Breaking News
Join This Site
అఘోరేశ్వర శివాలయం. శివమోగ, కర్ణాటక

అఘోరేశ్వర శివాలయం. శివమోగ, కర్ణాటక


పచ్చదనాన్ని తివాచీగా పరచి.. కొండ కోనల్ని వాటిపై అద్ది.. ఉవ్వెత్తున ఎగసిపడే జలపాతాన్ని కాన్వాస్‌కి జత చేస్తే.. కచ్చితంగా పశ్చిమ కనుమల్లోని ‘శివమోగ’లా ఉంటుంది. కర్ణాటక ప్రాంతంలో తీర్చిదిద్దినట్టుండే.. ఈ కనుమల్లో ‘జోగ్’ జలపాతం చూట్టం ఒక అనుభూతి అయితే.. అఘోరేశ్వర దేవాలయాన్ని సందర్శించటం తీయటి జ్ఞాపకం. ‘శివమోగ’ను ప్రాచీన కాలంలో ‘మండ్లి’ అని వ్యవహరించేవారు. ఈ ప్రాంతం సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపం అంటారు. శివుని ముఖాన్నీ.. నాసికనూ శాస్త్రోక్తంగా ఆరాధనా భావంతో పూజిస్తే సకల సౌభాగ్యాలూ కలుగుతాయని విశ్వాసం. కొన్నాళ్లకు ‘మండ్లి’ని శివమోగ’గా భక్తులు పిలువ నారంభించారు. అదే ఇప్పటి ‘శివమొగ్గ’. అంటే తీయటి కుండ అని అర్థం. పశ్చిమ కనుమలు ఎటు చూసినా ఔషధ మొక్కలతో అలరారుతూండటం వల్ల భక్తుల రాకకు అదొక కారణం. పూర్వం దూర్వాస మహాముని ఇక్కడే ఘోర తపస్సు చేసి దేవతల నుంచీ అనేక వరాలు పొందాడంటారు.
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై.. దట్టమైన అడవుల్లో సంచరిస్తూండగా.. మారీచుడనే రాక్షసుడు జింక రూపంలో రావటం.. అతణ్ణి వధించిందీ ఇక్కడే అంటారు. ఆ ప్రాంతం ‘తీర్థహళ్లి’గా పిలుచుకొంటారు. ఈ తీర్థంలో మూడు మునకలేస్తే.. సంకట పాపహరణం జరుగుతుందని వ్యవహారం. పురాణేతిహాసాల కథలు ఎలా ఉన్నప్పటికీ.. శివమోగ - క్రీ.శ.3వ శతాబ్దంలో వౌర్య వంశీకుల ఏలుబడిలో ఉండేదనటానికి చారిత్రక ఆధారాలున్నాయి. ఆ తర్వాతి కాలంలో శాతవాహనుల రాజ్యంలో కలిసిపోయింది. శాతకర్ణి శాసనాల ప్రకారం షికారీపూర్ తాలూకులో ఉండేది శివమోగ. క్రీ.శ.200 నాటికి శాతవాహనుల చరిత్ర అంతం కావటం.. బనవాసి కదంబా వంశీకులు ఈ రాజ్యాన్ని చేజిక్కించుకొని క్రీ.శ.345 వరకూ పాలించారు. ఆ తర్వాత్తర్వాత బాదామి చాళుక్యులు.. రాష్ట్ర కూటులు.. కళ్యాణీ చాళుక్యులు పాలించారు. హొయసలుల పాలన అనంతరం విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 1763లో హైదర్ అలీ స్వాధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత బ్రిటీష్ పరిపాలన.


ఇక శివమొగ్గలోని అఘోరేశ్వర దేవాలయానికి వస్తే- పచ్చటి మైదానంలో గత వైభవానికి సాక్షీభూతంగా నిలిచి ఇప్పటికీ భక్తుల రాకతో పులకరించి పోతోంది. క్రీ.శ.1566 - 1570 ప్రాంతంలో దొడ్డసంకణ్ణ నాయకునిచే నిర్మితమైన ఈ ఆలయ ముఖ ద్వారానికి ఎదురుగా సుమారు ఆరు అడుగుల ఎతైన నల్లటి రాయితో పీఠాన్ని ఏర్పాటు చేశారు. ఆ ముందు భాగంలోని మంటపం వద్ద ఎనిమిది అడుగుల ఎతైన నందీశ్వరుని విగ్రహం పరమ శివుని ప్రతినిధిగా.. భక్తుల కోర్కెలను వినేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఉంటుంది. ఈ మంటపానికి కుడివైపున అఖిలాండేశ్వరి దేవి ఆలయం. గర్భగుడి ఉత్తర ముఖంగా ఉండి వాస్తుశైలిని ప్రతిబింబిస్తుంది. హొయసలుల, విజయనగర రాజుల, మొగలుల శిల్పశైలి అడుగడుగునా కనిపించటం విశేషం. బేళూరు, హళేబీడులోని హొయసల శిల్పకళ ఇక్కడ కూడా దర్శనమిస్తుంది. ముప్పైరెండు చేతులు కలిగిన అఘోరేశ్వర మూర్తిని చూట్టం జీవితంలో మరపురాని ఘట్టం. ఈ శిల్పంలో ‘కలది నాయకర’ శిల్పకళా వైభవం గోచరిస్తుంది. ఐతే - మొగలుల దాడుల్లో దాదాపుగా ఈ ఆలయం ధ్వంసమైంది. ఆ తర్వాతి కాలంలో మూలవిరాట్ స్థానంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. గర్భగుడి అవశేషాలు దేవాలయ పరిసర ప్రాంతాల్లో కనిపించి దానవుడి రాక్షసత్వానికి ప్రతిగా కనిపిస్తాయి.
ఇక దేవాలయ మెట్లను దిగి వస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆనాటి శిల్ప వైభవం ఎంతటిదో అని ఆశ్చర్యం కలుగక మానదు. సుమారు ఐదు వందల సంవత్సరాల నుండి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూన్నప్పటికీ నేటికీ ఆ రాళ్లలోని నునుపుదనం.. ఎరుపు, గోధుమ రంగులు మాయకుండా మెరుస్తూ ఉండటం.
ఈ ప్రాంతం ఒకనాడు కదలియ నాయకుల ప్రప్రథమ రాజధాని. ఆనాటి రాజుల వైభవానికి చిహ్నంగా.. అలరారే ‘కళదియ’ మ్యూజియంని చూడొచ్చు. ఇదొక అమూల్య భాండాగారం. వివిధ గ్రంథాలతోపాటు పాత నాణెలు, పురాతన ఖడ్గాలు, కత్తులు, వివాహ పత్రాలు, చిత్రపటాలు, సైనికులు ధరించే శిరస్త్రాణాలు, హొయసల, చాళుక్యుల కాలంనాటి లోహమూర్తి శిల్పాలు ఎన్నో కనిపిస్తాయి. కేవలం రెండు బెండు ముక్కలు దూరేంత కంతలో లోపలంతా డొల్లగా వున్న రాతిగుండు ఒకటి చూపరులను విస్మయానికి గురిచేస్తుంది. సుమారు మూడు వేల వరకూ ఉన్న కట్టడాలు. ఒక్కొక్కటి వందల అడుగుల పొడవున్న స్తంభాలు, ప్రాచీన శిలా శాసనాలు. వీటిపై కన్నడ, సంస్కృతం, తెలుగు, తిగశిరి లిపిలో రాసిన చరిత్ర పర్యాటకులను ఆకర్షిస్తుంది.

Post a Comment