ఓ 10లక్షల వరకు ఆస్తి ఇచ్చి నడుస్తూ నడుస్తూ ప్రాణం వదిలేశాడు. మన అబ్దుల్ కలాం గారు మాట్లాడుతూ పడిపోయినట్లుగా అన్నమాట. 

తండ్రి చనిపోయాక ఒకమాట అన్నాడు సురేష్. నాకు డబ్బులు ఇచ్చాడు కనుక మానాన్న అంటే గౌరవం లేదంటే తలకొరివి కూడా పెట్టేవాడిని కాదు. అని నిర్మొహమాటంగా చెప్పాడు. అలాంటి మెంటాలిటి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా! ఎవ్వరిలోనైనా మార్పు రావలసిందే! ఇతడి నేను ప్రక్కన ఉండి మహాభారతం కథలు చెప్పడం, (అప్పటికే మహాభారతం రెండుసార్లు చదివాను) భక్తి గురించి మాట్లాడడం, గరుడ పురాణం వంటివి వినిపించడం వలన కొంత మార్పు వచ్చింది. కాశి - గయా, త్రివేణి సంగమం వెళ్లి తండ్రికి పిండప్రదానం చేయడం వంటివి చేశాడు. క్రమంగా మార్పు మొదలైంది. ఈమధ్య కాలంలో ఎంత మార్పు చెందాడంటే! పేదవారు ఎక్కడ కనబడినా అన్నం పెట్టడం, పేదవారి ఇళ్ళకి వెళ్లి (ఆస్తులు పంచుకున్న పిల్లలు వదిలేసి వెళ్లిన వృద్ధుల వద్దకు వెళ్లి) నెలనెలా 5గురికి 10కిలోల బియ్యం ఇవ్వడం చేస్తున్నాడు. మాకు మొదటి నుండి వీడి సంగతి తెలుసుకనుక లొల్లాయి కబుర్లు అనుకున్నాం. కానీ క్రమక్రమంగా నిజమే అని తెలిసింది. ప్రతి ఆదివారం పేదవారికి అన్నదానం చేస్తున్నాడు. దుప్పట్లు పంచుతున్నారు. ఇంతమార్పు ఎలా వచ్చింది? అని ఒకసారి సందేహం వచ్చి అడిగాం. అప్పుడు అతని మాటలు విని నేనైతే ఆశ్చర్యపోలేదు కానీ విన్నవారు ఆశ్చర్యపోయారు. ఇతను అనుభవ పూర్వకంగా చెప్పిన మాట ఇది. తండ్రి ఆస్తి ఇచ్చినప్పుడు కాని, అంతకు పూర్వం కాని డబ్బులు కోసం తెగ ఇబ్బంది పడ్డాను. విసుగు కోపం, వచ్చేది. ఏదేదో చేసేవాడిని. 6నెలల క్రితం నేను ఒకరోజు నువ్వు చెప్పిన మాట విని అతి కష్టం మీద అన్నదానం చేశాను. అదేం విచిత్రమో! తెల్లారి సాయంత్రానికి పాత బాకీలు ఉన్నవారు వచ్చి 10,000 ఇచ్చి వెళ్లారు. సందేహం వచ్చింది. మరుసటి వారం కూడా అన్నదానం చేశాను. నన్ను కాదని వెళ్లి వేరేవారికి పని ఇచ్చిన వారు తిరిగి నాదగ్గరికి వచ్చారు. ఇలా ప్రతివారం చేస్తూ ఉండడం ఎదో ఒకటి కలిసి రావడం జరుగుతుంది. అంటే! మనం ఇతరులకి మంచి చేస్తే, దానం చేస్తే వారికి కలిగిన ఆనందం వలన పంచభూతాలు తృప్తి చెంది మనల్ని ఒకస్థాయికి తీసుకువెళతాయి. మనం చేసే ఆలోచనలు, మనం చేసే పనులే మనల్ని పైకి లేపడం కానీ అధః పాతాళానికి తొక్కడం కానీ చేస్తాయి. అందరిని ఎదిరించినప్పుడు తండ్రిని దూషించనప్పుడు కలుగని ఆనందం అన్నదానం వస్త్ర దానం చేస్తున్నప్పుడు, అవి తీసుకున్నప్పుడు వారి కళ్ళల్లో చూసిన ఆనంద భాష్పాలు చూసినప్పుడు, వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం ఫలించినప్పుడు కలుగుతుంది. పైగా కష్టాలు సుఖాలు తెలియడంలేదు. ఆర్థిక బాధలు లేవు. ఇంటినిండా ఒకప్పుడు అశాంతి. ఇప్పుడు అంతా శాంతి. అని ముగించాడు. 

నిజమే! మనం ఏది చేస్తే అదే తిరిగి మనదగ్గరికి తిరిగి చేరుతుంది. ఒక మొక్క నాటండి. నీడనిస్తుంది. ఆక్సిజన్ ఇస్తుంది. సువాసన గల పూలు ఇస్తాయి. ఆకలి తీరుస్తుంది. వంట చెరుకుగా, ఇంటి గడపగా దేవుడి ప్రతిమగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఎదుటివాడి ఆకలి తీర్చండి. అది ఎదో ఒక సమయంలో మీకష్ట కాలంలో మీ ఆకలి తీరుస్తుంది. లేదా మీకు ఎదో ఒకరకంగా అది ఉపయోగపడుతుంది. 

ఒకరిని బాధించండి. ఖచ్చితంగా ఆబాధ మీరు అనుభవించే తీరతారు. కాలం కలిసి వస్తున్నప్పుడు మోసం చేస్తూ ఎదిగితే అలాంటి మోసం చేసే వాడి వలనే మీఎదుగుదల పతనం అవుతుంది. 

నెక్స్ట్ పోస్ట్ లో ఇంకా తెలుసుకుందాం. 


Post a Comment