Breaking News
Join This Site
శ్రీ కనక మహాలక్ష్మి సకల సౌభాగ్యదాయిని

శ్రీ కనక మహాలక్ష్మి సకల సౌభాగ్యదాయిని
సముద్ర మథనంలో ఆవిర్భవించిన శ్రీమహాలక్ష్మి సకల సౌభాగ్యదాయిని. లౌకిక జీవనంతో పాటు పారమార్థిక జీవనంలోనూ మానవ మనుగడకు సంబంధించి లక్ష్మీదేవిదే ప్రముఖపాత్ర. ఆదిలక్ష్మి మొదలు వీర, విజయ, సంతాన, ధాన్య, ఐశ్వర్య, ధన, రాజ్యలక్ష్మి- ఇలా ఎనిమిది రూపాల్లో ‘అష్ట లక్ష్మి’గా మహాలక్ష్మి పూజలందుకుంటోంది. ఉత్తరాంధ్ర జనుల కొంగుబంగారంగా విశాఖ నగరంలో వెలసిన తల్లి శ్రీ కనక మహాలక్ష్మి. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ స్థల పురాణం, చారిత్రక నేపథ్యం ఆసక్తికరంగా ఉంటాయి.

అనేక సంవత్సరాల క్రితం ఒక రోజున ఓ రాజు కాశీయాత్రకు బయల్దేరాడు. దారిలో ఒకచోట సాగర తీరం వద్ద మజిలీ చేశాడు. అద్భుతమైన ప్రకృతి వాతావరణం ఆయనను మైమరపించింది. అలాంటి సరోవర ప్రాంతంలో ఓ ఆలయం కడితే బాగుంటుందని భావించాడు. ఆ ప్రకారంగానే తన ఇష్టదైవమైన విశాఖేశ్వరుడి గుడి నిర్మాణం పూర్తిచేశాడు.

కాలక్రమంలో ఆ ఆలయం పక్కనే జనావాసం ఏర్పడింది. పల్లెగా మారి, ఆ తరవాత పట్టణంగా రూపుదిద్దుకొంది. అప్పటి నుంచి ఆ దైవం పేరు మీదనే ‘విశాఖపట్నం’గా పిలుస్తున్నారు. ఇదీ జనశ్రుతిలోని విశాఖపట్నం ఆవిర్భావ గాథ. ఈ స్థల పురాణం మహాభారత గాథనూ ప్రస్తావిస్తుంది.

అజ్ఞాతవాస సమయంలో విరటుడి కొలువుకు వెళ్లేముందు పాండవులు ఒక దేవతను ప్రార్థించారట. అనంతర కాలంలో, విశాఖ సాగర తీరంలోని యారాడ కొండ సమీపంలో దేవి విగ్రహాన్ని ధర్మరాజు ప్రతిష్ఠించాడు. ఆ దేవత పేరు తరవాతి కాలంలో ‘వైశాఖీశ్వరి’గా మారిందని చెబుతారు.

కళింగ దండయాత్ర అనంతరం అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కులోత్తుంగ చోళుడు ఆ విగ్రహాన్ని పునరుద్ధరించాడు. దక్షిణాత్య సంప్రదాయం అనుసరించి- గోపురం, ధ్వజస్తంభాలతో ఆయనే ఆలయం కట్టించాడంటారు. పరిణామ క్రమంలో ఆ ఆలయం అంతరించింది. తరవాత కొన్నాళ్లకు పట్టణం మధ్యలోని కోట బురుజు సమీపంలో అమ్మవారి విగ్రహం వెలసింది. ఆ ప్రాంతాన్ని ‘బురుజు పేట’ అని పిలుస్తారు.

1918లో అప్పటి జిల్లా కలెక్టర్‌ వెర్నస్‌- మార్గానికి అడ్డంగా ఉందన్న ఉద్దేశంతో దేవి విగ్రహాన్ని ఒక మూలగా పడవేయించాడట. ఆ తరవాత పలు కారణాల వల్ల విశాఖపట్నంలో భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాపించి, అనేకమంది మృత్యువాత పడ్డారని స్థానిక చరిత్ర చెబుతోంది. ప్రజల భక్తి విశ్వాసాలు గుర్తించిన అధికారులు, అమ్మవారికి గద్దె కట్టించి యథాస్థానంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి విశాఖ పరిసర ప్రాంతాల్లో ఆమె ఆరాధ్య దేవత అయింది.

ఒకనాటి వైశాఖీశ్వరిని భక్తజనులు ఇప్పుడు ‘కనక మహాలక్ష్మి’గా కొలుచుకుంటున్నారు. ఆమె శాంత స్వరూపిణి. పలువురు పీఠాధిపతులు, దైవజ్ఞులు, పండితులు అమ్మవారిని దర్శించుకున్నారు.

కనక మహాలక్ష్మి అమ్మవారు మార్గశిర మహాలక్ష్మి. ఈ మార్గశిరం నెల రోజులూ అమ్మవారికి ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. మార్గశిర లక్ష్మీవారం ఆమెకు ప్రీతిపాత్రమైన రోజు. ఈ మాసంలోని నాలుగు గురువారాలూ వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అసంఖ్యాకంగా విశాఖ నగరానికి చేరి, అమ్మవారిని దర్శించుకుంటారు. కనక మహాలక్ష్మిని దర్శించిన తరవాతే ఈ ప్రాంతవాసులు ఏ పనినైనా ప్రారంభిస్తారు. అది ఇక్కడి సంప్రదాయం!

Post a Comment