Breaking News
Join This Site
గరుడోపాఖ్యానం కొనసాగింపు (జగత్కారుడు మఱియు ఆస్తికుడి చరిత్ర) మహాభారతంలో నీతి కథలు.

గరుడోపాఖ్యానం కొనసాగింపు (జగత్కారుడు మఱియు ఆస్తికుడి చరిత్ర) మహాభారతంలో నీతి కథలు.

అతి గర్వం కలవారై నా తల్లియైన వినతకు అపకారం చేసిన కద్రువ కొడుకులు నాకు ఆహారం కావాలి. ఓ దివిజాధిపా!ఇంద్రా! నీచే రక్షింప బడుతున్న ఈ లోకాలలో పాములు తిరుగుతుండటం చేత నీకు తెలియజేయవలసి వచ్చింది; అని గరుడుడు పలికి ఇంద్రుడిచేత పాములు ఆహారం కాగల వరం పొంది ఆ ఇంద్రుడు అనుసరిస్తుండగా పాముల దగ్గరకు వచ్చి మరకత మణులవలె ఉన్న పచ్చని దర్భలపై అమృతభాండాన్ని పెట్టు పాములకు చూపి, దేవేంద్రుడి చేత రక్షిమ్పబడే అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. సూర్యుడు, గాలి(వాయువు), అగ్ని, చంద్రుడు అనేవారు సాక్షులుగా నా తల్లి యైన వినత దాస్యం పోయింది. అని చెప్పగా ఆ పాములు వెంటనే అమృతభాండాన్ని మిక్కిలి సంతోషంతో అనుకోబోగా గరుత్మంతుడు వారిని ఆపి స్నానం చేసిన పిమ్మట శుబ్రమైన వస్త్రములతో అలంకరించుకుని వచ్చి అమృతం త్రాగండని పంపి పక్షిరాజైన గరుత్మంతుడు తల్లిని తన వీపుపై ఎక్కించుకుని, అదృశ్యుడై ఉన్న ఇంద్రుని కడ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక ఇచ్చటి పాములు అమృతం త్రాగవలెనన్న ఉత్సాహంతో స్నానం చేసి రావడానికి మునుపే ఇంద్రుడు అమృతాన్ని గ్రహించి అమరావతి నగరమునకు పోయి అమృతాన్ని  యధాస్థానంలో పదిలపరచి స్థిరమైన రక్షణలో సమర్థుడై రక్షించుకుంటూ సుఖస్థితిలో ఉన్నాడు.  పిమ్మట ,పాములు అమృతం త్రాగడానికి వెళ్లి అక్కడ ఉన్న దర్భలపై అమృతభాండం లేకపోవడం చేత అమృతాన్ని త్రాగాలేకపోయామని వగచి అది ఉన్న స్థలమని దర్భలు నాకగా వాటి అంచులు పదునుగా ఉండటం వలన నాలుకలు రెండుగా చీలాయి. ఆనాటి నుండి పాములు ద్విజిహ్వాలు(రెండు నాలుకలు) కలవి అయ్యాయి. అమృతం తమపై ఉంచడం చేతదర్భలు కూడా పవిత్రాలు అయ్యాయి. 

ఫలశృతి: ఈ సౌపర్ణోపాఖ్యానం వినిన పుణ్యాత్ములకు అధికమైన సిరిసంపదలు కలుగుతాయి. పాపక్షయం అవుతుంది. పాముల నుండి, రాక్షసుల నుండి భయాలు పోతాయి. 


ఈవిధంగా పాములు అమృతాన్ని పొందలేక వెళ్ళిపోగా, ఆదిశేషుడు తనతల్లి, సోదరులు చేసిన ధర్మ విరుద్ధమైన కార్యానికి అసహ్యపడి దుఃఖించి , వారిని వీడి గంధమాదన పర్వతం, బదరీవనం, గోకర్ణ క్షేత్రం, పుష్కరారణ్యం, హిమాచలం మొదలైన పుణ్యక్షేత్రాలలో పెక్కువేల ఏండ్లు నియమంతో కూడిన తప్పసును చేయగా బ్రహ్మ కనుల ఎదుట ప్రత్యక్షమై వరం వేడుకొమ్మని పలుకగా ఆదిశేషుడు ఇట్లా అన్నాడు. ఓ బ్రహ్మదేవా! నాతల్లి యైన కద్రువ, నా తోడ జన్మించిన సోదరులు మూర్ఖులై ధర్మాన్ని, యుక్తాన్ని వీడి నా సవతి తల్లియైన వినతకు, ఆమె కుమారుడైన గరుడుడికి కీడు చేశారు. వీరు ఓర్వలేక ఎప్పుడు ఇట్లే ఇతరులకు హాని చేస్తూ ఉంటారు. నాకు వాళ్ళంటే అసహ్యం, వారితో ఉండటానికి నాకు ఇష్టం లేదు,తపస్సు చేస్తూ ఈ దేహాన్ని విడుస్తాను. అని పలుకగా, బ్రహ్మ అతడి ధర్మబుద్దికి మెచ్చి, ''నీవు ఎల్లప్పుడూ సత్యం పట్ల, ధర్మం పట్ల ఆశక్తి కలిగినవాడివి. సర్వం భరించే ధైర్యంతో కూడినవాడివి.ఇది ఇతరులకు శఖ్యం కాదు. ఈ భూమి యొక్క బరువును నిష్ఠతో భరించాలి. ఓ భుజంగమేశ్వరా! వినత కుమారుడైన గరుత్మంతుడు బహు పరాక్రమవంతుడు. కశ్యపుడు, వాలఖిల్యులు మొదలైన గొప్ప మునుల వరం పొందిన పక్షి శ్రేష్టుడు, ఇంద్రుడిని ఓడించి సజ్జనులచే స్తుతింపబడిన గొప్ప బలశాలి. కనుక తెలివితో ఆ గరునునితో స్థిరంగా స్నేహం చెయుము. అతనితో స్నేహం చేయడం నీ కర్తవ్యం. అని బ్రహ్మ ఆజ్ఞాపించగా భూమి యొక్క సమస్త భారాన్ని వహించి గరుత్మంతునితో స్నేహం గలవాడై ఉన్నాడు. ఇచట వాసుకి అనే సర్ప శ్రేష్టుడు కద్రువ యొక్క శాపం చేత జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో కాగల పాముల సముదాయం యొక్క వినాశనానికి భయపడి తన చుట్టాలను, ఐరావతాది సహోదరులను రావించి విషణ్ణ హృదయుడై ఇట్లన్నాడు. 


శేషుడు చిరకాలం తపస్సు చేసి అనంత ధరణిని మ్రోసే కార్యాయుక్తుడై సర్పశ్రేష్ఠుల స్నేహం వీడి తనంతట తానుగా వేరుగా ఉండి సర్పయజ్ఞం లో జరగబోయే భరింప సఖ్యం కాని పాములకు వినాశనం గురించి తలచి ఏమి ఆలోచన చేయడు.

ఇంకా అమృతం కొరకు సముద్రం త్రాచ్చేటప్పుడు కవ్వమైన మంథపర్వతానికి తరిత్రాడుగా అయిన నాకష్టానికి దేవతలందరూ మెచ్చి బ్రహ్మను వేడి దివ్యత్వమును, సకలభయ విమోక్షణము కలిగేలా వరం అనుగ్రహింపజేశారు. నాకు ప్రాణానికి భయంలేకపోయినా తల్లి యైన కద్రువ శాపం చేత సర్పవినాశనం కలుగుతుండటం చేత మనస్సులో భరింపరాని దుఃఖం కలుగుతుంది. సర్పయాగం గండం నుండి రక్షించగలిగే ఉపాయం ఏమైనా ఉందా? ఎం చేద్దాం? అని దుఃఖిస్తున్న సర్పరాజైన వాసుకితో యువకులైన నాగులు కొన్ని మిక్కిలి గర్వించిన అహంకారంతో కూడి ఇలా అన్నారు. జనమేజయుడు చేసే సర్పయగానికి ఆటంకం కలిగిద్దాం. ఎలాంటే జనమేజయుడు ధర్మాన్ని కోరేవాడు కనుక మనం బ్రాహ్మణుల వేషం దాల్చి ఈ యజ్ఞం చేయవద్దని అడుగుదాం. మనలో కొందరు ఆ జనమేజయుడికి ఇష్టమైన మంత్రులమై ఈ యాగాన్ని చేస్తే ఇహపర సౌఖ్యాలకు విఘాతం కలుగుతుందని కారణాలు చూపి యజ్ఞం ఆపేల చేద్దాం. అందరం ఒకే లక్ష్యంతో భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, పానీయాలు అనే నాలుగు విధాలైన ఆహారలను పాడుచేసి,  సభలోని బ్రాహ్మణులను మన శక్తితో భయకంపితులను చేసి ఆటంకాలు సృష్టిద్దాం. ఋత్విక్కులు మొదలైన పండిత శ్రేష్ఠులంతా యాగశాలను వీడి పారిపోయే విధంగా చేద్దాం అని పలుకగా నాగులలోని కొందరు శ్రేష్ఠులు ఈ విధంగా పలికారు.

మీరు చెప్పినవన్నీ చేయడానికి వీలౌతుందని తలపోయకండి. బ్రాహ్మణలు అగ్ని వ్రేల్చేటప్పుడు పఠించే మంత్రాలవలన పుట్టే భయంకరమైన అగ్నిజ్వాలలు వ్యాపిస్తే ఏమైనా చేయడానికి సాధ్యమౌతుందా? అందులోపడి శలభాల వలే నశిస్తారు. అని అనగా విని వాసుకి తమ్ముడైన ఎలాపుత్రుడు (కద్రువకి జన్మించిన నాగులలో ఏలా ఒకడు. ఆ ఏలా కి జన్మించినవాడు కనుక ఏలా పుత్రుడు అన్నారు. పేరు చెప్పలేదు) ఇలా అన్నాడు. కద్రువ పాములకి శాపం ఇచ్చే దినాన ఆమె ఒడిలో నిద్రిస్తున్నాను. కాని బ్రహ్మకు, దేవత శ్రేష్టులకు జరిగిన సంభాషణలు కొంచెం లీలగా వినబడ్డాయి. ఆ సంభాషణలు మీకు వివరంగా చెప్తాను వినండి. కద్రువ పాములకు శాపం ఇచ్చిన వెంటనే దేవతలందరూ బ్రహ్మతో "అయ్యా!మిక్కిలి కఠినాత్మురాలై అపారమైన బలపరాక్రమాలు ఉన్న ఇట్లాంటి కొడుకులను పొంది కూడా వారికి వినత మీద అసూయతో వేసిన పందెం వలన ఓటమి భయంతో అకారణంగా శాపం ఇచ్చింది. దానిని మీరుకూడా నివారించక ఊరుకున్నారు. ఈ శాపానికి మారుసేత(తొలగించే ఉపాయం) ఏమైనా ఉందా?" యని అడుగగా బ్రహ్మ వారితో ఇలా చెప్పాడు. 

క్రూరాకారులు, జగానికి కీడు నొనర్చె వారు అయిన పాములను మోయజాలని ఈ భూమికి మేలు కలగాడానికై దుర్మార్గులైన నాగుల వినాశనానికి అంగీకరింపవలసి వచ్చింది. మరియు సకల లోకహితం కోరి ప్రఖ్యాతులైన ముఖ్యులైన, లోకాలకు మేలు చేసే వారందరిని , వాసుకి చెల్లెలైన జగత్కారువునకు, జగత్కారు అనే గొప్ప మునికి జనించేవాడు, అధిక తేజస్వి యైన ఆస్తీకుడు అనే మహాముని జనమేజయుడు చేసే సర్పయాగప్రళయం నుండి రక్షిస్తాడని బ్రహ్మ దేవతలకు చెప్పిన విధాన్ని తెలుపగా నాగ శ్రేష్ఠులు సంతోషించి ఏలా అనే నాగాకుమారుని పుత్రుని ఎత్తుకొని మృదువచనములతో అభినందించారు. వాసుకి ఆనాటి నుండి జగత్కారుడు ఎప్పుడు తనచేల్లెలిని భార్యగా పరిగ్రహిస్తాడో అని ఆసమయం కోసం కాంక్షిస్తూ ఉండగా... అతి కఠినమైన పూజది వ్రతాలు చేస్తూ భార్యాపరిగ్రహం ఆజగాత్కారుడు ఇష్టపడక సంసారంలో మళ్లి జన్మ కలుగుతుందనే భయంతో, అంతులేని అధిక వ్యమోహమనే త్రాళ్ళ బంధం నుండి విముక్తుడై తపస్సు, వేదాలు చదవడం, బ్రహ్మచర్యవ్రతం అనే వాటి చేత ఋషుల యొక్క ఋణాన్ని తొలగిస్తూ తిరిగే జగత్కారుడు అడవిలో ఒక జలపాతం దగ్గర ఎలుకలచే కోరకబడి ఒక్కవేరు మాత్రమే మిగిలియున్న ఔరుగడ్డి దుబ్బను పట్టుకుని తలక్రిందులుగా ఆదిత్య కిరణములే ఆహారంగా వ్రేలాడుతున్న కొందరు ఋషులను చూచి వారిని సమీపించి, తలక్రిందులుగా వ్రేలాడటం కడు భయంకరం, ఇట్లా చేయడం ఏదైనా తపో విశేషమా? నాకును తెలియజేస్తే నేను కూడా చేయబూనుతాను. అని జగత్కారుడు వారితో పలుకగా తలక్రిందులుగా వ్రేలాడే ఆ మునులు ఇలా అన్నారు. 

ఓ పాపరహితుడా!  తపస్సు? మేము సాటిలేని చింతాకు గురయిన వాళ్ళ మగుటచేత మా తరువాత సంతానం లేకున్న కారణంగా ఆధారం లేక అథమ లోకంలో పడిపోవడం కొరకు ఇలా వ్రేలాడుతున్నాము. మందభాగ్యులమైన మా వంశమున జగత్కరుడనే పాపాత్ముడు జన్మించి వివాహం చేసుకోవడానికి అంగీకరింపక సంతానహీనుడు అయ్యాడు. మేము అతని పితృ మహామహులం(తండ్రి తాతలం). మేము పట్టుకుని వ్రేళ్ళాడుతున్న ఔరుగడ్డి దుబ్బు వేర్లను అన్నింటిని యముడు ఎలుకల మిషతో క్రమంగా కోరికించి వేయగా ఒక్క వేరుమాత్రం మిగిలి ఉంది. జగత్కారుడు వివాహమాడి ధర్మబద్దంగా సంతానం పొందకపోతే ఆవేరు కూడా తెగిపోతుంది,. అప్పుడు మేము అధోలోకాల పాలౌతాం. అతడుసంతానం పొందితే పైలోకాలకు వెళతాం. 

నీవు ఎవరో మాకు బంధువులు వాలే ప్రీతితో ఏకాగ్రచిత్తుడవై మా మాటలువిని మన్నించావు. ఆ జగత్కారును నీవు ఎరుగుదువేని మేము పొన్దీఎ దురవస్థ వానికి తెలియజెప్పుమని పితృదేవతలు పలుకగా జగత్కారుడు అతి కారుణ్యచిత్తుడై (కరుణ గలిగిన హృదయం కలవాడై) సంతానం కొరకు పెండ్లి చేసుకోవాలని చాలాసేపు అలోచించి, మీరు నా పితృదేవతలు. నేనే మీకుమారుడను జగత్కారుడను. మీరు నాకు పూజించదగిన వారు. ఇంతకుముందు పెండ్లి చేసుకోవాలనే ఆలోచన నా మదిన కలుగలేదు. మీ దురావస్థ చూచి మీకు మేలు ఎలా కలుగుతుందో అట్లే సంతోషంతో ధర్మంతో కూడిన వివాహం చేసుకుని ప్రవర్తించాలని నామనస్సు కి కలిగిందని చెప్పగా పితృదేవతలు సంతోషించి,

యోగ్యులైన కొడుకులను పొంది ధర్మమార్గం చెడకుండా సజ్జనులు పొగిడేటట్లు జీవించి మహాత్ములు పొందే ఉత్తమ లోకాలను మిక్కిలి ఘోర నిష్ఠతో తపస్సు చేసినప్పటికీ అధిక దక్షిణలు ఇచ్చి యజ్ఞాలు చేసినప్పటికీ సంతానహీనులైన దుర్జనులు పొందజాలరు.

కాబట్టి నీవు భార్యను గ్రహించి ధర్మమర్గంలో సంతానాన్ని పొంది మమ్మల్ని ఉన్నతలోకాలకు వెళ్ళేవారిగా చేయుమని పితృ దేవతలు పలుకగా జగత్కారుడు అట్లయితే నాతో సమానమైన పేరు కలిగిన కన్యను పెండ్లాడాలి అని వారికి నమస్కరించి వారి వద్ద సెలవు తీసుకుని కన్యాన్వేషణ కోసం భూవలయం అంతటా పరిబ్రమిస్తూండగా.

ఎల్లప్పుడూ వ్రతాలు చేయడం వలన కృశించి బక్కచిక్కిపోతున్న శరీరంలో సాదులు బయటపడగా ముదిమివలన తల వనుకుచుండగా, శ్రేష్ఠులైన తాతలతండ్రులను గొప్పగా ఉన్నతలోకాలకు పంపబూని వివాహమాడటానికి జగత్కారుడు తనకోర్కేకు అనురూపయైన కన్యను మర్త్యమున (భూమండలమున)చూడలేకపోయాడు.  విధంగా జగత్కారుడు పితృదేవతల మేలు కోరి వివాహంమీద కోరికతో ఎదురుచూస్తుండగా, వాసుకి కూడా తన సేవకులవలన విషయాన్ని గ్రహించి తన తోబుట్టువైన జగత్కారువు ని వెంటతీసుకుని అతనిచెంతకు వెళ్లి భూసురోత్తమా! జగత్కారుమహర్షీ! మీవంశం పుణ్యమైంది. మావంశం ధన్యమైంది. మాచెల్లెలికి ఒండోరులకు తగిన గుణముల చేత, పెర్లచేత చిత్తనందము కలిగింది.  చెల్లెలైన జగత్కారునకు వివహార్థమై కన్యారూపమయిన  భిక్షను పరిగ్రహింపుమని వాసుకి పలుకగా తనతో సమానమైన పేరుకలదవడం చేత ఆకన్యను పెండ్లాడి మొదటి కూడికలోనే తన భార్యకు ''నాకు నీవెప్పుడు అగౌరవం తలపోస్తావో ఆరోజునే నిన్ను వీడిపోయెదను'' అని నియమం విధించాడు. ఆనాటి నుండి జగత్కారు కత్తిపై నడకవలె భయంతో నియమంతో, భక్తితో తన భర్తకు రాత్రింబవళ్ళు నియమం తప్పకుండా శ్రద్ధతో  చేస్తూ ఉంది. ఎడతెగని భక్తితో తనభర్తకు మిక్కిలి ప్రీతి నొనరించి అనురాగంతో కూడినదై గర్భం ధరించి సూర్యుడు గర్భంలో ఉన్న తూర్పుదిక్కు అనే కాంతివలె ప్రకాశించింది. ఆకోమలి ఒకనాడు తనతోడనే తలగడగా కృష్ణమృగ చర్మపు పక్కపు తనభర్త నిద్రిస్తున్న సమయంలో, ఆదిత్యుడు అస్తగిరి శిఖరం చేరగా (అస్తమించడానికి సిద్ధంగా ఉండగా)ఆ ఆశ్రమంలో నివసించే ఋషులు సంధ్యాసమయోచిత క్రియలు చేస్తుండగా చూచి తనలో సంధ్యాసమయ కాలాలలో చేయవలసిన సత్కర్మలు లోపిస్తే ధర్మభంగం కలుగుతుంది. ఆలస్యం చేయక నన్ను ఎందుకు మేల్కొలపలేదని జగత్కారుడు కోపిస్తాడో? ఒకవేళ మేల్కొలిపితే నాకు ఈవిధంగా నిద్రకు హనికల్పించడం తగునా?అని కోపిస్తాడో?మేల్కొలిపినందుకు కోపిస్తే కోపాన్ని భరిస్తాను గాని, ధర్మహాని హృదయంలో నైనా సైపదగునాఅని నిశ్చయించుకుని తన భర్తను మేల్కొలిపింది. జగత్కారుడు నిద్రనుండి మేల్కొని కోపించి ''నీవు ఎందుకు నిద్రాభంగం చేశావు?'' అని అడుగగా జగత్కారువు భయపడి అనఘా! సూర్యుడు అస్తమించడానికి సిద్దంగా ఉండగా, ధర్మకార్యాచారణానికి లోపం కలుగుతుందని మేల్కోలపవలసి వచ్చిందని అమె తెలుపగా, జగత్కారుడు,  నేను మేల్కొనేంతవరకు అస్తమించకుండా ఉండక సూర్యుడు పడమటి కొండకు వెళ్ళడానికి భయపడడా! చెప్పుము. నీవు నన్ను నిద్రనుండి లేపడం ద్వారా నాకు అవమానం తలపోశావు. అందుచేత నీచెంత ఉండడానికి ఇక అంగీకరించను. నేను ఆనాడే ఎన్నడైనా నీవు నాకవమానం తలపోస్తే నాడే నిన్ను విడిచి వెళ్ళిపోతానని ముందే శపదం చేశాను. నీ కడుపున ఉన్న కుమారుడు సూర్యుడుతోను, అగ్నితోనూ సమానమైన కాంతి కలవాడు. మన ఇరువురి కులాల యొక్క దుఃఖాన్ని తొలగించడానికి తగిన శక్తి కలవాడు సుమా! నీవు విచారింపక నీ అన్న చెంత ఉండుము. అని జగత్కారువును ఓదార్చి తపస్సు చేసుకొనడానికి అడవికి వెళ్ళిపోయాడు. జగత్కారువు వాసుకి అయిన తన అన్నచెంతకు వచ్చి విషయమంతా తెలుపి అన్నచెంతనే ఉండిపోయింది. 

కొన్నిరోజుల తరువాత అపూర్ణ తెజోమయుడుం పాపంలేనివాడు, తిరస్కరింపబడిన సంసారబంధం కలవాడు, తల్లిదండ్రుల ఉభయ పక్షాలకు చెందినవారి భయాన్ని పోగొట్టేవాడు అయిన ఆస్తీకుడు దివ్యతేజస్సుతో పుట్టి పెరిగాడు. ఆస్తీకుడు ప్రజలందరూ పరమ సాత్వికుడని పోగిడేట్లుగా చ్యవన కుమారుడైన ప్రమతి వద్ద సకలవేదాలను, వేదంగాలను అధ్యయనం చేశాడు. నిర్మలమైన బుద్దితో అన్నిశాస్త్రాలను తెలుసుకొన్నాడు. (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అను నాలుగు వేదాలు, శిక్ష,వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే ఆరు ఉపవేదాంగాలు.)

మరికొన్నిఇక్కడ చదవండి.

Post a Comment