Breaking News
Join This Site
ఉదంకుడి గురుభక్తి (మహాభారతంలో మంచి కథలు)

ఉదంకుడి గురుభక్తి (మహాభారతంలో మంచి కథలు)పైలుడు అనే గురువు దగ్గర విద్య అభ్యసించాడు ఉదంకుడు. అతడికి విపరీతమైన గురుభక్తి ఉంది. భక్తితో పాటు ఉదంకుడికి అకారణ క్రోదం కూడా ఎక్కువే. అలాగే పైలుడుకి కూడా ఉదంకుడంటే ప్రేమ ఉంది. అందువల్ల తోటి విద్యార్ధులు అంతా విద్యాభ్యాసం పూర్తి చేసి వారివారి ప్రదేశాలకు వెళ్ళిపోయినా ఉదంకుడిని మాత్రం పంపలేదు. ఇలా చాల సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ విషయాన్నీ ఉదంకుడు కూడా పట్టించుకోకుండా గురువు గారిని భక్తితో సేవించుకుంటూ గురువు వద్దే ఉండిపోయాడు. ఒకనాడు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి మోపు కట్టి శిరస్సు మీద పెట్టుకొని వచ్చి దించబోతుంటే తన తల వెంట్రుకలు ఆ కట్టేల్లో చిక్కుకొని కొన్ని ఊడిపోయాయి. వాడిని చూసి ఏడవడం మొదలెట్టాడు ఉదంకుడు. అయ్యో అమ్మగారు నా వెంట్రుకలు చూడండి తెల్లబడి పోయాయి. నాతరువాత వచ్చిన శిష్యుల్ని కూడా గురువుగారు పంపించేశారు. నన్ను మాత్రం ఇక్కడే ఉంచేశారు అని లబోదిబో అని ఏడుస్తుంటే గురువుగారు కూడా అక్కడికి వచ్చి ఆ సంఘటన చూసి ఉదంక దేనికి ఇంతలా చింతిస్తున్నావు? వెంట్రుకలు తెల్లబడినవి అనేకదా. సరే చూడు అని ఉదంకుడి తలని, తన శరీరాన్ని చేతితో నిమిరాడు. అంతే అప్పటికప్పుడు ఉదంకుడు నవ యవ్వనుడు అయిపోయాడు. అలాగే తన కూతిరిని కూడా నవ యవ్వనవతి గా మార్చేసి ఉదంకుడిని వివాహం చేసుకోమన్నాడు. ఉదంకుడు గురువు గారి పుత్రి నాకు సోదరి అవుతుంది కదా. మరి ఎలా వివాహం చేసుకోగలను అని అడిగాడు.

పైలుడు చిరు మందహాసం చేసి నాయన నువ్వు తిరిగి యవ్వనం పొందనంత వరకు నీకు గురువు కుమార్తె సోదరితో సమానమే. ఇది యదార్థం కూడా. కానీ నీ రూపురేఖలు తిరిగి యవ్వనం పొందడంతో మరో జన్మ వచ్చినట్టు. కాబట్టి సందేహించకుండా గురుపుత్రికని వివాహం చేసుకోవచ్చు అని చెప్పాడు. ఉదంకుడు సరే అని గురువు ఆజ్ఞ శిరసావహించి వివాహం చేసుకున్నాడు. పైలుడు సంతోషించి నాయన నీ విద్యాబ్యాసం పూర్తి అయ్యింది కనుక ఇంకా నీ ఇచ్చ వచ్చిన చోటికి వెళ్ళు అని ఆశీర్వదించాడు. 

    ఐతే ఉదంకుడు గురువుగారు గురుదక్షిణ ఇవ్వకుండా నేర్చిన విద్య వ్యర్ధం అని శాస్త్రం. కాబట్టి మీకు ఏమి కావాలో సెలవిస్తే నేను అది చేయడానికి సిద్ధం అని అన్నాడు. నాయన నాకు కోరికలు ఏమి ఉంటాయి. మీరు బాగుంటే అదే నాకు ఆనందం. కాబట్టి వెళ్లి రా. అనగా! లేదు గురువుగారు మీరు చెప్పాల్సిందే అని పట్టుబట్టగా! గురువుగారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఉదంకుడు గురువుగారు వెళ్ళిపోయినా తన పంతం విడువకుండా గురుపత్ని దగ్గరికి వెళ్లి అమ్మ కనీసం మీరైన చెప్పండి! అని బ్రతిమలాడగా సరే నాయన నేను ఒక వ్రతం చేయాలని సంకల్పించాను. దానికి పరమసాద్వి, గుణవంతురాలు, పరమ పతివ్రతా అయిన పౌష్యుడి పత్ని వద్ద ఉన్న కుండలాలు (వ్రతం చేసేవారు బంగారం ధరించి వ్రతం చేయాలి అని శాస్త్రం. ఐతే వీరు అడవిలో ఉండడం వలన  ఇన్నాళ్ళు చెవి రంద్రాలకి పుల్లలు పెట్టుకుంది). తీసుకునిరా. అంటే సరే అని బయలుదేరాడు.ఉదంకుడు గురుపత్నికి నమస్కరించి పౌష్యుడి రాజధానికి భయలుదేరి వెళుతూ ఉండగా మధ్యదారిలో పెద్ద ఎద్దుని ఎక్కిన ఒక మహానుభావుడు ఎదురుగా వచ్చి ఉదంకా! నువ్వు నీ గురుపత్ని అజ్ఞమేరకు పౌష్యుడి నగరానికి వెళుతున్నావు. ఎందుకు ఏమిటి అని మారు మాట్లాడకుండా ఈ ఎద్దు వేసిన గోమయం(పేడ) తిని వెళ్ళు. అన్నాడు. 

ఉదంకుడు ఆయన్ని చూడగానే గౌరవపూర్వకంగా రెండు చేతులతో నమస్కరించి అయన చెప్పిన విధంగా గోమయం తిని వెళ్ళిపోయాడు. ఆయనకూడా ఆశీర్వదించి మాయమైపోయాడు. అలా పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళగానే ఉండకుడిని చూసి తన సింహాసనం మీద నుండి లేచి ఉదంకుడిని సింహాసం మీద కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాదులు అర్పించి మహానుభావ! తమరి రాకకు ఏమి కారణమో సెలవిచ్చి మీ సేవ చేసుకునే భాగ్యం కలిగించండి అన్నాడు.

పు=పౌష్య మహారాజా! నేను మా గురువుగారి పత్ని వ్రత ఉజ్జాపన కోసం మీదేవేరి కుండలాలు తీసుకుని రమ్మంది ఆజ్ఞాపించింది. కనుక వారిని మీరు ఇప్పించవలసినదిగా కోరుతున్నాను అనగా. దానికి పౌష్యుడు సంతసించి మహానుభావా! అవి నాదేవేరి చెవులకి అలంకరించుకుని తన మందిరంలో ఉంది.,మీరే వెళ్లి స్వయంగా తీసుకోండి! (ఇక్కడ ఋషులని, మునులని, గురువులని, బ్రహ్మచారులని రాజ మందిరంలోకి పంపించవచ్చు అనే ఉద్దేశ్యం). అనగా! ఉదంకుడు సరేనని  మందిరానికి వెళ్ళాడు అక్కడ ఎక్కడ చూసినా ఆవిడ కనపడలేదు. దాంతో కొద్దిగా కోపం వచ్చింది ఉదంకుడుకి. పక్కనే చెలుకత్తెలు ఉండడంతో చెలుకత్తెలని విచారించాడు. మహర్షి! మహారాణి ఇక్కడే ఆసనం మీదే ఉంది కదా! లేదని అంటారేమిటి అన్నారు. అమ్మాయిలు!నాతొ చెతుర్లు ఎందుకు నిజం చెప్పండి. మహారాణి గారు ఎక్కడ ఉన్నారు అంటే.. మళ్ళి అదే సమాధానం. మాకు కనబడుతుంది. మీకు ఎందుకు కనబడడం లేదో మాకు తెలియడం లేదు అన్నారు.

 వెంటనే పౌష్యుడి వద్దకి వెళ్లి మీ దేవేరి నాకు కనబడలేదు. నువ్వే వెళ్లి తీసుకురా అన్నాడు. దానికి పౌష్యుడు అయ్యా నన్ను క్షమించండి. మిమ్మల్ని "అసుచివి" అని అనలేను. ఎందుకంటే మీరు మహానుభావులు. తపస్విలు. అసుచిగా ఉన్నారు అనలేను. కాని మహారాణి అసుచిగా ఉండే వారికీ ఎవ్వరికి కనబడదు. ఆమె అంత పతివ్రత. మరి మీరు ఏమి చేసి వచ్చారో నాకు తెలియదు. అనగానే ఉదంకుడు కొంతసేపు అలోచించి! ఆ గుర్తోచింది నేను వస్తుండగా ఎవరో మహానుభావుడు ఎద్దుమీదవచ్చి గోమయం తినమన్నాడు. బహుశా  అందువల్ల కనపడలేదు అనుకోని దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి కాళ్ళు, మొహం కడిగి ఆచమనం చేసి మందిరానికి వెళ్ళగానే ఎదురుగ ఉన్న పౌష్యపత్ని కనబడింది. వెంటనే ఆవిడకి నమస్కరించి విషయం చెప్పగానే కుండలాలు ఇచ్చింది.       మునీశ్వర మీకు ఒక చిన్న విన్నపం. ఈ కుండలాలు మీరు ఎక్కడా కింద పెట్టకుండా తీసుకెళ్ళండి. ఈ కుండలాల కోసం తక్షకుడు ఎన్నోసార్లు నన్ను అడిగాడు. కానీ తక్షకుడు భయంకరుడు, నీచ్యుడు కావడం వాల్ల నేను వీటిని వాడికి ఇవ్వలేదు.వాడు ఎక్కడో  వీటికోసం పొంచి ఉంటాడు. ఇవి తక్షకుడు దొంగించిన తరువాత నేను కూడా  ఏమి చేయలేను అనగానే! సరే జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను ని ఆ కుండలాలు తీసుకుని రాజు దగ్గరికి వెళ్లి వచ్చిన కార్యం సిద్దించింది కాబట్టి ఇక నేను బయలు దేరతాను అన్నాడు. 

        రాజుగారు అయ్యా! మీరు భోజన సమయానికి వచ్చారు కనుక మావిందు స్వీకరించి వెళ్ళండి అన్నాడు. సరే అని భోజనం చేయడానికి కూర్చున్నాడు. పౌష్యుడే స్వయంగా అన్నం వడ్డించాడు. ఉదంకుడు ఆపోసన పట్టి తినబోతూ ఉండగా అన్నంలో వెంట్రుకలు కనబడ్డాయి. అవి చూసి "ఛీ నీచ్యుడా వెంట్రుకలు, చీమలు, దోమలు, నీరుకారే అన్నం పెట్టకూడ"దని తెలిదా? ఇది గ్రహించకుండా అన్నం చూడకుండా వడ్డించావు. కాబట్టి గుడ్డివాడివి అయిపో అని శపించాడు. నాకు తెలియకుండా జరిగిన దానికి నన్ను శాపిస్తావా? నీకు పిల్లలు పుట్టకుండా పోవుగాక అని ప్రతిశాపం పెట్టాడు పౌష్యుడు.

      వెంటనే తెలివి తెచ్చుకున్న ఉదంకుడు అయ్యో ఇన్నాళ్ళు గురుశుశ్రూష చేసుకున్న ఫలితం శూన్యం అయ్యిందే అని భాధ పడి! రాజా! మహానుభావులైన మునుల మాట వజ్రాయుధం వంటిది కానీ మనస్సు వెన్న కాబట్టి నా శాపాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. నీ శాపం కూడా వెనక్కి తీసుకో అనగానే పౌష్యుడు మనుజేశ్వర మీకు తెలియనిది ఏమివుంది? మహారాజు మాట వెన్న, మనస్సు వజ్రాయుధం వంటిది. కాబట్టి నాకు ఇంకా మీ మీద కోపం చల్లారలేదు శాపం వెనక్కి తీసుకోలేను అన్నాడు. ఉదంకుడు చేసేది ఏమి లేక అక్కడినుండి వెళ్ళిపోయాడు.

    ఆవిధంగా శాపం పొంది తిరిగి గురువు ఆశ్రమం వద్దకు వెళుతూ కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత సంద్యా సమయం కావడంతో పౌష్యపత్ని చెప్పిన విషయం మరచి కుండలాలు కింద పెట్టి చెరువులోకి దిగి ఆచమనం చేస్తుండగా తక్షకుడు దిగంబర రూపం ధరించి కుండలాలు తీసుకుని పరిగెత్తాడు. అది చూసి ఉదంకుడు తక్షకుడు వెంటపడ్డాడు. తక్షకుడు దిగంబర వేషం వదిలి తన నిజస్వరూపం దాల్చి పాతాళలోకం వెళ్ళిపోయాడు. ఉదంకుడు అక్కడ ఉన్న చిన్నపుల్ల తీసుకొని తక్షకుడు వెళ్ళిన పుట్ట తవ్వుతూ ఉంటే అక్కడికి ఒక మహానుభావుడు వచ్చి ఈ పుల్లతో పుట్టని ఎంతసేపు తవ్వి పాతాళలోకం లోకి వెళ్తావు. అని అడిగితె నేను తవ్వి తవ్వి చస్తాను కాని కుండలాలు లేకుండా మా గురువుగారి దగ్గరికి వెళ్ళను అని తవ్వుతూ ఉన్నాడు. దాన్ని చూసి ఆ పురుషుడు తన దగ్గర ఉన్న వజ్రాయుధంతో నేల మీద కొట్టాడు. వెంటనే భూమి పెళ పెళ ధ్వనులతో చీలిపోయి పాతాళలోకం లోకి దారి ఇచ్చింది. ఉదంకా! ఇక వెళ్ళు. ఇదే పాతాళ లోకానికి వెళ్ళే దారి అనగానే  ఉదంకుడు ఆ దారివెంట పాతాళలోకం లోకి వెళ్ళాడు.

    అక్కడ ఇద్దరు స్త్రీ లు తెల్లని నల్లని దారాలు ఉన్న మగ్గాన్ని తొక్కుతున్నారు. ఆ పక్కనే ఆరుగురు యువకులు 12 ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్నారు. వారిని చూసి ఎవరు వీరు అనుకుంటూ వచ్చిన విషయం గుర్తుకువచ్చి ఆదిశేషుడిని, ఇతర దేవతా సర్పాలని, తక్షకుడిని కీర్తించాడు.

"బహువనపాదపాబ్ది కులపర్వతపూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళిఁ దాల్చి దు
స్సహతరమూర్తికిన్ జలధిశాయికిఁ బాయక శయ్య యైన య
య్యహీపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్."
"సరస్స, సరస్వ, మజస్ర, సహస్ర, దుస్సహ," ఈ పద్యంలో కనబడే పాము బుసలు ఇవి. నన్నయ గారు చాల అద్భుతంగా ఉదంకుడి చేత పలికించారు. ఎంతగా కీర్తించినా ఎవ్వరు కరుణించలేదు. ఇంతలో గుర్రం ఎక్కి ఒకపురుషుడు అక్కడికి వచ్చి పాములు పొగిడితే మాట వింటాయా? కొందరు చెపితే వింటారు, కొందరు తిడితే వింటారు, కొందరిని దండిస్తే వింటారు. దండం దశగుణ భవేత్ అన్నారు. అందులోను ఇవి విషాన్ని చిమ్మే క్రూరమైన సర్పాలు. వీటిని దండించక పొతే దారికిరావు. నువ్వు ఈపని చేసేది ఏంటి అనుకోకుండా నేను చెప్పినట్టు ఈ గుర్రం అపానంలో(మలద్వారంలో) ఊదు. (నన్నయ గారు ఆంద్ర మహాభారతంలో ఋషులు అపానంలో ఊదటం అంటే బాగోదు అనుకున్నారేమో చెవిలో ఊదమన్నారు. ఐతే అగ్ని ఊర్ధ్వ ముఖుడు కాబట్టి అపానంలో ఊదడమే సరైంది అని వ్యాసుని అభిప్రాయం. అగ్నిని ఊర్ద్వ ముఖుడు కనుక కిందనుండి ఊదితేనే కదా పైకి వస్తాడు.) 

      దానికి సరే అని వెళ్లి అపానంలో ఊదగానే గుర్రం చెవులు, కళ్ళు, నోటినుండి తీవ్రమైన అగ్ని జ్వాలలు పుట్టుకొచ్చి పాతాళలోకం అంతటా విస్తరించాయి. ఆ అగ్నికి అక్కడ ఉన్న పాములన్నీ మలమలా మాడిపోతుంటే సర్పరాజు కూడా భయపడి వెంటనే వెళ్లి తక్షకుడిని మందలించి కుండలాలు ఇచ్చి రమ్మన్నాడు. తక్షకుడు చేసేది లేక వెళ్లి ఉదంకుడికి కుండలాలు ఇచ్చాడు. అవి తీసుకుని గురుపత్ని వ్రత సమయం దగ్గర పడింది. నేను వెళ్ళేలోపు సమయం గడిచిపోతుంది. ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే ఆ పురుషుడు వచ్చి ఈ గుర్రం మీద ఎక్కి నువ్వు కోరుకున్న ప్రదేశానికి వాయు, మనో వేగాలతో నిన్ను చేరుస్తుంది అనగానే వెంటనే గుర్రం ఎక్కి క్షణకాలంలో ఆశ్రమం చేరుకున్నాడు. అప్పుడే వ్రతానికి ఉపక్రమిస్తున్న గురుపత్ని నూతన వస్త్రాలు కట్టుకొని సిద్ధంగా ఉంది. ఉదంకుడిని చూసి సంతోషించి ఆ కుండలాలు తీసుకొని వ్రతం ముగించింది.

     కుండలాలు అమ్మగారికి ఇచ్చి గురువు గారిని కలిశాడు ఉదంకుడు. ఉదంక! దగ్గరలోనే ఉన్న పౌష్యుడి నగరానికి వెళ్లి రావడానికి 4రోజుల సమయం పట్టిందే ఎందుకని? నిజమే గురువుగారు కానీ ఇక్కడి నుండి బయలుదేరగానే ఒకడు ఎద్దుమీద వచ్చి గోమయం(పేడ) తినమన్నాడు. పౌష్యుడిని కలిసి కుండలాలు తీసుకొస్తుంటే తక్షకుడు ఈ కుండలాలతో పాతాళలోకం లోకి వెళ్ళిపోయాడు. మళ్ళి అప్పుడు కూడా ఇంకో పురుషుడు వచ్చి పాతాళలోకం లోకి దారి ఏర్పరిచాడు. అక్కడికి వెళ్ళగానే తెలుపు, నలుపు దారాలు ఉన్న మగ్గాన్ని ఇద్దరు స్త్రీ లు నేస్తున్నారు. 12 ఆకులు ఉన్న చక్రాన్ని 6గురు యువకులు త్రిప్పుతున్నారు. ఇంతలో ఒక గుర్రం, ఆ గుర్రం మీద ఇంకో పురుషుడు వచ్చాడు. ఆగుర్రం మీద ఎక్కి ఇక్కడికి మనో వేగంతో ఇక్కడికి వచ్చాను. గురువుగారు! అసలు ఎవరు వీళ్ళంతా? అంతా అయోమయంగా తోస్తుంది. ఏమిటో తెలియజేయండి.

పైలుడు చిరు మందహాసం చేసి ఉదంకా! మొదట నువ్వు కలసిన దివ్య పురుషుడు ''ఇంద్రుడు''. ఆ ఎద్దు ఇంద్రుడి వాహనం అయిన ఐరావతం. నువ్వు తిన్నది గోమయం కాదు అమృతం. ఆ పేడ తినడం వల్ల వాన్చితార్ధసిద్ధి కలిగింది. తరువాత పాతాళలోకం లోకి వెళ్ళడానికి దారి చూపించింది ఇంద్రుడే. అతని చేత ధరించిన ఖడ్గం వజ్రాయుధం. ఇక పాతాళలోకంలో నువ్వు చుసిన స్త్రీలు ''ధాత, విధాత''. తెల్లని, నల్లని దారాలు రేయింబవళ్ళు, 12 ఆకుల చక్రం సంవత్సర మాసాలు, ఆ 6గురు యువకులు ఋతువులు. (వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్, హేమంతం, శిశిరం), ఆ గుర్రం అగ్ని, దాన్ని ఎక్కిన పురుషుడు ఇంద్రుడి మిత్రుడు పర్జనుడు. వీళ్ళంతా నీకు సహాయ పడటానికి వచ్చారు. దీనికి ఏకైక హేతువు నీకు గురువుపై ఉన్న గురుభక్తి. గురుభక్తి ఉంటే గురువు అండదండలు ఉంటే ఎంతటి కార్యాన్నైనా అవలీలగా సాదించొచ్చు. నీకున్న గురుభక్తి వల్ల ఈ కార్యాన్ని అవలీలగా సాదించగలిగావు. ఇక వెళ్లిరా నాయన. అనగానే సతీసమేతంగా బయలుదేరాడు. ఆ తరువాత పైలుడు తన పత్నితో ఉదంకుడు చేసిన గురునింద(ఉదంకుడు తొందరపడి గురువుగారు నా విషయం మర్చిపోయారు అని ఏడ్చాడు) అనే చిన్న పొరపాటు వల్ల సంతాన హీనుడు అయ్యాడు. పైగా పౌష్యుడి శాపం కూడా దానికి తోడయ్యింది. అని బాధపడ్డాడు. 


అలా ఉదంకుడు వెళ్ళిపోయాడు కానీ తక్షకుడు మీద తనకి చేసిన అపకారం మూలంగా తీవ్రమైన కోపం చెలరేగింది! ఎలాగైనా తక్షకుడిని నాశనం చేయాలని ప్రతినబూనాడు. అందుకోసం జనమేజయుడిని కలిసి సర్పయగానికి ఉసిగొల్పాడు. ఈ కథ విన్న శౌనకాది మునులు మళ్ళి సందేహం వచ్చి అసలు ఈ సర్పాలు మీద కోపం రావడానికి కారణం ఏంటి? ఈ సర్పయాగం తలపెట్టడానికి ఏమి హేతువు? అని సౌతిని అడిగారు.

Post a Comment