Breaking News
Join This Site
జ్యోతిర్లింగముల వైభవం (పీఠిక)

జ్యోతిర్లింగముల వైభవం (పీఠిక)


       శాస్త్ర సంబంధం అయిన మాటలలో కొన్ని ఆశ్చర్యకరమయిన మాటలు ఉంటాయి. మీరు కంచిలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి దానిని జ్యోతిర్లింగం అంటే శాస్త్రం అంగీకరించదు. దానిని అష్టమూర్తులయందు ఒక లింగము – పృథివీలింగము అని పిలుస్తారు. పంచ భూతలింగములలో ఒకటి. శ్రీకాళహస్తిలోని లింగము వాయులింగము. అది జ్యోతిర్లింగం కాదు. జంబుకేశ్వరంలోని శివలింగం జలలింగం. అది జ్యోతిర్లింగం కాదు. కానీ కొన్ని శివలింగములను జ్యోతిర్లింగములు అని పిలుస్తారు. 

“సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం” అని మనం ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం చదువుతుంటాం. ఈ పన్నెండింటినీ మనం జ్యోతిర్లింగములని పిలుస్తున్నాము. 


      సోమనాథుడు – సోమనాథ్ – గుజరాత్; మల్లికార్జున స్వామి – శ్రీశైలం - ఆంధ్రప్రదేశ్; మహాకాలేశ్వరుడు - ఉజ్జయిని – మధ్యప్రదేశ్; అమలేశ్వరుడు – ఓంకారేశ్వరం – మధ్యప్రదేశ్; వైద్యనాథుడు – పర్లి – జార్ఖండ్; భీమశంకరుడు – పూణే – మహారాష్ట్ర; రామలింగేశ్వరుడు – రామేశ్వరం – తమిళనాడు; నాగేశ్వరుడు – ఔండా – గుజరాత్; విశ్వనాథుడు – వారణాసి – ఉత్తరప్రదేశ్; త్ర్యంబకేశ్వరుడు – నాసిక్ – మహారాష్ట్ర; కేదారేశ్వరుడు – కేదారనాథ్ – హిమాచల్ ప్రదేశ్; ఘ్రుష్ణేశ్వరుడు – వెరుల్ – మహారాష్ట్ర.

       జ్యోతిర్లింగములని మనం వాటిని పిలిచినప్పుడు ఈ పన్నెండు చోట్ల జ్యోతి ఉండాలి. కానీ మనం ఆయా క్షేత్రములకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ మనకు శివలింగమే కనపడుతుంది. కానీ జ్యోతి కనపడదు. అయితే ఈ పన్నెండింటిలోనే జ్యోతిర్లింగములని ఎందుకు అంటారు? దీనికి సమాధానం “ఆపాతాళనభఃస్థలా” అని రుద్రమునకు ఉన్న ప్రార్థనా గద్యయందు చెప్పారు. మీరు ఆ లింగం దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు ఇహమునందు కావలసిన సౌఖ్యమునుండి మోక్షము వరకు ఏదయినా ఇవ్వగలిగిన పరబ్రహ్మ స్వరూపంగా ఆ శివలింగం ఉన్నది.ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్నా కోరికలు తీరవలెనన్నా శివుడిని అర్చించాలి. కోర్కె తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చేయగలిగిన శివలింగములు ఏవి ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు. అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభు – ఒకరు ప్రతిష్ఠించినవి కావు. ఈశ్వరుడు చిత్రవిచిత్రమయిన పరిస్థితులలో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి మనం స్థల పురాణములను పరిశీలించాలి. ఆయా కథలను తెలుసుకుని స్మరించడం చేత స్వయంభువు అయిన ఈశ్వరుడు ప్రసన్నుడై ఎన్నో శుభఫలితములను ఇస్తాడు. ఆయా కథలను వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనస్సు ఆయా క్షేత్రముల వద్దకు వెళ్ళిపోతుంది.

ఓం నమఃశ్శివాయః

Post a Comment