Breaking News
Join This Site
 వసిష్ఠ గీత. పదహారేళ్ల ప్రాయం నిండని శ్రీరాముడిలో వైరాగ్యం ఆవరించింది.

వసిష్ఠ గీత. పదహారేళ్ల ప్రాయం నిండని శ్రీరాముడిలో వైరాగ్యం ఆవరించింది.


బ్రహ్మజ్ఞానాన్ని బోధించే విద్యను అధ్యాత్మ విద్య అంటారు. చతుర్విధ భక్తుల్లో జ్ఞానిని శ్రేష్ఠుడిగా పరిగణిస్తారు. బ్రహ్మజ్ఞానం పొందినవాడే నిజమైన జ్ఞాని. జ్ఞానాన్ని ప్రబోధించే రెండు మహత్తర గ్రంథాలు మన వాంగ్మయంలో ఉన్నాయి. ఒకటి నారాయణుడు నరుడికి బోధించిన ‘భగవద్గీత’. ఇక్కడ నారాయణుడు శ్రీకృష్ణుడు, నరుడు అర్జునుడు. రెండోది, నరుడు నారాయణుడికే జ్ఞానోపదేశం చేయడం. దాన్ని ‘యోగ వాసిష్ఠం’ అంటారు. ఇక్కడ నరుడు ముని అయిన వసిష్ఠుడు. నారాయణుడు శ్రీరాముడు. యోగవాసిష్ఠం చాలా క్లిష్టమైన తత్వబోధ. దీనికి వాసిష్ఠ రామాయణమని, జ్ఞాన వాసిష్ఠమని, మహా రామాయణమని పలు విధాలైన వ్యవహారం ఉంది. వసిష్ఠుడు బోధించిన ఉపదేశం గనుక ‘వసిష్ఠగీత’గానూ ప్రసిద్ధం. విద్వాంసుల సాంప్రదాయిక విశ్వాసం ప్రకారం ఈ గ్రంథాన్ని రచించినవారు వాల్మీకి మహర్షి. రామాయణంలో ఇది అంతర్భాగం కాదు. నిజానికి ఇది బాలకాండలో భాగం కావాలి. పదహారేళ్ల ప్రాయం నిండని శ్రీరాముడిలో వైరాగ్యం ఆవరించింది. ఏమీ పట్టకుండా ఉంటున్నాడు. ఆ సమయంలో వసిష్ఠ, విశ్వామిత్రులిద్దరూ కలిసి శ్రీరాముడి తత్వ సందేహాలను తొలగించి, ఆయనలోని అకర్మణ్యతను పారదోలారు. ఆ తరవాతనే శ్రీరాముడు తాటక సంహారం, సీతను పరిణయమాడటం మొదలైన విశిష్ట కార్యాలు నిర్వర్తించాడు. రామవైరాగ్య ఘట్టాన్ని, దీనిపై మహర్షుల సుదీర్ఘ వేదాంత చర్చను వివరిస్తే రామాయణ కావ్యరసానందానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో మహర్షి ఈ వేదాంత బోధను ప్రత్యేక గ్రంథంగా వెలయించాడని పండితులు భావిస్తున్నారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వసిష్ఠ మహర్షి దగ్గర వేదవిద్యలన్నీ పూర్తి చేశారు. యుద్ధవిద్యల్లోనూ ఆరితేరారు. కొన్నిరోజుల తరవాత శ్రీరాముడు ఏకాంతంగా ఆలోచిస్తుండటం ప్రారంభించాడు. మనిషి శారీరకంగా చిక్కిపోవటం, పాలిపోవడం కనిపిస్తోంది. దిగులుగా ఉంటున్నాడు. ఈ ప్రపంచం అశాశ్వతమని, భోగాలన్నీ భ్రాంతులని మిత్రులకు బోధిస్తున్నాడు. దశరథుడు వసిష్ఠుడికి రాముడి పరిస్థితి విన్నవించాడు. ఇది వైరాగ్యమని దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని మహర్షి భావించాడు. అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణ కోసం, రాక్షస సంహారం కోసం రాముణ్ని తనతో పంపించమని దశరథుని కోరాడు. దశరథుడు భయపడ్డాడు. వసిష్ఠుడు నచ్చజెప్పాడు. శ్రీరాముడి మానసిక స్థితి స్వచ్ఛమైన వైరాగ్యం వల్ల కలిగిన పరిణామమేగాని అజ్ఞానం కాదని విశ్వామిత్రుడు భావించాడు. వసిష్ఠ, విశ్వామిత్రులు శ్రీరాముడి మనసులోని కల్లోలాన్ని కనుగొన్నారు. జ్ఞానబోధ చేశారు. యోగవాసిష్ఠం 32వేల శ్లోకాల మహా గ్రంథం. రామాయణం 24వేల శ్లోకాల ఇతిహాసం. యోగవాసిష్ఠ గ్రంథంలో వైరాగ్య, ముముక్షు వ్యవహార, ఉత్పత్తి, స్థితి, ఉపశమ, నిర్వాణ ప్రకరణాలనే ఆరు ప్రకరణాలు ఉన్నాయి. ముందు విశ్వామిత్రుడు శ్రీరాముడి సందేహాలను తెలుసుకొని తత్వం బోధించాడు. ఆ తరవాత వసిష్ఠుడు బోధించే సుదీర్ఘమైన ఉపదేశానికి పీఠికలా విశ్వామిత్రుడి బోధ వైరాగ్య ప్రకరణంలో ఉంటుంది. ఈ సందర్భంలో రాముడిలోని వైరాగ్యానికి కారణంగా శ్రీహరి శాప వృత్తాంతం ప్రస్తావిస్తారు. ఒకసారి విష్ణుమూర్తి బ్రహ్మలోకానికి వెళ్తే అక్కడి వారంతా ఎంతగానో గౌరవించారు. సనత్కుమారుడు మాత్రం ఏమీ పట్టనట్లు మౌనంగా కూర్చున్నాడు. విష్ణువుకు సనత్కుమారుడు నిష్కాముడని తెలుసు. కానీ, నిష్కామత్వం వల్ల గర్వం వహించి పెద్దలను గౌరవించకపోవడం తగదని భావించాడు. సనత్కుమారుని ‘నీవు నిష్కాముడినని గర్విస్తున్నావు. కనుక నీవు కుమారస్వామి పేరుతో జన్మించి కామార్తుడవై ఇద్దరిని వివాహం చేసుకొ’మ్మని శపించాడు. సనత్కుమారుడు సామాన్యుడు కాదు. విష్ణువుకు ప్రతిశాపం ఇచ్చాడు. ‘నీవు సర్వజ్ఞుడినని గర్విస్తున్నావు. నేను సమాధి స్థితిలో దేహస్మృతి లేకుండా ఉన్నానని గ్రహించలేక నన్ను శపించావు. కొంతకాలంపాటు నీ సర్వజ్ఞత్వం నశించి అజ్ఞానంలో ఉంటావు’ అని శపించాడు. ఆ శాపాన్ని అనుభవించాల్సి వచ్చిన తరుణంలోనే ఈ జ్ఞానబోధ అవసరమైంది. యోగవాసిష్ఠంలో ఎన్నో తాత్విక విషయాలు కథల రూపంలో ఉన్నాయి. ఆత్మతత్వ విచారణ, సృష్టితత్వం, పరమాత్మ స్వరూప లక్షణం, జ్ఞాన వైరాగ్యాల స్వరూపం మొదలైన ఎన్నో అంశాల వివరణ రమణీయంగా ఉంటుంది. ఈ గ్రంథ పఠనం దుఃఖనివారణదాయకమని పెద్దలు చెబుతారు.

Post a Comment