Breaking News
Join This Site
 జనమేజయ మహారాజు "సర్పయాగము" (మహాభారతంలో మంచి కథలు)

జనమేజయ మహారాజు "సర్పయాగము" (మహాభారతంలో మంచి కథలు)


ఓ జనమేజయా! లక్ష్మీ సహితుడా! అయుష్మంతుడవైన నీవు చిన్నతనంలోనే అభిషేకింప బడినవాడవై మీ వంశానికి చెందిన రాజ్యంలో భూభారాన్ని భరించావు. భూజనులకు ప్రీతికలిగిస్తూ ధర్మమార్గాన్ని పెంపొందించావు. అనేక యజ్ఞాలు-యాగాలు చేసి ఒప్పుగా దక్షిణలు ఇచ్చి భూసురులు సుఖసంతోషాలతో ఉండేలా చేశావు. పోషించావు. సజ్జనులచేత నిర్మలమైన కీర్తిని దశదిశలా వ్యాపించేలా చేశావు. సంచితపుణ్య! సర్వగుణ సంపదలో ఎవ్వరైనా మీకు సరిపోగలరా? ఓ రాజశ్రేష్ఠుడా! యుక్తం కాదనకుండా తక్షకుడు, శృంగి అనే మునిశాప ప్రేరేపణ చేత ఇంత అధికమైన కీడు తలపెట్టాడు. నీవుకుడా భూసురుల చేత నిర్వహించబడిన సర్పయాగమున తక్షకుడు సహా మొదలైన పాములను భస్మము చేయుము. అని పలికిన విని జనమేజయుడు కోపోద్దీపచిత్తుడై సర్పయాగం చేయబూని ఋత్విక్కులను, పురోహితులను పిలవడానికి ఆజ్ఞాపించి, వచ్చిన ఆ అపురోహితులతో ఇలా పలికాడు. 

(ఋత్విక్కులు పదహారుగురు : బ్రహ్మ, ఉద్గాత, హోత, ప్రతిప్రస్థాత,పోత, ప్రతిహర్త, అచ్ఛావాకుడు, నేష్ట, అగ్నీధ్రుడు, సుబ్రహ్మణ్యుడు, గ్రావస్తుతుడు, ఉన్నేత, అధ్వర్యుడు, బ్రాహ్మణచ్ఛంసి, ప్రస్తోత, ,మైత్రావరణుడు.)

తక్షకుడు తన విషాగ్ని జ్వాలచేత  నాతండ్రి ఏవిధంగా దహించాడో ఆవిధంగా బంధుమిత్ర సమూహంతో తక్షకుడిని భయంకరమైన ఉగ్రజ్వాలలలో దగ్ధం చేసి దివిజాదిలోకనివాసి యైన నాజనకునకు మరియు ఈ ఉదంక మునికి సజ్జనులకు అబిభిమతమయ్యేల ప్రీతికలిగిస్తాను. ''సర్పయాగం ఇట్టిదని శాస్త్రములలో చెప్పడిన క్రమం ఏదైనా ఉంటె తెలుపండని'' అడుగగా ఋత్విక్కులు ఈవిధంగా పలికారు. ఉర్వీతలేశ్వరా! జనమేజయా! ఈసర్పయాగం ప్రత్యేకంగా దేవతలచే నీకోరకే కల్పించబడింది. దీనిని ఇతరులెవ్వరు చేయరు. భవిష్యత్తులో చేయబోరు. ఇంతకుమునుపు చేయనూలేదు. ఇది పురాణములలో ప్రసిద్ధం; ప్రాచీనమైనది. అని ఋత్విజులు పలుకగా విని జనమేజయుడు సర్పయాగం చేయడానికి నిశ్చయించాడు.

ఇలా కృతనిశ్చయుడై కాశీరాజు పుత్రిక యైన వపుష్టమ అను పేరుగల తన పట్టమహిషితో సర్పయాగాదీక్షితుడై శాస్త్రోపదిష్ట ప్రమాణ లక్షణాలలో నేర్పరులైన శిల్పాచార్యుల చేత నిర్మితమై,  యజ్ఞానికి కావాల్సిన ద్రవ్య, సంభార, సంబృత, ధన ధాన్యదులతో నిండినది. తమకు తమకు నియోగింపబడిన కార్యాలను మొదలుపెట్టడంలో వేగిరపడి తిరుగుతున్న బ్రాహ్మణుల సముదాయం కలదైన యజ్ఞగృహంలో ఉన్నట్టి రాజైన జనమేజయునితో  ఒక వాస్తు విద్యానిపుణుడు (గృహనిర్మాణ శాస్త్రంలో నిపుడైన పౌరాణికుడు) ఇట్లా అన్నాడు. అనఘా! నీవు చేయబోయే ఈ సర్పయాగం ఋత్విక్కులు శాస్త్రోక్తంగా చేసే క్రియకలాపం చేత సమగ్రమైనప్పటికీ చివరివరకు సాగదు. ఓ బ్రాహ్మణోత్తముని కారణంగా మధ్యలోనే నిలిచిపోతుందని పౌరాణికుడు చెప్పగా, అతడి మాటలు పెడచెవిన పెట్టి రాజనియుక్తులై చ్యవనమహర్షి కులంలో ప్రసిద్ధుడైన చండభార్గవుడు హోతగా, పింగళుడు అధ్వర్యుడుగా, శార్గరవుదు ఒక ఋత్విజుడుగా, కౌత్సుడు ఉద్గాతగా, వైశంపాయ(వేదవ్యాస), పైలా, జైమిని, సుమంతు, సుఖ, శ్వేతకేతు, మౌద్గ, ల్యోద్ధాలక, మాండవ్య, కౌశిక, కౌండిన్య, శౌండిల్య, క్రమటక, కోహ లాసిత, దేవల, నారద, పర్వత, మైత్రేయ, యత్రేయ, కుండజటర, కలఘట, వాత్స్య, శ్రుతశ్రోవో, దేవవర్మ, శర్మద, రోమశ, శోదంక, హరిత, రురువు, పులోమ, సొమశ్రవసు, ఆదిగాగల మహర్షులు, మహామునులు ఆధ్యులుగా(యజ్ఞాన్ని పరిశీలకులుగా)  నల్లని వస్త్రాలు ధరించినవారు, పొగలచెత ఎర్రబడిన నేత్రాలు కలవారై యజ్ఞ తంత్రాన్ని నడిపే ఋత్విజులు అగ్నిసాధ్యమైన కర్మలను అంగభూతమైన కర్మకలాపాన్ని చేసి అందులో నెయ్యి మొదలైన హోమద్రవ్య పదార్థాలను హోమం చేయడానికి ప్రారంభించగా బ్రాహ్మణుల మంత్రాల యొక్క, అగ్నిలో వ్రేల్చబడిన పదార్థాల యొక్క ప్రభావంచేత వశంతప్పిన వారై అధిక భయాతరులై గొప్పగొప్ప పాములరాజులు ఒకరినొకరు భయకంపితులై పిలుచుకుంటూ కుండాగ్నుల యందు శీఘ్రముగా పడ్డారు.తక్షకుడు బ్రాహ్మణశ్రేష్ఠుల మంత్రహుత(అగ్నికి కానుకగా ఆహుతి ఈయబడేది) మహాత్త్యముచేత ఇంద్రుని వద్దనుండి కదలక విషజ్వాలలు కురుపిస్తూ ఉండగా, చేష్టా శూన్యుడై అధికముగా గల సుడిగాలి విజ్రుంబణం చేత మిక్కిలి వృద్దినొందింపబడిన దావానలం(దీర్ఘమైన కార్చిచ్చు)వలె ఆకాశంలో పరిబ్రమిస్తూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని జనులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఋత్విక్కులు మంత్రాలు పటిస్తూ ఉన్నారు. ఆ మంత్రమహిమ చేత పాములన్నీ హుతమౌతున్నాయి. ఒక్కడ తక్షకుడే హుతం కావాల్సివుంది. తక్షకుడు మంత్రాల యొక్క శక్తి చేత వివసుడై అగ్నిలో పడకుండా ఉండటానికై ఎంతో ప్రయత్నిస్తూ ఆకాశంలో వివశుడై తిరుగుతున్నాడు. అగ్నిలో పాడటానికి సిద్దమై ఆకాశంలో అల్లల్లాడుతున్న తక్షకుడిని ఆస్తీకుడు ఓహో తక్షకా!మరలిపోమ్ము అని పలికి అగ్నిలో పడకుండా నడుమనే మరల్చాడు. యాగశాలలోని సదస్యులు సంతోషం పొంది ఆస్తీక మునీంద్రుడిని మనోహరంగా కీర్తించి ప్రస్తుతించారు.

ఫలశ్రుతి : జగత్కార మునిశ్రేష్ఠునికి, జగత్కారువనే వాసుకి చెల్లెలికి కుమారుడైన ఆస్తీక మహామునిని స్మరిస్తే జనులకు పాముల వలన భయం కలుగదు. మరియు ఆస్తీకుని చరిత విన్నవారికి సర్వపాప క్షయం అవుతుంది. (సకల పాపాలు తొలగిపోతాయి.)

Post a Comment