Breaking News
Join This Site
శ్రీకంఠేశ్వరస్వామి ఆలయం. ఆ పశుపతి.. టిప్పుసుల్తాన్‌ పశువైద్యుడు!

శ్రీకంఠేశ్వరస్వామి ఆలయం. ఆ పశుపతి.. టిప్పుసుల్తాన్‌ పశువైద్యుడు!
    నంజుండేశ్వరుడని కన్నడ ప్రజలు ప్రేమగా పిలుచుకునే శ్రీకంఠేశ్వరుడు... భవరోగ వైద్యుడిగా ఐహికమైన మమకారాల్ని తొలగిస్తాడు, ఆది వైద్యుడిగా దీర్ఘకాలిక రుగ్మతల నుంచి విముక్తి ప్రసాదిస్తాడు. అంతేనా, ఆ పశుపతి...టిప్పుసుల్తాన్‌కు ఇష్టమైన రాచ ఏనుగుకు చికిత్స చేసి... ‘హకీమ్‌ నంజుండ!’ అనీ అనిపించుకున్నాడు.
కన్నడసీమ ఆలయాలకు నెలవు. అందులోనూ కర్ణాటక సాంస్కృతిక రాజధాని మైసూరు చుట్టూ అనేక దివ్యక్షేత్రాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెంకటేశ్వర్రావులూ, శ్రీనివాసరావులూ ఎంతమంది ఉంటారో....కన్నడదేశంలో నంజుండప్పలూ, నంజుండేశ్వరలూ అంతేమంది కనిపిస్తారు. కస్తూరివారి ఇంటిదైవం నంజుండేశ్వరుడు. స్వామి అసలు పేరు శ్రీకంఠేశ్వరుడు. నంజన్‌గూడులో కొలువై ఉన్నాడు కాబట్టి...నంజుండప్ప అనిపించుకున్నాడు. ఈ క్షేత్రం కపిల, కౌండిన్య నదుల సంగమ స్థానం. శ్రీకంఠేశ్వరుడిని ముక్తిప్రదాతగా కొలుస్తారు. పేరులోని ‘శ్రీ’ సిరిసంపదల్నీ ప్రసాదిస్తాడని చెప్పకనే చెబుతుంది. ఆ మట్టిలో వైద్యగుణాలు ఉంటాయన్న నమ్మకంతో...శివదర్శనానికి వచ్చే రోగపీడితులూ ఎక్కువే. ‘కన్నడ పులి’ టిప్పుసుల్తాన్‌ అయితే ఆ దేవుడిని ‘హకీమ్‌ నంజుండ’ అని భక్తిగా పిలిచేవాడట. దీనికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. టిప్పుసుల్తాన్‌ దగ్గర అపారమైన గజదళం ఉండేది. అందులోని ఓ రాచ ఏనుగంటే సుల్తాన్‌కు ప్రాణం. ఓయుద్ధంలో ఆ గజరాజు కంటికి గాయమైంది. ఎంతమంది పశు వైద్యులకు చూపించినా, నయం కాలేదు. దీంతో టిప్పుసుల్తాన్‌ నంజుండేశ్వరుడికి మొక్కుకున్నాడు. అంతే, మంత్రమేసినట్టు గాయం మానిపోయింది. వైద్యుడి పారితోషికంగా...మాన్యాలూ మాణిక్యాలూ సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు టిప్పూ.
అపురూప నిర్మాణం.. 
శ్రీకంఠేశ్వరస్వామి ఆలయ గోపురాన్ని చూడగానే తన్మయత్వానికి గురవుతారు భక్తులు. దాదాపు నూట ఇరవై అడుగుల ఎత్తున్న మహాగోపురమిది. రజతాద్రి మీద తాండవం చేస్తున్న నటరాజును గుర్తుకుతెస్తుందా నిర్మాణం. రాజగోపుర ప్రవేశద్వారం కుడివైపు మండపంలో గణపతీ, ఎడమవైపు మండపంలో ముగ్గురమ్మల మూలపుటమ్మ మహిషాసురమర్దినీ దర్శనమిస్తారు. శిలాస్తంభ మండపంలో పరమశివుడి వాహనమైన నంది...ఎనిమిది అడుగుల విగ్రహంగా కనువిందు చేస్తుంది. దీన్ని దళవాయి విక్రమరాయుడనే పాలకుడు ప్రతిష్ఠించాడని అంటారు. ఆలయ గోడల్నీ కళాత్మకంగా తీర్చిదిద్దారు అలనాటి శిల్పులు. ఇంద్రాది దిక్పాలకులూ, వీరభద్రుడూ, అష్టభైరవులూ, దక్షిణామూర్తీ, చాముండేశ్వరీ దేవీ..ఇలా దేవతాగణమంతా శివదర్శనానికి వచ్చిన భావన కలుగుతుంది. శైవక్షేత్రమే అయినా, శ్రీదేవీ భూదేవీ సమేతుడిగా మహావిష్ణువు సైతం ఇక్కడ కొలువుతీరాడు.

స్థల పురాణం... 

నంజన్‌గూడును పూర్వం గరళపురిగా పిలిచేవారు. ఈ ప్రాంతం దండకారణ్యంలో ఓ భాగమని అంటారు. కేశి అనే రాక్షసుడి స్థావరమిది. కేశి యజ్ఞయాగాలకు విఘ్నం కలిగించేవాడు. రుషుల్ని హింసించేవాడు. ఆ రాక్షసుడికి నిలువెల్లా విషమే. దీంతో ఎంతటి మహావీరులైనా ఆ విషవాయువుల ధాటికి కుప్పకూలేవారు. ఆ అరాచకాల్ని భరించలేక...తాపసులంతా ఓ చోట సమావేశం అయ్యారు. కేశిని సంహరించగల శక్తి ఎవరికుందన్న చర్చ వచ్చింది. హాలాహలాన్ని భక్షించిన పరమశివుడే రాక్షస సంహారం చేయగలడన్న తీర్మానానికి వచ్చారు. అంతా కలసి కైలాసానికి వెళ్లారు. భక్తుల విన్నపాన్ని పరమశివుడు ఆమోదించాడు. అసురసంహారానికి, నందివాహనమెక్కి గరళపురికి తరలివచ్చాడు. శివుడి చేతి త్రిశూలం దెబ్బకు కేశి నేలకొరిగాడు. కానీ, ఆ రాక్షసుడి పార్థివదేహం లోంచి వెలువడుతున్న విషవాయువులు జనజీవనాన్ని అతలాకుతలం చేయసాగాయి. ఆ ప్రభావానికి అడవులు బుగ్గిపాలయ్యాయి. ఎన్నో ప్రాణులు అంతరించిపోయాయి. ఆ సమయంలో, గరళకంఠుడైన శివుడు మరోసారి విషాన్ని స్వీకరించి...మానవజాతి ఉనికిని కాపాడినట్టు ఐతిహ్యం. ఈ గరళక్షేత్ర ప్రస్తావన స్కందపురాణంలో ఉంది. రాక్షస సంహారం తర్వాత శివుడు లింగరూపాన్ని ధరించాడు. యుగాలుగా భూమి పొరల్లో నిక్షిప్తమైన ఆ శివలింగాన్ని పరశురాముడు మనో నేత్రాలతో దర్శించి వెలికి తీశాడట. దీంతో ఇది పరశురామక్షేత్రంగా ప్రసిద్ధమైంది. అహల్యా వృత్తాంతంతోనూ ఈ క్షేత్రానికి సంబంధం ఉంది. ఇంద్రుడి మాయలో పడిన అహల్యను జడపదార్థంగా మారిపొమ్మని శపించిన తర్వాత...ఆ దోషాన్ని తొలగించుకోడానికి గౌతమ మహర్షి ఇక్కడ శివుడిని ఉద్దేశించి తపస్సు చేసినట్టు ఐతిహ్యం. కపిల, కౌండిన్య నదుల కూడలి కావడంతో సంగమ క్షేత్రంగా కూడా గుర్తింపుపొందింది. చోళ, గాంగ, హోయసాల, విజయనగర, మైసూరు మహారాజుల కాలాల్లో ఆలయం అంచెలంచెలుగా విస్తరించింది. కార్తిక మాసంలో ఘనంగా లక్షదీపోత్సవం జరుపుతారు. ధనుర్మాసంలోని...ఆరుద్రా నక్షత్రంలో నటరాజస్వామికి ఆరుద్రోత్సవం నిర్వహిస్తారు. రథసప్తమికి కన్నులపండువగా రథోత్సవం జరుగుతుంది. పంచభూతాలకు అధిపతి అయిన పరమశివుడు ఐదు తేర్లలో వూరేగుతాడు. నంజుండేశ్వరుడినీ చాముండేశ్వరినీ ప్రేయసీప్రియులుగా అభివర్ణిస్తూ అనేక జానపద గేయాలూ, గాథలూ ప్రచారంలో ఉన్నాయి. నంజుండేశ్వరక్షేత్రం బెంగుళూరు నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. మైసూరుకు పదిహేను కిలోమీటర్లు. శివకేశవుల దర్శనం తర్వాత...మైసూరు పరిసరాల్లోని చాముండేశ్వరీదేవి ఆలయాన్నీ, రంగనాథస్వామి ఆలయాన్నీ దర్శించుకోవచ్చు.
- జి.జగదీశ్వరి, న్యూస్‌టుడే బెంగళూరు

Post a Comment