Breaking News
Join This Site
రాజు - సాధువు (ఓ నీతి కథ)

రాజు - సాధువు (ఓ నీతి కథ)

అనగనగా దైవభక్తి మెండుగా గల ఒక మహారాజు గారికి, ఒకనాడు తన రాజ్యంలో వున్న ప్రజలకు, దైవభక్తి ఏ స్థాయిలో వున్నదో? తెలుసుకోవాలనే కోరిక కలిగిందట. వెంటనే మంత్రిని పిలిచి, తనకో మూడు సందేహాలున్నాయని, తన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారికి మంచి బహుమానం కూడా ప్రకటించమని ఆదేశిస్తారు.

వెంటనే మంత్రి గారు, రాజు గారి ప్రశ్నలను తెలుసుకుని, ఇలా ప్రశ్నలను నేరుగా అడిగితే, ప్రతి ఒక్కరూ మేము మేమంటూ, తమకు తోచిన సమాధానం చెప్పే అవకాశం వుంటుంది కాబట్టి, ఇలా కాదని చెప్పి, మంత్రిగారు చక్కని ఉపాయం పన్ని, తెలివిగా...

1. దేవుడు అనేవాడు అసలు వున్నాడా?
2. దేవుడు ఎటు చూస్తాడు' ?
 3. ఇంతకూ ఆయన ఏం చేస్తుంటాడు?

అని ఈ మూడు ప్రశ్నలను చాటింపు వేయించి, సరియైన సమాధానం చెప్పని వారికి కఠినమైన దండన కూడా వుంటుందని మెలిక పెడతారు ఆ మంత్రవర్యులు. ఈ దండోరా వలన 'రాజుగారి ౩ ప్రశ్నలు - గెలిస్తే రాజ్యం, ఓడితే ప్రాణం'  విషయం ఆ రాజ్యంలోని పిన్నలు, పెద్దలు, పండితులు, భక్తులు, సన్యాసులు, పీఠాధిపతులు అందరికీ చేరింది కానీ, శిక్షకు భయపడి ఎవరూ కూడా, రాజుగారి వద్దకు వచ్చి సమాధానం చెప్పడానికి సాహసం చేయలేకపోయారు. చివరికి ఒక సాధువు మాత్రం అన్నింటికీ తెగించి, తాను రాజుగారి ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం ఇవ్వగలనని, ఒక వేళ తన సమాధానాలు సంతృప్తిని ఇవ్వకపోతే, తాను శిక్షను అనుభవించేందుకు సైతం సిద్ధమని అంటూ ముందుకు వచ్చాడు.

అంతా సమావేశమయ్యారు. రాజుగారు ఆ సాధువును ఒక మారు తీక్షణంగా చూడసాగారు. అప్పుడు సాధువు ఇలా అన్నారు, 'దైవీ విషయం' పై చర్చిస్తున్నాం కనుక దీపారాధన నిమిత్తం సామాగ్రిని, నైవేద్యం కొరకు పాలు కావాలని కోరుతాడు. మంత్రి వర్యులు అక్కడున్న సిబ్బందితో వెంటనే సాధువు కోరిన వస్తువులు సమకూర్చుతారు. అన్నీ సిద్ధం అయ్యాక రాజుగారు ఆ సాధువుతో, మరి ఇక నా సందేహాలను నివృత్తి చేయగలరని కోరుతాడు. వెంటనే ఆ సాధువు ఇలా అంటారు, 'అడిగే స్థితిలో నువ్వు వున్నావు, నీవు అడిగిన వాటికి బదులు చెప్పే స్థితిలో నేను వున్నాను, అంచేత నేను ఉన్నత ఆసనం మీద కూర్చోవటం ధర్మం. నీవు శిష్యస్థానంలో వున్నావు కనుక క్రింద కూర్చుంటే మంచిది అని సెలవిస్తాడు.

రాజుగారు క్షణకాలం కూడా ఆలోచించకుండా, సాధువు ఆంతర్యం గ్రహించి, సాధువుకి తన రాజాసనం ఇచ్చి, తాను అతని పాదాల వద్ద కూర్చుంటాడు. సింహాసనం మీద కూర్చున్న సాధువు, రాజును ప్రశ్నించ మని అడుగుతాడు. 
రాజు తన మొదటి ప్రశ్నగా ‘దేవుడున్నాడా’వుంటే ఎలా వున్నాడు? అని అడుగుతాడు.

అపుడా సాధువు ప్రక్కనే చెంబులో వున్న పాలను చూపించి, ఈ పాలలో వెన్న ఉన్నదా?’అని ఎదురు ప్రశ్న వేస్తాడు. రాజుగారు వెంటనే ఆ పాలల్లో వెన్నవున్నది మహాశయా, అని బదులు చెబుతాడు. అయితే చూపించు? అని అడుగుతాడు ఆ సాధువు. అప్పుడు రాజుగారు అయ్యా! 'ఈ పాలను తోడు వేసి, పెరుగుగా మారిన తరువాత, చిలికితే కానీ వెన్న రాదు' అని రాజు సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ‘దేవుడు వున్నాడు, పాలల్లో వెన్నమాదిరి అంతా తానై వున్నాడు, కానీ ఆ దైవం గురించి నిరంతర చింతన ఉన్నవాళ్ళకు మాత్రమే, దైవ దర్శనం కలుగుతుంది’అని సమాధానం చెప్తాడు. సాధువు ప్రశ్నకు సంతృప్తి చెందిన రాజుగారు, సంతోషం అండీ అంటూ.

తన రెండవ ప్రశ్న 'దేవుడు ఎటు చూస్తాడు' అని అడుగుతాడు, 
అప్పుడా సాధువు వెంటనే బదులు ఇవ్వకుండా, ప్రక్కనే వెలుగుతున్న దీపం చూపించి,  ‘ఈ దీపం ఎటు వైపు వెలుగునిస్తోంది ?’అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రాజుగారు ఆ దీపం ‘అన్ని వైపులకూ’ అని బదులిస్తాడు. అప్పుడు సాధువు, 'దైవం కూడా అన్ని దిక్కులకు చూస్తుంటాడు' అని సమాధానం చెబుతాడు. సాధువు చెప్పిన సమాధానానికి తృప్తి పడిన రాజుగారు,

 తన మూడవ ప్రశ్నగా 'ఇంతకూ అసలు దేవుడు ఏం చేస్తుంటాడు' అని అడుగుతాడు. అప్పుడా సాధువు, "రాజా! నువ్వు ఈ రాజ్యానికే అధిపతివి కానీ, నీవు ఇప్పుడు నేల మీద కూర్చొన్నావు. నేనేమో  సన్యాసిని, నీ సింహాసంపై కూర్చున్నాను. ఇలా భగవంతుడు క్రింది వాడిని పైకి, పైవాడిని క్రిందికి, వారి వారి ప్రారబ్ధానుసారం మార్చుతుంటాడు. ఆ రాజు తన మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు లభించాయని సంతోస్తాడు. అప్పటి నుంచి ఆ రాజు తన యందలి భక్తి భావాన్ని మరింత వృద్ధిపొందించుకొని, అనన్యభక్తిని పొంది, ధన్యుయ్యాడు.

పాలల్లో వెన్నమాదిరి సృష్టి అంతా పరమాత్మ చైతన్యం నిండి వున్నది, దీపం వెలుగు అన్ని వైపులకు ప్రసరించినట్లుగా, ఈ సమస్త ప్రపంచానికి, విశ్వానికి, అంతరిక్షానికి… సర్వసాక్షిగా పరమాత్మ తత్వం నెలకొని వున్నది. జీవులకు వారివారి ప్రారబ్ధాన్నివ్వడమే ఈశ్వరుని పని.

Post a Comment