Breaking News
Join This Site
ధనబలం - బుద్ధిబలం (నీతికథలు)

ధనబలం - బుద్ధిబలం (నీతికథలు)

        నరసింహాపురం అనే గ్రామంలో రామయ్య,  సోమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారిలో రామయ్య మంచి ఆస్తిపరుడు మరియు ఆఊరికి పెద్ద. సోమయ్య ఏ పనినైన తగు ప్రతిఫలం తీసుకొని చేసేవాడు.  ఆఊరికి సంబంధించిన కార్యక్రమాలను కూడా అదేవిదంగా చేస్తూ  ఉంటాడు. రామయ్య ఎప్పుడూ ఆ గ్రామ ప్రజల క్షేమం ముఖ్యం అనుకునే వ్యక్తి. డబ్బుని పదవిని  లెక్కచేసేవాడు కాదు. ఊరికోసం, ప్రజలకోసం చాలావరకు ఆస్తులని పోగొట్టుకున్నాడు. సోమయ్య మాత్రం చెడ్డవాడు కాకపోయినా డబ్బే గొప్పది అంటాడు. డబ్బుకోసం కొన్ని  అక్రమాలు చేస్తూ కొంత ఆస్తులు కూడబెట్టాడు.సోమయ్య ప్రవర్తనలో తేడా  గమనించిన రామయ్య  సోమయ్యకు దూరంగా ఉండసాగాడు. కానీ సోమయ్య తన ఎదుగుదల చూసి ఓర్వ లేకే రామయ్య దూరంగా ఉంటున్నాడని రామయ్య పైన ఈర్ష్య పెంచుకున్నాడు.   ఇలా ఉండగా ఊరి పెద్దని ఎన్నుకునే సమయం వచ్చింది. సోమయ్య రామయ్య పైన ఈర్ష్యతో  ఈసారి గ్రామపెద్దగా  నెగ్గాలని  పోటిలోనిలబడి   డబ్బు వెదజల్లి ప్రచారం చేయసాగాడు. ఇది గమనించిన రామయ్య ఇటువంటివాడు గ్రామపెద్ద అయితే  గ్రామానికి, ప్రజలకి ఇబ్బందులు తప్పవని  తానుకూడా పోటిలో నిలబడ్డాడు. 

కానీ ప్రజలు ఊరికోసం జీవితాన్ని, ఆస్తుల్ని త్యాగం చేసిన రామయ్యని కాదని డబ్బు ఆశతో  ఈసారి సోమయ్యని  ఆ ఊరి పెద్దగా ఎంపిక చేసుకున్నారు. రామయ్య ఇవేమీ పట్టించుకోకుండా తన మిత్రుడే కదా అని శుభాకాంక్షలు తెలిపి ప్రజలకు ఇబ్బంది కలగకుండా  చూసుకోమని  చెప్పి వెళ్ళిపోయాడు.ఇలా ఒక ఏడాది గడిచింది. ఆదాయం లెక్కలు వేసి పన్ను రూపంలో మరికొంత వసూలు చేసి ఆదాయం పెంచాలి అని సోమయ్య ఆదేశించడంతో రామయ్య గ్రామానికి మంచిదికాదు అని వారించాడు. అయినా వినకుండా పన్నులు ఇష్టంవచ్చినట్లు విధించి ప్రజలను పీడించడం మొదలుపెట్టాడు. ఇటు పన్నులు, అటు పంటలు సరిగ్గా పండక ఆ ఏడు రైతులు,  ప్రజలు పన్నులు కాదుకదా తమజీవనానికే ఇబ్బంది పడసాగారు.  . దీంతో అసలు ఆదాయనికే గండి పడింది. రైతులు కరువుకోరల్లో చిక్కుకుపోయారు. 
సోమయ్య గ్రామపెద్ద కనుక వచ్చిన ఆదాయాన్ని దిగమింగేశాడు.  తన సౌకర్యాలు మాత్రం పెంచుకున్నాడు. గ్రామా ఆదాయం, గుడి ఆదాయం, ఇది అది అని తేడాలేదు. దొరికిన దంతా దోచేసుకోవడమే తప్ప ప్రజలని పట్టించుకున్న పాపానపోలేదు. 

కరువు వల్ల, అప్పుల వల్ల రైతులు తమపిల్లల్ని పట్టణాలకి పంపించేశారు. కొందరు ఊరు వదిలేశారు. ఇంతకుముందు రామయ్యగ్రామా పెద్దగా  ఉన్నప్పుడు ప్రతి పండుగకి కళకళలాడే ఊరు కాస్త సంక్రాంతి పండుగకి సైతం వెలవెలబోయింది. ఇదంతా చూసి రామయ్య తల్లడిల్లిపోయాడు. ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడిన నాగ్రామం, నాప్రజలు సర్వనాశనం అయిపోతున్నాయే అని సోమయ్య దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాడు. అయినా సోమయ్య లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా మాట్లాడి గెంటేయబోయాడు. 

సోమయ్యా! రాజు మంచివాడైతేనే రైతు బావుంటాడు. సామాన్యుడు బ్రతకగలుగుతాడు. కులవృత్తులు అభివృద్ధి చెందుతాయి. యువత బావుంటారు. ఊరు బాగుపడుతుంది. తద్వారా దేశ ప్రగతి అభివృద్ధి చెందుతుంది. రాజే నీచ్యుడైతే ప్రజలు కష్టాలపాలౌతారు. వర్ణాశ్రమ ధర్మాలు దెబ్బతింటాయి. సంకరజాతులు పెరుగుతాయి. విలువలు నశిస్తాయి. రాజనేవాడు ఎప్పుడూ తన క్షేమం కంటే ప్రజల క్షేమమే వారధిగా బ్రతకాలి. వర్ణాలను రక్షించాలి, ఆశ్రమ ధర్మాలను నిలబెట్టాలి. ఎప్పటికప్పుడు యోగక్షేమాలు తెలుసుకోవాలి, కష్టాల్లో ఉన్న ప్రజలను కాపాడాలి, తాము పొందవలసిన ఆదాయం పొందలేక శుష్కించుకు పోయే ప్రజల దారిద్ర్య దుఃఖాలు ప్రభువుకు హాని కలిగిస్తాయి. ఉదార బుద్దితో పేదరైతుకు ధాన్యం ఉచితంగాను, వ్యాపారులకు ఋణం మీద వడ్డీతోనూ ఇవ్వాలి. ఒక వ్యక్తి చేసిన మేలును పదిమందిలో పొగడాలి, ప్రభుత్వ ఖజానాలో అవసరాన్ని బట్టి  నాల్గవభాగం, మూడవ భాగం, అర్థ భాగాన్ని ఖర్చుచేయాలి. అంతకు మించి ఖర్చు చేయడం వలన ప్రభావం వ్యవస్థమీద పడుతుంది. గ్రుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని, ఇతర వికలాంగులను దయతో ఆదరించాలి. నీరక్షణలో ఉన్న గ్రామానికి ఎల్లవేళలా ధనం, ధాన్యం, పశువుల మేత, త్రాగడానికి నీరు, పంట చెరుకు, ఉప్పు, కారం, ఆహార పదార్థాలు, యంత్ర సామాగ్రి సమృద్ధిగా ఉండాలి. అనావృష్టి రాకుండా చెరువులను ఎప్పటికప్పుడు తవ్వించి నీటిని నిల్వ ఉంచాలి. రైతు వద్ద శిస్తు రైతు యొక్క సంపదను బట్టి 35% నుండి 7% వరకు విధించాలి. అధిక ఆదాయం పొందుతున్న వారిమీద 35% పన్ను తప్పకుండ వసూలు చేయాలి. రాజుకంటే ప్రజలు ఎప్పుడూ ఎత్తైన భవనాలు నిర్మించకుండా చూసుకోవాలి. లేదంటే ప్రజలలో రాజు చులకన అవుతాడు. దేవాలయాలను అభివృద్ధి పరచాలి, యజ్ఞయాగాది కార్యక్రమాలు జరిపించి దేశ సౌభాగ్యాన్ని కాపాడుకోవాలి, దైవబలం మెండుగా ఉండాలి. 


 నాస్తికత, అసత్యాలు ఆడేవారు, ఆడంబరాలకు పోయేవారు, ఏమరపాటు, అలసత్వం, తెలివితక్కువతనం, క్రోధం, దీర్ఘ చింతన, దీర్ఘాలోచన, ఆలస్యం చేయడం, జ్ఞానులను గుర్తించకపోవడం, అర్ధవంతమైన విషయాలలో అనర్థమైన ఆలోచనలు చేయడం, నిర్ణయించిన పనులు చేయకపోవడం, రహస్యాలను బట్టబయలు చేయడం, శుభాకార్యలను చేయకపోవడం, ఇంద్రియ సుఖాలకు తగులుకోవడం వంటి గుణములు ఉన్నవారిని పరిహరించాలి. ఇలాంటివారిని పక్కన పెట్టుకోకూడదు. మహాత్ముల చరిత్రలను బుద్ధినిలిపి ఎప్పటికప్పుడు ఉపదేశం పొందాలి. ధనలోభం ఉన్నవారిని, దొంగలను, బంధువులను, స్నేహానికి తగనివారిని, పనికిమాలినవారిని, శత్రువులపట్ల పక్షపాతం కలవారిని, పిరికివారిని రాచకార్యాలలో నియమించకూడదు. నైపుణ్యం ఉన్నవారిని, నీతిమంతులను, పరిశీలించి వారికి ఉత్తమ, మధ్యమ, అధమ ఉద్యోగాలలో నియమించాలి, ధర్మాధర్మ విచక్షణ లేకుండా మనస్సుపడ్డ వాటిని అనుభవించడం కాదు. నిరుపయోగంగా కూడబెట్టడం కాదు, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే మంచి శీలాన్ని, నడవడికను అలవరచుకోవాలి. అర్హులైనవారికి దానం చేయాలి, ధర్మబద్ధమైన భోగాలు అనుభవించాలి. ఇవి రాజు చేయవలసిన పనులు అని చెప్పి వెళ్ళిపోయాడు. 


ఆమాటలు విన్న సోమయ్య విస్మయం చెంది ఇన్నాళ్ళు తాను చేసిన నీచ్యమైన పనులకు భాదపడ్డాడు. ఆమరుసటి రోజు ఉదయం సోమయ్య కొడుకు సూరి తన తండ్రి సంపాదించిన అక్రమ సంపద వలన విచ్చలవిడి అలవాట్లకు బానిసై ప్రమాదంలో మరణించాడు. కొడుకు మీద బెంగతో సోమయ్య అనారోగ్యం పాలై మంచం పట్టాడు. అప్పటివరకు సవ్యంగా సాగుతున్న కూతురి సంసారం విచ్చిన్నమై పుట్టింటికి వచ్చేసింది. ఇదంతా తాను ప్రజలకు చేసిన అపకారం వలన జరిగిందని చింతించి సోమయ్య తన పదవిని రామయ్యకి ఇచ్చి నిష్క్రమించాడు. 

మరలా రామయ్య పదవిని అధిష్టించి ఊరి అభివృద్ధి కోసం కార్యక్రమాలు ప్రారంభించాడు. ఊరిలో ఉన్న పెద్దలను పిలిచి మంతనాలు జరిపి, ఖజానా ఖాళిగా ఉండడం గమనించి తనకు మిగిలి ఉన్న ఆస్థిలో 1000 ఎకరాలలో 900 ఎకరాలు అమ్మి, రైతులకు, వ్యవసాయ కూలీలకు, ఇతర కులవృత్తులు చేసేవారికి అందజేసి తగిన ఏర్పాట్లు చచేశాడు. అన్నీ సమయానుకూలంగా జరగడంతో పంటలు పండి, ఆదాయ వనరులు పెరిగి గ్రామం సస్యస్యామలం అయింది. వెళ్ళినపోయిన కుటుంబాలవారు తిరిగి వచ్చారు. యువత తమతమ వృత్తులలో నిలబడ్డారు. ప్రజలందరూ ఇంతకుముందు కంటే ఉత్సాహంగా పండుగలు, పర్వదినాలు జరుపుకున్నారు. ఈవిధంగా రామయ్య  తన గ్రామాన్ని మిగిలిన గ్రామాలకంటే మిన్నగా, ఆదర్శంగా తీర్చిదిద్దాడు.

 సోమయ్య తాను చేసిన ఆకృత్యాల కారణంగా శిదిలమైపోయాడు. కొన్నాళ్ళకు పశ్చ్యతాపం పొందడం వలన ఆరోగ్యం కుదుటపడి రామయ్యకి చేదోడుగా నిలబడి  గ్రామాన్ని అభివృద్ధి పరిచారు. ధనబలం అన్ని వేళల్లో పనికిరాదు. బుద్ధిబలం ఔదార్యం మాత్రమే ప్రజలను, దేశాన్ని రక్షిస్తుంది. రాజు మంచివాడైతే దేశం సుభిక్షంగా ఉంటుందని నిరూపించాడు. 

Post a Comment