Breaking News
Join This Site
రామరాజ్యంలో "శునక తీర్పు". (నీతి కథలు)

రామరాజ్యంలో "శునక తీర్పు". (నీతి కథలు)


       రాముల వారు పరిపాలిస్తున్న సమయంలో ప్రజలకి ఏ సమస్య వచ్చినా వెంటనే సమస్య విన్నవించడం కోసం ఒక గంటని ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసి వేల సంవత్సరాలు అయినా ఒక్కరు కూడా గంట కొట్టలేదు. అంటే ఎవరికీ సమస్యలు రాలేదు. 

ఒకరోజు రాముల వారు సింహాసనం మీద సీతారాములు కూర్చుని, లక్షణుడు నిలబడి ఉండగా, భారత శత్రుఘ్నులు వింజామరలు వీస్తూ ఉండగా సభ చేస్తూ ఉన్నారు. సభ జరుగుతున్న సమయంలో టింగ్ టింగ్ అని గంట వినిపించింది. ఎవరు గంట కొట్టింది. అంతటి సమస్య రాములవారు పరిపాలిస్తుండగా రావడమా? అసంభవం అని రాములవారి వైపు చూసారు అందరు. ఎవరో తక్షణం ప్రవేశపెట్టండి అని లక్ష్మణుడిని ఆజ్ఞాపించగా లక్ష్మణుడు వెళ్లి గంట కొట్టేది ఎవరో చూసి పరుగుపరుగున వచ్చి ప్రభు! గంట కొట్టేది మనిషి ఐతే తీసుకురావచ్చు. కాని ఊరకుక్క ఒకటి ఏదో అనుకోని  ఈ గంటని లాగుతుంది. అని చెప్పగా ఎవరైనా సరే ప్రవేశపెట్టవలసిందే. కనుక వెంటబెట్టుకు తీసుకురా అని మరలా పంపించాడు. లక్ష్మణుడు వెళ్లి కుక్కని తీసుకొచ్చాడు. 

కుక్క మూతి పగిలి రక్తం కారుతూ ఉంది. అది చూసి దీనికి ఎలా ఈ దెబ్బతగిలింది? ఎవరు దీనిని హింసించింది? ఎలా తెలుసుకోవాలి? ఏమి చేయాలి అని సందేహంలో పడ్డారు. అది గమనించిన కుక్క మానవ భాషలో, ప్రభూ! నేను కుక్కని అని మాట్లాడలేనని, సమస్యకి పరిష్కారం ఎలా అని అనుకోకండి. నాకు మాటలు వచ్చు. మీలాగే నేను మాట్లాడగలను అనగా, ఓహో ఇది మాటలు నేర్చిన కుక్కా! భలే . సరే! ఇప్పుడు చెప్పు. ఏమిటి సమస్య? అనగా !

         రామచంద్ర ప్రభూ! ఊరి చివర పాడుబడిన గుడి ఒకటి ఉంది. దానిని పడేయకుండా మాలాంటి మూగజీవాల ఆశ్రయం కోసం అలాగే ఉంచుతారు. అందులో నేను ఉంటున్నాను. నిత్యం అటుగా ప్రయాణించే భక్తులు వాళ్లకి తోచిన ఆహారం అక్కడ వేస్తె అది తింటూ జీవనం సాగిస్తున్నాను. ఈరోజు ఒక సాధువు వచ్చి తన చేతిలో ఉన్న దుడ్డు కర్రతో అన్యాయంగా నా మూతి పగలగొట్టాడు. కనీసం అరవనుకూడా అరవలేదు. కనుక నాకు న్యాయం చేయండి. అని అడుగగా... నీవాదన విన్నాం. నీ వాదన ఒకటే విని తీర్పు చెబితే ధర్మానికి హాని కలుగుతుంది. ధర్మానికి హాని కలిగితే జనులు గతులు తప్పుతారు. దీనివలన సృష్టి అల్లకల్లోలం అవుతుంది. అని వెంటనే భటుల్ని పిలిచి ఈశునకాన్ని కొట్టిన సాధువుని తీసుకొనిరండి అని పురమాయించాడు. భటులు తక్షణం వెళ్లి సాధువుని తీసుకోచ్చి సభలో ప్రవేశపెట్టారు.. 

        కుక్క తన వాదన వినిపించింది. వాదన అంతా విన్నాడు సాధువు. రామచంద్ర ప్రభు! నన్ను  క్షమించండి. పాపం ఇది రోడ్డుప్రక్కనే నిలబడి నావైపు చూస్తూ ఉంది. పైన ఎండ మండుతుంది. ఈరోజు ఎందుకో ఒక్కరు కూడా భిక్షవేయలేదు. దాంతో కడుపులో ఆకలి మలమలా మాడుస్తుంది. పైన ఎండ, లోపల ఆకలి. అదే సమయంలో ఎదురుగా ఈ కుక్క. చూసి ఒళ్ళు మంది నా చేతిలో ఉన్న కర్రతో దీని మూతి పగలగొట్టాను. ఆ సమయంలో ఎందుకో అలా అనిపించింది. అని చెప్పగా రాములవారు అంతా విని పరిష్కారం ఏమిటని మంత్రుల్ని అడుగగా, సాధువు వలన ఆపద పొందింది కుక్కే కనుక ఆ కుక్కనే తీర్పు చెప్పమనండి అన్నారు. రాములవారు కూడా అలాగే చేయమని చెప్పారు. 

      కుక్క బాగా అలోచించి ! రామచంద్రప్రభు! ఇక్కడికి దగ్గరలో పదివేల కోట్ల సంపద ఉన్న ఆశ్రమం ఒకటి ఉంది. దానికి అధ్యక్షుడిని చేయండి అని తీర్పు చెప్పింది. సభలో వారందరూ రాముడితో సహా ఆశ్చర్యపోయి! ఇదెక్కడి తీర్పు? ఎవరైనా హాని చేస్తే క్షమించాలి లేదా శిక్షించాలి. ఈ కుక్క మాత్రం పదివేల కోట్ల సంపద కలిగి ఉన్న ఆశ్రమానికి అద్యక్ష పదవి ఇచ్చింది. ఇదెక్కడి కుక్క? అనుకోని సాధువుని పంపించి విషయం చెప్పమన్నారు.. అప్పుడు కుక్క ఇలా చెప్పింది.. 

ప్రభు! పూర్వ జన్మలో నేను పదివేలకోట్ల సంపద ఉన్న ఆ ఆశ్రమానికి అధ్యక్షుడిని. ఆ పదవిలో ఉన్నంతకాలం తెగ తినేశాను. ఇది అది అనిలేదు. దొరికింది దొరికినట్లు దోచేసుకున్నాను. దేవుడి మాన్యం, ఆశ్రమ సంపదలు, బియ్యం దగ్గర నుండి పొలం వరకు అన్నీ తెగ తినేసి ఇదిగో ఇప్పుడు కుక్కనై జన్మెత్తాను. ఇలా అందరితో చీత్కారాలు పొందుతూ, దెబ్బలు తింటూ ఇలాంటి దుర్భర జీవితం గడుపుతున్నాను. ఇదిగో ఆ సాధువుకి కూడా కక్కుర్తి ఎక్కువ. వాడిని కూడా దానికి అధ్యక్షుడిని చేస్తే నాలాగే కుక్కలా జన్మెత్తి తిట్లు తింటూ, తన్నించుకుంటూ ఉంటాడు. అందుకే ఆ తీర్పు ఇచ్చాను అనగా అందరు నవ్వుకున్నారు.. వద్దిపర్తి పద్మాకర్ గారు.. హనుమత్ వైభవం... 

Post a Comment